Site icon NTV Telugu

Off The Record: ఇంఛార్జ్ పదవి మీనాక్షికి ముళ్ల కిరీటమేనా..?

Meenakshi Natarajan

Meenakshi Natarajan

Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జులు మారుతూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో నాయకులని సమన్వయ పరుస్తూ నడిపించిన థాక్రే ను ఫలితాలు రాగానే పంపించేశారు. అప్పటివరకు తెలంగాణ ఎన్నికల పరిశీలకురాలిగా ఉన్న దీపా దాస్ మున్షీ ఆ తర్వాత ఇన్చార్జిగా అదనపు బాధ్యతలతో నిన్నటి వరకు వ్యవహరించారు. అయితే.. దీపాదాస్‌కు అధిష్టానం మంచి అవకాశాన్ని ఇచ్చినా… పూర్తి స్థాయిలో పార్టీని, నాయకత్వాన్ని సమన్వయ పరచలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. మామూలుగానే… తెలంగాణ కాంగ్రెస్ గ్రూపులు ఉన్నాయనుకుంటే…. కొత్తగా ఇన్ఛార్జ్‌ కూడా మరో పవర్ సెంటర్‌గా మారారని పార్టీ వర్గాలే చెప్పుకుంటాయి. హైదరాబాదులోనే మకాం వేసినా… పూర్తి స్థాయిలో నాయకులని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అధికార పార్టీని నడిపించే తీరు ఇది కాదంటూ… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నేరుగా ఏఐసీసీ కార్యదర్శులను అడగాల్సి వచ్చిందంటే…పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని కాంగ్రెస్‌ నాయకులే గుసగుసలాడుకుంటున్నారట. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా దీపా ఎక్కువ చొరవ చూపారన్న విమర్శలున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని దెబ్బతీసిన నీలం మధుని పిలిచి మెదక్ సీటు ఇచ్చారని, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన ఓ ఎమ్మెల్సీని కూడా దీపా దాస్‌మున్షీనేఎక్కువగా ప్రమోట్‌ చేశారన్న చర్చ పార్టీలో ఉంది. వాటితో పాటు నాయకుల మధ్య సరిగా సమన్వయం చేయలేకపోతున్నారంటూ ఒకరిద్దరు సీనియర్స్‌….అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళారట. దీంతో దీపాదాస్‌ను తెలంగాణ నుంచి తప్పించి రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తురాలిగా పేరున్న మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించింది ఏఐసీసీ. మీనాక్షి నటరాజన్‌కు గాంధీ కుటుంబానికి లాయలిస్ట్‌ అన్న పేరుంది. ఈ క్రమంలోనే…ఆమె ముందు చాలా సవాళ్ళున్నాయన్న టాక్‌ నడుస్తోంది. ఓవైపు మంత్రులపై అసంతృప్తితో ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశాలు పెట్టుకున్న హీట్‌ ఇంకా చల్లారలేదు. దీనికి తోడు సీనియర్లని కలుపుకొని పోతూ… ప్రభుత్వాన్ని పార్టీని బ్యాలెన్స్‌ చేయాల్సిన అత్యవసరం ఉంది. తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో పార్టీ నాయకులు, క్యాడర్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఇప్పుడు నాయకత్వం కంటే క్యాడర్ ని సంతృప్తి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. అందుకు కొత్త ఇన్ఛార్జ్‌ దగ్గర ఎలాంటి ప్లాన్స్‌ ఉన్నాయోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.పదవుల కోసం చాలామంది ఆశగా ఎదురుచూస్తున్న క్రమంలో అది కూడా కత్తిమీద సామేనన్న అభిప్రాయం ఉంది.

ఇవన్నీ ఒక ఎత్తయితే… తెలంగాణలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి పార్టీ నాయకత్వాన్ని ఎలా సిద్ధం చేస్తారన్నది ఇంకో క్వశ్చన్‌. పదేళ్లు అధికారంలో ఉండి అన్ని రకాలుగా బలపడ్డ బీఆర్‌ఎస్‌ ఓవైపు, తెలంగాణ గడ్డ మీద జెండా ఎగరేయాలని కసిగా ఉన్న బీజేపీ మరోవైపు ఉన్నాయి. ఆ రెండు పార్టీలను కట్టడి చేస్తూ కాంగ్రెస్‌ను మరింత యాక్టివ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో క్యాడర్ కొంత అసంతృప్తిగా ఉన్నందున వారిని రీ యాక్టివ్‌ చేయడమన్నది పెద్ద టాస్క్‌. స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా పై చేయి సాధించి తీరాల్సిన పరిస్థితి. ఆ ఎన్నికల కోసం పార్టీని దీపాదాస్‌ సిద్ధం చేసిన దాఖలాలు లేవు. పూర్తిస్థాయిలో కమిటీలు కూడా వేసుకోలేదు. జిల్లా అధ్యక్షులను మారుస్తారని ప్రచారం జరగడంలో ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఎవరూ పెద్దగా పని చేయడం లేదు. ఇవన్నీ మీనాక్షి నటరాజన్‌కు పెద్ద సవాళ్లేనని అంటున్నారు పరిశీలకులు. వీటికి తోడు ప్రభుత్వం మీద వచ్చే విమర్శలకు పార్టీ నాయకులు ఎవరు పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు లేవు. ఇప్పుడు వాళ్ళని యాక్టివేట్‌ చేయడం కూడా పెద్ద టాస్కేనన్న అభిప్రాయం ఉంది. అయితే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరితో… కొత్త ఇన్చార్జికి సత్సంబంధాలే ఉన్నాయట. శాసనసభ ఎన్నికలకు ముందు పంచాయతీ రాజ్ సంఘటన్ కార్యక్రమంలో తెలంగాణ నుంచి మహారాష్ట్రకి పాదయాత్ర నిర్వహించారామె. ఆ కార్యక్రమాన్ని ప్రస్తుత పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సమన్వయపరిచారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు సంబంధించి ఎప్పటికప్పుడు కో ఆర్డినేట్ చేసుకుంటూ పార్టీని అప్రమత్తం చేశారు. అయితే… ఇదే సమయంలో మరో చర్చ కూడా నడుస్తోంది పార్టీ వర్గాల్లో. మీనాక్షి నటరాజన్‌కు నేరుగా రాహుల్‌ గాంధీతో సత్సంబంధాలున్నాయి. ఆయన మనిషే కాబట్టి ఇక్కడి వ్యవహారాలన్నీ ఎలాంటి ఫిల్టర్లు లేకుండా నేరుగా రాహుల్‌కు చేరతాయని, అందుకే ఇకనుంచి అంతా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్న మాటలు సైతం వినిపిస్తున్నాయట తెలంగాణ కాంగ్రెస్‌లో. రాష్ట్ర పార్టీని కొత్త ఇన్ఛార్జ్‌ ఎలా డీల్‌ చేస్తారో చూడాలి మరి.

Exit mobile version