Site icon NTV Telugu

Off The Record : టీడీపీ – జనసేనకు తామే మధ్యవర్తిత్వం వహించాలనుకుంటున్నారా..?

Cpi Otr

Cpi Otr

ఆంధ్రప్రదేశ్‌లో కామ్రేడ్స్‌ పరిస్థితి ఏంటి? జనసేన, టీడీపీతో కలిసి నడవాలనుకుంటున్న వారి ఆశలు నెరవేరతాయా? బీజేపీ పొత్తులో ఉన్న జనసేన వామపక్షాలకు ఎలా దగ్గరవగలదు? ఎవరో ఒకరితో పొత్తు ఉంటే తప్ప భవిష్యత్‌ లేదని ఈసారి లెఫ్ట్‌ నేతలు బలంగా నమ్ముతున్నారా? అందు కోసం వారు అనుసరించాలనుకుంటున్న వ్యూహం ఏంటి? లెట్స్‌ వాచ్‌.

ఆంధ్రప్రదేశ్‌ లెఫ్ట్‌ నేతలు ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా… ఇప్పుడు ఒకటే మాట అంటున్నారట. అదే.. జనసేన, టిడిపి కలిస్తేనే మంచిదని. వాళ్ళిద్దరూ కలిస్తే…. వీళ్లకేంటి? పదే పదే అదే మాట ఎందుకంటున్నారని ఆరా తీస్తే… దాని వెనక ఎర్రన్నలకు పెద్ద ప్లానింగే ఉందని చెప్పుకుంటున్నారు. వాళ్ళిద్దరూ కలిసి బీజేపీని పక్కన పెడితే తమకు లైన్‌ క్లియర్‌ అవుతుందన్నది వామపక్షాల ఆశ అట. అందుకే పొత్తు కోసం దొరికే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట లెఫ్ట్‌ నాయకులు.

వామపక్షాలకు గతంలో టీడీపీ, జనసేనతో కలిసి పని చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఆ రెండు పార్టీలు దగ్గరవుతున్న సంకేతాలు స్పష్టంగా ఉండటంతో… తమకు కూడా ఓ దారి దొరికినట్టేనని భావిస్తున్నారు సీపీఐ, సీపీఎం నాయకులు.

కానీ… మధ్యలో బీజేపీ సంగతెలాగన్న భయాలే వారిని వెంటాడుతున్నాయట. జనసేన, బీజేపీ ఇప్పటికీ కలిసే ఉన్నాయి. టీడీపీకి కూడా అభ్యంతరాలు లేవు. అక్కడే లెఫ్ట్‌ నేతలు తమ చాతుర్యం ప్రదర్శించాలనుకుంటున్నారట. తెలుగుదేశం, జనసేన మధ్య ఇంకా పూర్తి స్థాయి అవగాహన రాలేదు గనుక… తామే చొరవ తీసుకుని ఇద్దర్నీ మరింత దగ్గర చేస్తే.. అప్పుడు ఆటోమేటిక్‌గా బీజేపీ సైడైపోతుందని, తమకు లైన్‌ క్లియర్‌ అవుతుందని అనుకుంటున్నారట కామ్రేడ్స్‌. తమకు పెద్దరికం మిగులుతుంది, అదే సమయంలో పొత్తు సమస్య కూడా పరిష్కారం అవుతుందని అనుకుంటున్నట్టు చెబుతున్నారు. పొత్తుతోనే భవిష్యత్‌ అని ఆ రెండు పార్టీల నాయకులు గట్టిగా నమ్ముతున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ లెఫ్ట్ పార్టీల ఆశలపై నీళ్ళు చల్లుతూ బిజెపి కనుక కూటమిలో చేరితే… వారు ఒంటరి పోరాటానికి సిద్ధమవ్వాల్సిందే. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత కమలనాథుల వైఖరి ఎలా ఉంటుందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణా ఎన్నికల తర్వాతే.. ఏపీ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా పొత్తు కోసం ఆరాటపడుతున్న ఏపీ లెఫ్ట్ పార్టీలకు జనసేన, టిడిపిలు కలిసి ఊపిరి పోస్తాయా… లేక బీజేపీతో చేయి కలిపి ఆశలకు గండి కొడతాయా అన్న విషయం తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version