NTV Telugu Site icon

Off The Record: ఏపీ బీజేపీలో కొత్త అలజడి మొదలైందా? పదవి కోసం పావులు కదుపుతున్నారా?

Bjp

Bjp

Off The Record: ఏపీ బీజేపీలో కొత్త ఆశలు రేగుతున్నాయి. త్వరలో ఖాళీ అవబోతున్న ఎమ్మెల్సీ సీట్ల కోసం నాయకులు చాపకింద నీరులా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారట.వచ్చే మార్చిలో ఎమ్మెల్యే కోటాలో నాలుగు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవబోతున్నాయి. అందులో ఒకటి బీజేపీకి ఇచ్చే ఛాన్స్‌ ఉందన్న అంచనాతో… రాష్ట్ర పార్టీ సీనియర్స్‌ పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతో పార్టీలో ఇప్పుడు కొత్త లెక్కలు, సరికొత్త సమీకరణలు తెరమీదికి వస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే కోటాలో కాపులకు ఇచ్చి ఉన్నందున ఈసారి కూడా అదే సామాజిక వర్గానికి ఇస్తారా? లేక లెక్కలు మారతాయా అన్న చర్చ నడుస్తోంది పార్టీ వర్గాల్లో. రాష్ట్రంలో తాము బలపడటానికి ఉపయోగపడే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని అనుకుంటున్నారట ఏపీ కమలనాథులు. అందుకే ఎంపిక ఆచితూచి ఉంటుందని అంటున్నారు. ఆ కోణంలో చూస్తే… కులాల లెక్కలే ప్రధాన పాత్ర పోషించవచ్చన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయం. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీలుగా పనిచేసిన కాపు సామాజికవర్గ నేతలు సైతం ట్రయల్స్‌లో ఉన్నట్టు సమాచారం. కానీ… అధిష్టానం మాత్రం మళ్లీ కాపులకే ఇస్తే…. పుంజుకుంటామా? లేక మరో సామాజికవర్గాన్ని దగ్గరకు తీస్తే… సెట్‌ అవుతుందా అని లెక్కలేసుకుంటోందట.

మరోవైపు ఎమ్మెల్సీ టిక్కెట్‌ దక్కించుకుని లక్కు కలిసొస్తే… కొన్నాళ్ళ తర్వాతైనా కేబినెట్‌లో బెర్త్‌ దక్కించుకుందామని దూరపు ఆలోచన చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారట. దీంతో కాంపిటీషన్‌ అంతకంతకూ పెరుగుతోందని అంటున్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని వాళ్ళు మాకేంటి అంటూ…పార్టీ పెద్దల మీద వత్తిడి చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీకి వచ్చే అవకాశం ఉన్నది ఒక్క సీటు… అదీకూడా మిత్రపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితేనే. కానీ… ఇటు చూస్తే… ఆశావహుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో ఏం జరగబోతోందంటూ… ఉత్కంఠగా చూస్తున్నాయి ఏపీ కాషాయ శ్రేణులు. విషయం తక్కువ, ఉత్సాహవంతులు ఎక్కువ అన్నట్టుగా మా పార్టీలో పరిస్థితి ఉందంటూ… తమకు తామే సెటైర్స్‌ వేసుకుంటున్నారట ఏపీ బీజేపీ కార్యకర్తలు. చివరికి ఎవరి ప్రయత్నాలు వర్కౌట్‌ అవుతాయో…. ఢిల్లీ పెద్దలు ఎవరి పేరు మీద టిక్‌ పెడతారో చూడాలి మరి.