NTV Telugu Site icon

Off The Record: ఆ ఎమ్మెల్యేను ఆటలో అరటిపండు అనుకుంటున్నారా..?

Bathula Laxma Reddy

Bathula Laxma Reddy

Off The Record: భారీ మెజారిటీతో గెలిచినా.. కనీసం నియోజకవర్గంలో పనులు చేయించుకోవడానికి దిక్కు లేకుండా పోతోందని తీవ్రంగా మధనపడుతున్నారట మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. కొందరు సీనియర్‌ లీడర్స్‌ అతితో అసలు తాను శాసనసభ్యుడినన్న సంగతి మర్చిపోయేలా ఉన్నానంటూ సన్నిహితుల దగ్గర గోడు వెళ్ళబోసుకుంటున్నట్టు తెలిసింది. సీనియర్స్‌ అండతో లోకల్‌గా కొందరు చెలరేగిపోవడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలిసింది. దీంతో సందర్భం వచ్చిన ప్రతీసారీ త్వరలో దూకుడు పెంచుతా.. దూకుడు పెంచుతా అంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంతా మన చేతిలోకే వస్తుంది.. ఓపిక పట్టండని కేడర్‌ను నచ్చజెప్పుకుంటున్నారట బత్తుల. ఈ కామెంట్స్ మీదే ఇప్పుడు మిర్యాలగూడ కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే.. మరింక కొత్తగా దూకుడు పెంచేదేంటి? ఇప్పుడు ఆయన చేతిలో లేనిదేంటి? పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చేదేంటని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు.

మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న సమయంలో.. టికెట్ ఆశిస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు లక్ష్మారెడ్డి. అప్పుడు దూకుడుగా వ్యవహరించి క్యాడర్ లో తిరుగులేని నేతగా పేరు తెచ్చుకుని, టిక్కెట్‌ తనకే ఇవ్వాల్సిన అనివార్యతను కల్పించుకున్న లక్ష్మారెడ్డి… ఎమ్మెల్యేగా గెలిచాక ఎందుకు తగ్గారు? ఆయన ముందరికాళ్ళకు బంధాలు వేస్తోంది ఎవరన్న ప్రశ్నలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చివరి క్షణం వరకు తనకు టికెట్ రాకుండా అడ్డుపడిన వారు.. టికెట్ రావడానికి సహకరించిన మరికొందరు.. తనకు కొరకరాని కొయ్యలుగా మారినట్టు ఫీలవుతున్నారట ఎమ్మెల్యే. నియోజకవర్గంలోని అన్ని వ్యవహారాల్లో ఆ సీనియర్ నేతల అతి జోక్యం.. తనకు ప్రాధాన్యత లేకుండా చేస్తోందని ఎమ్మెల్యే మదనపడుతున్నారట. సీనియర్లు నియోజకవర్గంలోని అన్ని వ్యవహారాలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జోక్యం చేసుకుంటూ… చివరకు ఫోన్ లో కూడా వ్యవహారాలను చక్కబెడుతుండడంతో.. ఇక నేనెందుకు? నేను ఎమ్మెల్యేను కాదా అని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.

ఇదే అదునుగా ఆ సీనియర్లకు సన్నిహితంగా ఉండే కొందరు స్దానిక నేతలు ఒక అడుగు ముందుకేసి అన్నింటిలో తల దూర్చడం.. లక్ష్మారెడ్డికి మరింత తలనొప్పిగా మారిందట.. ఆ నేతలను క్రమశిక్షణతో ఉండాలని హెచ్చరించినా వినకుండా.. సీనియర్ల దగ్గరికి వెళ్లడం, వారి సహకారంతో తాము అనుకున్న పని పూర్తి చేయడం ఎమ్మెల్యేకి అస్సలు మింగుడు పడటం లేదంటున్నారు. ప్రతిపక్షంలో ఉండగా గట్టిగా పార్టీ కోసం పనిచేసి కేసులపాలైన నేతలకు ప్రాధాన్యత రాకుండా.. కొందరు వలస పక్షులను పార్టీలోకి ఆహ్వానించడాన్ని వ్యతిరేకించారట ఎమ్మెల్యే. ఆ సంగతి పట్టించుకోకుండా ఓ సీనియర్ నేత ఆ వలస పక్షికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రంగం సిద్దం చేయడం బత్తులకు మరింత ఆవేదన కలిగిస్తున్నట్టు తెలిసింది. ఇదే అదునుగా కొందరు నేతలు ఎమ్మెల్యేతోనూ, సీనియర్లతోనూ ఉంటూ డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారన్నది అంతర్గత సమాచారం. తాను ఎమ్మెల్యేని అయినా… పరిస్దితి మాత్రం సత్రం భోజనం… మఠం నిద్ర అన్నట్లుగానే అయ్యిందన్న నిర్వేదంలో ఉన్నట్టు తెలిసింది. దీంతో అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలని కొందరు సన్నిహితులు చెబుతున్నా… ఎన్నికలయ్యేదాకా ఆగండని అంటున్నారట ఎమ్మెల్యే. ఎన్నికల తర్వాత మిర్యాలగూడలో ఎలాంటి ఉరుములు, మెరుపులు ఉంటాయో చూడాలి మరి.