NTV Telugu Site icon

Off The Record: వరంగల్ ఎంపీ సీట్లో కడియం ఫ్యామిలీకి చుక్కలు.. రోజుకో రకం గొడవతో టెన్షన్‌..!

Kadiyam

Kadiyam

వరంగల్ పార్లమెంట్ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఆడుతూ పాడుతూ గెలిచేయవచ్చన్న ఆశతో ఆ పార్టీ టిక్కెట్‌ తెచ్చుకున్న కడియం శ్రీహరి కుటుంబానికి ఆరంభంలోనే… పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయట. సన్నాహక సమావేశాల్లో బయటపడుతున్న విభేదాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయంటున్నారు. ఒకట్రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తప్ప మిగతా అన్నిచోట్ల వర్గ విభేదాలు భగ్గుమనడంతో కడియం ఫ్యామిలీకి టెన్షన్‌ మొదలైనట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలోని కొత్త, పాత నేతల మధ్య జరుగుతున్న ఇంటర్నల్ వార్ సన్నాహక సమావేశాల్లో బయటపడుతోందట. ఈ వ్యవహారాలు అభ్యర్థి కడియం కావ్య, ఆమె తండ్రి శ్రీహరిని కలవరుపెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కడియం ఫ్యామిలీ కాంగ్రెస్‌ ఎంట్రీని కొంతమంది నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అధిష్టానం చొరవతో… ఇప్పుడిప్పుడే వివాదాలు సద్దుమణుగుతున్నాయని అనుకుంటున్న టైంలో రోజుకో గొడవ రేగుతూ టెన్షన్‌ పెడుతున్నాయట. మొన్న పాలకుర్తి, నిన్న స్టేషన్‌ఘన్‌పూర్‌, నేడు పరకాల, వరంగల్ ఈస్ట్… ఇలా ప్రతిచోట కాంగ్రెస్‌ నేతలు రెండు గ్రూపులుగా మారి ఘర్షణకు దిగుతున్నారు. దీంతో కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కావ్య మీటింగ్ మధ్యలోంచే వెళ్లిపోతున్న పరిస్థితి.

అసలు కడియం శ్రీహరి సొంత నియోజకవర్గం స్టేషన్ ఘన్ పూర్ మీటింగ్‌ నుంచే… విభేదాలు బయట పడుతున్నాయి. లింగాల గణపురం మండలం కార్యకర్తలతో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన శనిగపురం ఇందిర ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఒకే వేదికపై శ్రీహరి, కావ్య, ఇందిర ఉండగా, మీటింగ్ సందర్భంగా చేరిక విషయం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. కడియం శ్రీహరి తన క్యాడర్ ను కాంగ్రెస్ లో చేర్చుకునే క్రమంలో ఇందిర వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ప్రయత్నించిన వారిని చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. అంతే గాకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న నాయకుల ఫ్లెక్సీలను చింపి, కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కావ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నారని, కడియం శ్రీహరి వెంట వచ్చిన క్యాడర్ ను చేర్చుకోవద్దని డిమాండ్ చేశారు. దీంతో తండ్రీ కూతుళ్ళు సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంపై పాత కేడర్‌ అభ్యంతరం చెప్పిందట. దీంతో అక్కడ కూడా సేమ్‌ సీన్‌. చివరకు మేటర్‌ పోలీసుల జోక్యందాకా వెళ్ళిందట. ఇక కొండా ఫ్యామిలీ అడ్డాగా ఉంది పరకాల. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆ టికెట్ ను నర్సంపేట బీజేపీలో ఉన్న రేవూరిని పిలిచి ఇచ్చి గెలిపించారు. దీంతో ఆయన అక్కడ పాగా వేశారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పరకాలలో కొండా, రేవూరి వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయట. ఈ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో కూడా తిరిగి అదే దృశ్యం. కొండా మురళి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. మురళి, సురేఖ లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ వారి అనుచరులు వాదనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఆ మీటింగ్‌ నుంచి కూడా మధ్యలోనే వెళ్ళిపోయారట కడియం.

ఇక వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం సమావేశంలో ఇటీవల బి ఆర్ ఎస్ నుంచి చేరిన కార్పొరేటర్ల హడావుడిని పాత కాంగ్రెస్ నేతలు తప్పుపడటంతో వివాదం మొదలై రచ్చకు దారితీసింది. ఇక చేసేదేం లేక మిన్నకుండిపోయారు కడియం. ఇలా వరుసగా .. ఎక్కడికక్కడ జరుగుతున్న కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలతో కడియం శ్రీహరి ఫ్యామిలీకి కొత్త టెన్షన్‌ పట్టుకుందట. పార్టీకి కావాల్సినంత బలం ఉంది కాబట్టి ఏదో… అలా అలా టచ్‌ చేసి వదిలేసి ఈజీగా ఢిల్లీ నిమానం ఎక్కేద్దామనుకుంటే… ఇదెక్కడి గొడవరా బాబూ… అని తలపట్టుకుంటున్నారట అభ్యర్థి కావ్య. వ్యవహారం ఇలాగే ఉంటే…. గెలవడంకంటే… ఓడటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు తెలిసంది. అదే నిజమైతే.. అంతా భ్రాంతియేనా అని పాడుకోవడం తప్ప ఇంకేం మిగలదంటున్నారు అభ్యర్థి సన్నిహితులు. దీంతో త్వరగా సెట్‌ చేయమని అధిష్టానం వైపు దీనంగా చూడటం తప్ప మరేమీ చేయలేని దయనీయం కడియం ఫ్యామిలీది అంటున్నారు లోకల్‌ పరిశీలకులు.