NTV Telugu Site icon

Off The Record: కన్నతల్లి కడుపుకోతను హేళన చేయడం కాదా..? నాయకులకు బాధ్యత ఉండక్కర్లేదా..?

Ysrcp

Ysrcp

Off The Record: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత. అందులోనూ.. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉండే వారి మాటకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. అది నాలుకా.. తాటిమట్టా అని రివర్స్‌లో తిట్టించుకోకుండా.. నోట్లో నుంచి ఎలాంటి ఆణిముత్యాలు బయటికి వస్తున్నాయో స్పృహతో ఉండాలి. అలా కాకుండా.. నోరేకదా.. పెట్టుబడేం లేదు కదా… అని ఇష్టానికి పనిచెబితే…తర్వాత నాలుక మడతేయాల్సి ఉంటుంది. ఉచ్ఛనీచాలు లేకుండా వాగేయడం… తర్వాత తూచ్‌ అనడం ఇప్పుడు రాజకీయాల్లో సర్వ సాధారణమైపోయింది. ఈ క్రమంలోనే.. తాజాగా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ముందు ప్రన్నకుమార్‌ నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాల్ని చూస్తే… అసలాయన స్పృహలో ఉండే ఆ మాటలు మాట్లాడారా అన్న అనుమానాలు వస్తున్నాయట విన్నవాళ్ళకు.

ఇటీవల తల్లి దండ్రులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళుతూ చిన్నారి లక్షిత పులి బారిన పడటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దైవ దర్శనానికి వెళుతున్న భక్తుల భద్రత పై ఆందోళనలు వ్యక్తం అవుతున్న సమయంలో ఈ ఎమ్మెల్యే గారు తన తాటిమట్టకు పనిచెప్పేశారు. లక్షిత మృతిపై అనుమానాలున్నాయని, ఆమె తల్లిదండ్రుల్ని గట్టిగా విచారించాలంటూ ఆయనగారు అన్న మాటల్ని విన్నవాళ్ళంతా నిర్ఘాంతపోయారు. అవి కేవలం మాటలు కాదు… సాక్షాత్తు పేగు బంధాన్ని అవమానించడం. ఓ కన్నతల్లి కడుపుకోతను చులకనగా హేళన చేయడం తప్ప మరోటి కాదన్న మాటలు అప్పుడే వినిపించాయి. చిన్న బిడ్డ పుట్టెంట్రుకలు తీయించడం కోసం ఆరేళ్ళ లక్షిత, బంధువులకతో కలిసి వెళ్లిన ఆ తల్లిదండ్రులకు నిజంగా శపించే శక్తి ఉంటే… ఈ ఎమ్మెల్యే గారు ఏమైపోయేవారో. అంతలా రగిలిపోయి ఉంటారు వాళ్ళు. ఇంటా బయటా ఏకి పారేయడంతో…స్పృహలోకి వచ్చిన ప్రసన్నకుమార్‌రెడ్డి యధావిధిగా నాలుక మడతేసి… తూచ్‌ నా ఉద్దేశ్యం అదికాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ… శూలాల కంటే పదునుగా ఆ తల్లిదండ్రుల హృదయాల్ని తాకి ఆ మాటలు చేసిన గాయాల్ని ఈ ఎమ్మెల్యే గారు మాన్పగలరా? దైవ దర్శనానికి వెళ్ళి బిడ్డను చంపుకునే దౌర్భాగ్యులమా మేం… అని వాళ్ళు అడిగే ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం ఉందా? ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ఆ మాత్రం విజ్ఞత ఉండక్కర్లేదా? ఎమ్మెల్యే అన్న మాటల్ని విని షాకైన వైసీపీ పెద్దలు కూడా ఫోన్లోలోనే ఆయనకు తలంటారట.

ఆ ఎపిసోడ్ ముగుస్తుండగానే… మరో లీడర్ లైన్ లోకి వచ్చేశారు. వేటపాలెం పరిధిలోని రామన్నపేట పంచాయతీలో వార్డులకు ఉప ఎన్నికల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పరుచూరు నియోజకవర్గ ఇంఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్‌ వర్గానికి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. గొడవ సందర్భంగా రెచ్చిపోయిన ఆమంచి… కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలా సామాజికవర్గ పుట్టుకదాకా వెళ్లారు. తన ప్రత్యర్ధి అదే కులానికి చెందిన వ్యక్తి కావడంతో… ఆమంచి వ్యాఖ్యలకు అగ్గి రాజుకున్నట్లు అయ్యింది. ముందు మాట్లాడేసి… డ్యామేజ్ బాగా జరిగిందని అర్థం అయ్యాక తీరిగ్గా క్షమాపణలు చెప్పారు ఆమంచి. కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక క్షమాపణల వల్ల ఉపయోగం ఏం ఉంటుందన్నది పార్టీలోనే ఓ వర్గం మాట. ఒక వైపు ఎన్నికల గడువు దగ్గర పడుతుంటే మరింత బాధ్యతగా ఉండాల్సిన సీనియర్ నేతలే ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం పై వైసీపీ అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం. నోరు అదుపులో పెట్టుకోకపోతే వ్యక్తిగతంగా సదరు నాయకులకే కాదు పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని క్లాస్ తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా నేతలు జాగ్రత్తగా వ్యవహరిస్తారా…లేక నా నోటికి కళ్లెం లేదన్నట్లు ప్రవర్తిస్తారా అన్నది చూడాలి.