NTV Telugu Site icon

Off The Record: ఇంచార్జ్ మార్పు వర్గ విభేదాలకు దారితీస్తుందా..?

Js

Js

Off The Record: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మీద ఫోకస్‌ పెట్టిన జనసేన… అక్కడ పార్టీ శ్రేణుల్ని కూడా అదే రేంజ్‌లో సిద్ధం చేస్తోంది. కొత్త నాయకత్వంతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కేడర్‌లో జోష్‌ నింపే ప్రయత్నం మొదలైందట. కొత్తగా ఇన్ఛార్జ్‌ల నియామకం ఇందులో భాగమేనంటున్నారు. కాకినాడ జిల్లాలో పిఠాపురం కోఆర్డినేటర్‌ను సడన్ గా మార్చింది జనసేన అధినాయకత్వం. పవన్ పోటీ చేస్తారు అని ప్రచారం ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి.. గత ఎన్నికల్లో ఇక్కడ పార్టీ తరపున మాకినీడు శేషు కుమారి పోటీ చేసి 28 వేల ఓట్లు సాధించారు. అయితే వారాహి యాత్ర సందర్భంగా నియోజకవర్గంలో గొడవలు బయటపడ్డాయి.. డాక్టర్ పిల్ల శ్రీధర్, మాకినీడు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ గొడవ అలా జరుగుతుండగానే.. సడన్‌గా కడియంకు చెందిన తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ను కోఆర్డినేటర్ గా ప్రకటించారు పవన్.

జిల్లాతో ఏమాత్రం సంబంధంలేని వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగించడంపై ఇప్పుడు జనసేన కేడర్లో చర్చ జరుగుతోంది. టీ టైం సంస్థ అధినేత ఉదయ శ్రీనివాస్ వారాహికి సంబంధించి అన్ని బాధ్యతలు తీసుకున్నారు. ఈసారి ఆయన రాజమండ్రి లేదా కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సడన్‌గా ఆయన్ని పిఠాపురం ఇన్చార్జ్‌గా నియమించారు పవన్‌. కాకినాడ ఎంపీగా మొదటి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు గెలుస్తున్నారు. శ్రీనివాస్ కూడా అదే సామాజికవర్గానికి చెందినవారు కాబట్టే… పవన్ కళ్యాణ్ ఆయన్ని ఇక్కడికి తీసుకువచ్చినట్టు చెప్పుకుంటున్నారు. పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ సీటును జనసేన తీసుకుంటుందని, అందుకే అప్పటివరకు పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే పిఠాపురం బాధ్యతలు శ్రీనివాస్‌ చూసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. పిఠాపురం నియోజకవర్గం కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉండటంతో అన్ని ఈక్వేషన్స్‌ కలిసి వస్తాయంటున్నారు.

ఇక రాజానగరం నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరుకు మాజీ ఎమ్మెల్యే టి.వి. రామారావును ఇన్ఛార్జ్‌లుగా నియమించారు. ఇప్పటి దాకా రాజానగరం ఇంఛార్జి బాధ్యతలు నిర్వహించిన మేడా గురుదత్‌కు పార్టీలో మరో ముఖ్య పదవి అప్పగిస్తామని, ఆయన సేవలు పూర్తి స్థాయిలో పార్టీకి వినియోగించుకుంటామని అన్నారట పవన్‌. అయితే ఈ నియామకం నియోజకవర్గంలో వర్గ విభేదాలకు దారి తీసే అవకాశం ఉందంటున్నారు. పార్టీ స్థానిక నేతలకు కనీస సమాచారం లేకుండా అకస్మాత్తుగా కో ఆర్డినేటర్‌ను నియమించడం వారికి మింగుడు పడటం లేదట. అటు కొత్త ఇన్చార్జ్‌ బలరామకృష్ణ కూడా పలు సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన భార్య వెంకటలక్ష్మి కోరుకొండ మండలం గాదరాడ ఎం.పి.టి.సి.గా వైసిపి నుంచి 2019 ఎన్నికలలో గెలుపొందారు. మండలాధ్యక్షురాలు పదవి ఇవ్వలేదంటూ నిరుడు వైసిపికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. కాపు సామాజిక వర్గానికి చెందిన బలరామకృష్ణ ఆర్థికంగా బలమైన వ్యక్తి అయినందున వచ్చే ఎన్నికలలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలుగుతారన్నది లోకల్‌ టాక్‌.

కొవ్వూరు నియోజకవర్గ కో – ఆర్డినేటర్ గా నియమితులైన టీవీ రామారావు 2009లో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు. వర్గ విభేదాల కారణంగా 2014లో టిడిపి టిక్కెట్ ఇవ్వలేదని అలకబూని 2019 ఎన్నికల ముందు వైసిపిలో చేరారు. అక్కడ కూడా తగిన గుర్తింపు లేదంటూ… కొద్ది నెలల క్రితం రాజీనామా చేసిజనసేనలో చేరారు. కొవ్వూరులో జనసేనకు పెద్దగా నాయకులు, కార్యకర్తలు లేరు. గత ఎన్నికలలో పార్టీ తరపున పోటీ చేసిన ఏలూరు రేంజ్ రిటైర్డ్ డిఐజీ రవికుమార్ మూర్తి ఘోరంగా ఓడిపోయారు. అప్పట్నుంచి పార్టీకి దూరంగా ఉన్నారాయన. సరైన కేడర్ లేక నియోజకవర్గంలో జనసేనకు ప్రజాదరణ దక్కలేదు. రామారావుకు కూడా కేడర్ లేకపోవడంతో అక్కడ పార్టీ ఎలా నిలదొక్కుకుంటున్నది ఆసక్తిగా మారింది. మొత్తం మీద ఇన్నాళ్ళుగా ఉన్న స్తబ్దతని పోగొట్టడానికి జనసేన నాయకత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. వీటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.