Site icon NTV Telugu

Off The Record: తెలంగాణలో టీడీపీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న బడా నేతలు..!

Tdp Off

Tdp Off

Off The Record: ఉమ్మడి ఖమ్మం జిల్లా టీడీపీ ఆఫీస్‌ చాలా రోజుల తర్వాత ఇప్పుడు కళకళలాడుతోందట. రాకపోకలు కూడా బాగా పెరిగాయంటున్నారు దీన్ని గమనిస్తున్నవారు అదేంటీ… తెలంగాణలో ఆ పార్టీ పోటీలో లేదుకదా..? నాయకులు కూడా అంత సీరియస్‌గా లేరు కదా… మరి ఈ మార్పునకు కారణం ఏంటంటే… అక్కడే ఉంది అసలు మేటర్‌ అంటున్నారు పరిశీలకులు. ఖమ్మం టీడీపీ ఆఫీస్‌లో సందడికి కారణం ఆ పార్టీ నేతలో, కార్యకర్తలో కాదట. పక్క పార్టీల నాయకులు వస్తూపోతూ హంగామా చేస్తున్నట్టు తెలిసింది. ఖమ్మం లోక్‌సభ బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఇప్పుడు అక్కడి టీడీపీ ఆఫీస్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నది రాజకీయ వర్గాల మాట. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్య నాయకులు కొందరు టీడీపీ ఆఫీస్‌ని టచ్‌ చేసి వెళ్తున్నారు. ప్లీజ్‌… మీ ఓటు బ్యాంక్‌ని మాకు మళ్లించండి, మీ కేడర్‌కి కూడా చెప్పండని బతిమాలుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల టైంలో అప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా టిడిపి కార్యాలయానికి వెళ్లి వచ్చారు. గెలిచాక మరోసారి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పారు కూడా.

అలాగే ఇప్పుడు లోక్‌సభ అభ్యర్థులు రామసహాయం రఘురామిరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్ధి వినోదరావు తెలుగుదేశం ఆఫీస్‌కు వచ్చారు. స్థానిక టీడీపీ కేడర్‌, సానుభూతిపరుల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఈసారి ఖమ్మం కాంగ్రెస్‌ సీటు ఖచ్చితంగా తమకే ఇస్తారని ఆశించిందట కమ్మ సామాజికవర్గం. అలా జరక్కపోవడంతో.. తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. అందుకే ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే టీడీపీని మంచి చేసుకుని తమవైపు తిప్పుకోవాలన్న టార్గెట్‌తో మంత్రి పొంగులేటి, అభ్యర్ధి రఘురామిరెడ్డి టీడీపీ ఆఫీస్‌ గడప తొక్కినట్టు తెలిసింది. గతంలో టిడిపి నుంచి గెలిచిన నామా నాగేశ్వరరావు ఆ తరువాత బిఆర్ఎస్ తరపున విజయం సాధించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నామాకు ఆ వర్గంలో మంచి పట్టు ఉంది. ఆ లెక్కలోనే ఆయన కూడా టీడీపీ ఆఫీస్‌కు వెళ్ళారట. అయితే ఇటీవలి కాలంలో ఇక్కడ బీఆర్ఎస్‌కు, టీడీపీకి మధ్య గ్యాప్‌ బాగా పెరిగింది. అయినప్పటికి బీఆర్ఎస్ పెద్దలు ఖమ్మం జిల్లాకు వస్తే… ఎన్ టిఆర్‌ను పొగడడం మాత్రం వదిలిపెట్టడం లేదు.

తాజాగా బీజేపీ అభ్యర్థి వినోద రావు సైతం పార్టీ ముఖ్యులతో కలిసి తెలుగుదేశం ఆఫీస్‌ను టచ్‌ చేశారట. ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నందున తెలంగాణలో టీడీపీ మద్దతు తమకేనని నమ్ముతున్నారు బీజేపీ నేతలు. అయితే లోకల్‌ టీడీపీలో మాత్రం ఒక ఉమ్మడి విధానం ఏదీ లేకుండా… ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిసింది. ఖమ్మంలోని నేతలు ఒకరిద్దరు బీజేపీకే మా మద్దతు అంటుండగా… దమ్మ పేట, అశ్వరావు పేట మండలాల నాయకులు మాత్రం కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని బహిరంగంగానే ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా టీడీపీని ఎవరూ పట్టించుకోవడంలేదుగానీ…ఖమ్మం జిల్లాలో మాత్రం పార్టీ ఆఫీస్‌ చుట్టూ చక్కర్లు కొట్టడం ఆసక్తికరంగా మారింది. దీన్ని బట్టే ఇప్పటికీ ఇక్కడ తెలుగుదేశం ఉనికి ఉందన్న విషయాన్ని గమనించాలంటున్నారు పరిశీలకులు. స్థానికంగా బలంగా ఉన్న కమ్మ సామాజికవర్గం మాత్రం తాము ఎటువైపు మొగ్గేదీ బయటపడటం లేదు. పోలింగ్‌ టైంకి మేటర్‌ క్లియరవుతుందేమో చూడాలంటున్నారు పరిశీలకులు.

Exit mobile version