Site icon NTV Telugu

Off The Record: మడకశిరలో వైసీపీకి దిక్కులేని పరిస్థితి..!

Madakasira

Madakasira

Off The Record: ఎక్కడ తప్పు జరిగిందో అక్కడే సరిదిద్దుకోవాలి. పడ్డ చోటే లేచి నిలబడాలి. ప్రస్తుతం ఈ మాటలు వైసీపీకి చాలా ముఖ్యం అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. ఓటమి తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు బాగా దిగజారిపోతున్నాయి. కొన్ని చోట్ల నాయకుడే లేకుండా పోతుంటే…. అక్కడే టీడీపీ ఇంకా బలపడుతున్న పరిస్థితి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఉందట. ఇప్పుడిక్కడ పార్టీకి నాయకుడెవరో తెలియడం లేదు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చి.. ఒక సామాన్యుడికి పార్టీ టికెట్ ఇచ్చి….. ప్రయోగం చేసి చేతులు కాల్చుకుంది వైసీపీ అధిష్టానం. దాని పర్యవసానం ఏంటంటే… కేవలం ఓటమితోనే ఆగకుండా…. అసలు నియోజకవర్గానికి నాయకుడే లేకుండా పోయాడు. గెలుపోటములు సహజమే అయినా… కొన్నిసార్లు చేసే తప్పిదాల పర్యవసానాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు మడకశిరలో వైసీపీ పరిస్థితి అదేనట. ఈ ఎస్సీ రిజర్వుడ్‌ సెగ్మెంట్‌లో 2019 ఎన్నికలకు ముందు ఎంట్రీ ఇచ్చారు డాక్టర్ తిప్పేస్వామి. తన రాజకీయ అనుభవంతో ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారాయన. అందుకు తగ్గట్టే… 2019 ఎన్నికల్లో మంచి విజయం సాధించారు. కానీ తిప్పేస్వామి చేసుకున్న స్వీయ తప్పిదాల కారణంగా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆయనకు టికెట్ ఇస్తే మేం సహకరించేది లేదంటూ కొందరు వైసీపీ నాయకులు అధిష్టానానికి తేల్చి చెప్పారు. దీంతో ఆయనకు బదులు ప్రయోగాత్మకంగా… కొందరు నాయకుల సిఫార్సులు, హామీల మేరకు ఒక సామాన్య ఉపాధి హామీ కూలీ అయిన ఈర లక్కప్పకు టికెట్ ఇచ్చింది అదిష్టానం.

Read Also: Jyoti Malhotra Case: యాంటి టెర్రర్ ఇన్వెస్టిగేషన్ కు జ్యోతి మల్హోత్రా కేసు

లక్కప్పకు లక్కు లాగిపెట్టి తన్ని వైసీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌ వచ్చిందే తప్ప…అసలాయనకు పవర్‌ పాలిటిక్స్‌తో సంబంధమే లేదు. సామాన్య నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారా వైసీపీ అధిష్టానం సాహసం చేయడం ఒక ఎత్తయితే… మా పార్టీలో ఇలాంటి వాళ్ళకు కూడా ప్రాధాన్యం దక్కుతుందని చెప్పదల్చుకుంది అధిష్టానం. అనుకున్నట్టుగా లక్కప్ప గెలిస్తే… అది వేరే లెక్క. కానీ… మొత్తం తిరగబడిపోయింది. చివరి నిమిషంలో టీడీపీ ఎంఎస్ రాజును రంగంలోకి దింపింది. ఆయన గెలిచారు. అయితే… మొన్నటి దాకా గొడవలకు కేంద్రంగా ఉన్న మడకశిర టీడీపీ.. ఇప్పుడు ఫుల్ స్ట్రాంగ్ అయింది. మాజీ ఎమ్మెల్యే ఈరన్నను పూర్తిగా సైడ్‌ చేసి…. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బలపడ్డారు. ఇక పార్టీకి మెయిన్ పిల్లర్‌గా ఉన్నారు తిప్పేస్వామి. ఇటు వైసీపీలో క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ.. నాయకత్వ లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఓడిపోయాక ఈర లక్కప్ప అసలా విషయాన్నే మర్చిపోగా… ఇప్పుడు ఆయనకు బదులు ఎవర్ని తీసుకురావాలన్నది వైసీపీ అధిష్టానానికి అంతు చిక్కడం లేదట. మడకశిర ఎస్సీ రిజర్వ్‌డ్‌ కావడంతో… ఇక్కడ ఆ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడే కనిపించడం లేదంటున్నారు.
అందుకే బయటి వాళ్ళ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో నాయకులు బలహీనంగా ఉన్నా.. ఉండటానికైతే…ఎవరో ఒకరైతే ఉన్నారు.. కానీ మడకశిర పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దీన్ని ఇలాగే వదిలేస్తే… నియోజకవర్గంలో కేడర్‌ చెల్లాచెదురైపోవడం ఖాయమన్న టాక్‌ నడుస్తోంది.

Exit mobile version