NTV Telugu Site icon

Off The Record: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అధికార పార్టీకి ఓట్ల వరద పారిస్తుందా..?

Palamuru

Palamuru

Off The Record: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 270 కిలోమీటర్ల మేర కృష్ణా నది ప్రవహిస్తున్నా.. నదికి రెండువైపులా పాలమూరు పొలాలే ఉన్నా.. నీటిని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి. సాగు నీటి పథకాలు అరకొరగానే ఉండడం, కొత్త స్కీములు కాగితాలకే పరిమితమవడంతో వరద నీటిని కనీస స్థాయిలో కూడా వినియోగించుకోలేని పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో సుమారు 26 లక్షల 82వేల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉంటే ప్రస్తుతం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా.. ఇక్కడ నిర్మించిన ప్రాజెక్టులు, రిజర్వాయర్ల సామర్థ్యం అత్యల్పంగా ఉండడంతో ఏటా కనీసం 400 నుంచి800 టీఎంసీల నీటిని దిగువకు వదలాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెబుతోంది బీఆర్‌ఎస్‌.

సీఎం టూర్‌ తర్వాత జిల్లా పార్టీలో ఫుల్‌ జోష్‌ వచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ వల్ల ప్రభావితం అయ్యే… 19 నియోజకవర్గాల్లో తమకు ఓట్ల వరద పారుతుందని అధికార పార్టీ అంచనా వేస్తుంటే… ప్రతిపక్షాలు మాత్రం మా ప్రశ్నకు బదులేదని అడుగుతున్నాయి. 40 శాతం కూడా పనులు పూర్తవని ప్రాజెక్ట్‌కు ప్రారంభం పేరుతో హడావిడిని ఎలా అర్ధం చేసుకోవాలంటున్నాయి. ఇది ఎలక్షన్‌ స్టంట్‌ తప్ప మరోటి కాదన్నది విపక్షాల వాదన. అటు దశాబ్దాల తరబడి కరవు కాటకాలతో అల్లాడిన జిల్లాకు, చెంతనే కృష్ణమ్మ పరుగులు పెడుతున్నా… గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్ళ కోసం అల్లాడిన జనానికి ఈ ఎత్తిపోతల పథకం ఒక వరమన్నది అధికార పార్టీ మాట. ఇక బొంబాయి, దుబాయి లాంటి ప్రాంతాలకు పాలమూరు ప్రజల వలసలు ఆగుతాయని, నీటి సమస్యలు తీరతాయని చెబుతూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది బీఆర్‌ఎస్‌. మహబూబ్ నగర్, నాగర్‌కర్నూలు, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 19 నియోజకవర్గాలు, 90 మండలాల్లోని12లక్షల 30 వేల ఎకరాలకు సాగు నీరు, పరిశ్రమలకు, ప్రజలకు తాగు నీరు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే అవన్నీ కబుర్లేనని, అసలు సిసలు వాస్తవాలేంటో మా దగ్గర ఉన్నాయంటున్నాయి ప్రతిపక్షాలు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లో ఒక పంపును మాత్రమే కేసీఆర్‌ ప్రారంభించారని విమర్శిస్తున్నాయి.

ఒక్క పంపుతో లక్షల ఎకరాలకు నీరు ఎలా అందుతుందని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఓట్ల కోసమే… ప్రాజెక్ట్‌ పూర్తవకుండా… ప్రజల్ని మభ్యపెట్టేందుకు హడావిడిగా ప్రారంభించారని విమర్శిస్తున్నారు విపక్ష నేతలు. అయితే…2015లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు కేంద్రం పూర్తి అనుమతులు ఇవ్వడానికి తొమ్మిదేళ్లు పట్టింది. ఇంత ఆలస్యం కావడానికి కారణం ప్రతిపక్షాలే కారణం అన్నది అధికార పార్టీ వెర్షన్‌. అయితే ఆరు జిల్లాల్లోని 19 నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చూపి ఈసారి ఓట్లు ఆడిగేందుకు సిద్ధమయ్యారు. ఇన్నేళ్ళు జిల్లా రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసి… ప్రస్తుతం కళ్ళ ముందు కనిపించే అభివృద్ధి గురించి మాట్లాడుతూ… భవిష్యత్‌లో అందుబాటులోకి వచ్చే సాగుభూమి గురించి వివరిస్తున్నారు. ఈ 19 నియోజకవర్గాల్లో ఒకప్పుడు లక్షా, రెండు లక్షలకు ఎకరం భూమి ధర ఉంటే ఇప్పుడు 25 లక్షలకు పైనే పలుకుతోందని అంటున్నాయి రియల్ ఎస్టేట్ వర్గాలు. నాటి కష్టాలను వివరిస్తూ… మరోసారి తమను గెలిపిస్తే… రాబోయే సుఖాల గురించి వివరిస్తూ… ఓట్లు అడగాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తుంటే….అసలు 40 శాతం కూడా పనులు పూర్తి కాకముందే పంపులు ప్రారంభించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ప్రజల్నే అడుగుతామంటున్నాయి ప్రతిపక్షాలు. దీంతో ఇంతకీ… పాలమూరు నీరు ముంచేదెవర్ని, తేల్చేదెవర్ని అన్న చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.

Show comments