Site icon NTV Telugu

Off The Record: మంత్రి తుమ్మల మీద దాడికి రెక్కీ జరిగిందా..? అసలు కథ ఏంటి..?

Thummala

Thummala

Off The Record: ఎన్నికల ప్రచార వేళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద రెక్కీ నిర్వహించారన్న వార్త కలకలం రేపుతోంది. ఖమ్మం మార్కెట్ యార్డులో ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో దాడికి ప్రయత్నం జరిగిందని, అది కూడా ఓ మాజీ పోలీసు అధికారి నేతృత్వంలో హోం గార్డుల సహకారంతో ప్లాన్‌ అమలుపరచబోయాన్నది ఇంకా సంచలనమైంది. ఖమ్మం జిల్లాలో అడిషనల్‌ డీసీపీగా పనిచేసిన సుభాష్‌చంద్రబోస్‌ ఈ రెక్కీ వెనక మాస్టర్‌ మైండ్‌ అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనపై
ఖమ్మంలో ఒక కేసు కూడా ఉంది. అక్రమంగా ఇంటి నిర్మాణం చేశారన్నది ఆ కేసు. ఖమ్మం జిల్లాలోనే ఎస్ఐ నుంచి అడిషనల్ డిసిపి దాకా పనిచేశారాయన. 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడికి బదిలీ చేయించుకున్న బోస్‌.. అక్కడ ఓ వివాదాస్పద ఉన్నతాధికారికి ముఖ్య అనుచరుడిగా పనిచేశారు. అక్కడ టీడీపీకి పవర్‌ పోగానే… తిరిగి తెలంగాణకు బదిలీ చేయించుకునేంత పలుకుబడి ఆయనది.

ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అనుంగు సహచరుడిలా పనిచేశారని లోకల్‌గా చెప్పుకుంటారు. ఒక న్యూస్‌ ఛానల్‌ యజమాని హత్య కేసు నిందితులతోను, డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్న ఓ బడా నిర్మాతతోను ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం సైతం ఉంది. గతంలో తాను అధికారిగా ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా ఒక్క వర్గాన్నే సృష్టించారట. అంతే కాదు.. పోలీస్‌శాఖలో తనకో గ్రూప్‌ని సృష్టించుకుని అడ్డగోలు వ్యవహారాలతో ఇష్టారాజ్యంగా నడిపించారన్నది డిపార్ట్‌మెంట్‌ ఇంచర్నల్‌ టాక్‌. గత ఎన్నికల సందర్బంగా ఈ పోలీస్‌ అధికారి ఇంటి నుంచే డబ్బు పంపిణీ జరిగిందంటూ.. కాంగ్రెస్‌ పార్టీ ధర్నాలు సైతం చేసింది. పదవీకాలం ఉండగానే వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఈ ఆఫీసర్‌ మంత్రి తుమ్మల టార్గెట్‌గా పావులు కదిపారని అంటున్నారు. అయితే… ఎన్నికల తర్వాత ఫలితాలకు ముందే అమెరికాకు చెక్కేశారు సుభాష్‌చంద్రబోస్‌. అయితే ఖమ్మంలో నిబంధనలకు విరుద్ధంగా తాను కట్టిన ఇంటి విషయంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ చర్యలకు సిద్ధమైందని తెలుసుకుని గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్‌ తిరిగి వచ్చి బీజేపీలో చేరారు.

తర్వాత విషయం తెలిసి నాలుక కరుచుకున్న బీజేపీ నేతలు ఆయనతో మాకు సంబంధం లేదని ప్రకటించేశారు. బోస్‌ మాత్రం నాటి ప్రభుత్వంలో తన పవర్‌ని వాడుకుని తుమ్మలపై చేయాల్సిందంతూ చేసేశారట. నేలకొండపల్లిలో ఓ డాక్టర్ కు చెందిన మామిడి తోట నుంచి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన వర్గీయుల ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నించినట్టు చెప్పుకుంటున్నారు. ఆ డాక్టర్ కూడా మాజీ మంత్రి పువ్వాడ ముఖ్య అనుచరుడిగా తెలిసింది. ఈ పరిణామ క్రమంలో…. తుమ్మల నాగేశ్వరరావుపై విపరీతమైన ద్వేషం పెంచుకున్నసుభాష్‌చంద్రబోస్‌ ఎన్నికల ప్రచారం సందర్బంగా ఆయన మీద దాడి చేయించడానికి కుట్ర పన్నారట. ఖమ్మం మార్కెట్ యార్డు దగ్గర దాడి ప్రణాళిక లీకవడంతో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పటి వరకు పోలీసు వర్గాలు అధికారికంగా ధృవీకరించడం లేదు. విషయం బయటపడ్డాక కొందరు ఎన్నారైల సహకారంతో.. ఈ మాజీ అధికారి తుమ్మలతో రాజీ చర్చలు చేసినా ప్రయోజనం మాత్రం లేకుండా పోయిందంట.. దీంతో ఈ మాజీ అధికారి అరెస్ట్‌ తప్పదా అన్న ప్రశ్నలు చర్చ జరుగుతోంది.

Exit mobile version