NTV Telugu Site icon

Off The Record: సానుభూతి అస్త్రంతో జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం!

Otr Jeevan Reddy

Otr Jeevan Reddy

Off The Record: ఒక్క ఛాన్స్‌…. ఒకే ఒక్క లాస్ట్‌ ఛాన్స్‌… ఇప్పుడు గెలిపిస్తే చాలు… చిట్ట చివరిగా మీ సేవ చేసుకుని… ఊహించనంత అభివృద్ధి చేసేసి ఇక మీ గుండెల్లో గుడి కట్టేసుకుంటున్నారు ఆ కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌. చివరి అవకాశం పేరుతో ఓటర్లకు సెంటిమెంట్‌ ఆయింట్‌ మెంట్‌ రాసే ప్రయత్నంలో ఉన్నారాయన. ఆయన ప్రత్యర్థి మాత్రం జై శ్రీరామ్‌ అంటూ మరో నినాదం అందుకున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు సెంటిమెంట్‌ లీడర్స్‌? ఎక్కడ జరుగుతోందా సానుభూతి రాజకీయం?

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఢీ అంటే ఢీ అంటున్నాయి కాంగ్రెస్- బీజేపీ. ఎన్నికల ప్రచారం సైతం హోరా హోరీగా జరుగుతోంది. ఈ క్రమంలోనే…సులువుగా గెలుపు తీరాలకు చేరేందుకు ఓ ఆఖరు అస్త్రాన్ని బయటికి తీశారట కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి. దాంతో సానుభూతిని రగిల్చే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. అది గనక వర్కౌట్‌ అయితే చాలు… ఇక తాను గెలిచినట్టేనని భావిస్తున్నారట జీవన్‌రెడ్డి. తనకు ఇవే చివరి ఎన్నికలని, ఆఖరు ఛాన్స్‌ ఇవ్వమంటూ దాదాపు కన్నీరు పెట్టుకున్న రేంజ్‌లో ఓటర్లను అడుగుతున్నారట జీవన్‌. ఏడు పదుల వయస్సులో.. ఉత్సాహంగా సభలు, సమావేశాల్లో పాల్గొంటున్న మాజీ మంత్రి…ఒక్క ఛాన్స్‌, లాస్ట్‌ ఛాన్స్‌ అనడం చూసి కొన్ని వర్గాలు సైతం ఆలోచనలో పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నాకిక పెద్దగా కోరికలేం లేవు. లాస్ట్‌ ఛాన్స్‌ ఇస్తే… నియోజకవర్గాన్ని విచ్చలవిడిగా డెవలప్‌ చేసేసి మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతానంటూ… టన్నులు టన్నులుగా సెంటిమెంట్‌ని పిండేస్తున్నారన్నది లోకల్‌ టాక్‌. బీజేపీ వేస్తున్న నాన్ లోకల్ ముద్రను పొగొట్టుకునే ప్రయత్నం కూడా మొదలుపెట్టారట. నేనిక నిజామాబాద్‌లోనే ఉంటా… ఇందూరు అభివృద్ధికి కట్టుబడి ఉంటానంటూ లోకల్ వెపన్‌ని కూడా బయటికి తీస్తున్నారు జీవన్‌రెడ్డి.

నేను రైతు బిడ్డను, ప్రశ్నించే గొంతుకను అంటూ రోజుకో నినాదంతో ప్రజల్లోకి వెళ్తూ… సానుభూతిని రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. మ్యానిఫెస్టోను గడప గడపకు తీసుకెళ్తూనే..ఓటర్లకు సెంటిమెంట్‌ ఆయింట్‌మెంట్‌ని రాసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు జాతీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉందన్నది పరిశీలకుల మాట. అందుకే నేతలు రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అభ్యర్థితో పాటు రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సైతం సీరియస్‌గానే తిరుగుతున్నారట. బీజేపీ అభ్యర్ధి అర్వింద్‌కు అహంకారం ఎక్కువని, అదే సమయంలో జీవన్ రెడ్డి సౌమ్యుడని, అహంకారానికి, మంచితనానికి మధ్య ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేయడం కాక రేపుతోంది. అలాగే లాస్ట్‌ ఛాన్స్‌ అంటూ జీవన్ రెడ్డి చేస్తున్న విన్నపాలపై కూడా చర్చ జరుగుతోందట. ఇటు బీజేపీ అభ్యర్ధి అర్వింద్ సైతం మోదీ జపం చేస్తున్నారు. ఎక్కడా తనకు ఓటేయాలని నేరుగా కోరకుండా కేంద్రంలో మోదీని బలపరచాలంటూ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారాయన. అయోధ్య రామ మందిరం, మోదీ మానియాను జనాల్లోకి బలంగా తీసుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు అర్వింద్‌. ఆ రెండు నినాదాలు తనను గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారట ఆయన. ఇలా ఇద్దరు అభ్యర్ధులు తమ ప్రచారాల్లో సెంటిమెంట్ గాలాలతో ఓట్ల వేటకు వెళ్తున్నారు. మరి ఎప్పటికప్పుడు విలక్షణ తీర్పు నిచ్చే ఇందూరు ఓటర్లు.. సానుభూతి ప్రయోగాన్ని ఏ మేరకు రిసీవ్‌ చేసుకుంటారో వేచి చూడాలంటున్నారు పరిశీలకులు.