Site icon NTV Telugu

Off The Record: జూపల్లి కృష్ణారావు దారెటు?

Jupally Krishna Rao

Jupally Krishna Rao

Off The Record: కేసీఆర్‌ తొలి కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన జూపల్లి కృష్ణారావును బీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరించడంతో కొల్లాపూర్ పొలిటికల్ లీడర్స్‌ ఒక్కసారిగా అటెన్షన్‌ మోడ్‌లోకి వచ్చారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుస విజయాలను సొంతం చేసుకున్న జూపల్లి 2018 ఎన్నికల్లో మొదటిసారి ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్‌ నుంచి గెలిచిన బీరం హర్షవర్థన్‌రెడ్డి… మారిన రాజకీయ పరిణామాలతో గులాబీ గూటికి చేరారు. దీంతో ఇద్దరి మధ్య వర్గపోరు మొదలైంది. జూపల్లి , హర్షవర్దన్ రెడ్డి వర్గీయుల మధ్య మాటల తూటాలు పేలడంతో పాటు ,వాదోపవాదాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎప్పటికప్పుడు పొలిటికల్‌ హీట్‌ పెంచుతూనే ఉన్నాయి. స్వపక్షంలో విపక్షంలాగా.. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ , హర్షవర్దన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపిస్తూ వచ్చారు జూపల్లి కృష్ణారావు.

ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నాసరే.. తనహయాంలోనే కొల్లాపూర్ అభివృద్ధి జరిగిందని, దాన్ని కొనసాగించడంలో హర్ష వర్ధన్‌ విఫలమయ్యారంటూ మాజీ మంత్రి ఘాటుగానే విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కొల్లాపూర్‌ పర్యటనకు వచ్చిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జూపల్లి ఇంటికివెళ్లి మంతనాలు జరిపారు. పార్టీలో క్రియాశీలకం కావాలని సూచించినా, ఆ భేటీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి కే బిఆర్ఎస్ అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వడం, సిట్టింగ్‌లకే మళ్ళీ అవకాశం అని కేసీఆర్‌ తేల్చేయడంతో…కొద్ది రోజుల నుంచి జూపల్లి ప్రత్యామ్నాయలపై దృష్టి సారించారట. ఖమ్మం జిల్లాలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి హాజరవడం, కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ టార్గెట్ గా విమర్శలు చేయడం అందులో భాగమేనట. ఆ విమర్శల తర్వాతే… ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటన వచ్చింది.

ఈ పరిణామాలతో.. జూపల్లి తదుపరి అడుగులు ఎటువైపు అన్న చర్చ జోరుగా జరుగుతోంది. గులాబీ బంధం తెగిన మాజీ మంత్రి కమలం గూటికి చేరుతారా….? లేక కాంగ్రెస్‌కు షేక్ హ్యాండ్ ఇస్తారా…? లేక ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుతో తన భవిష్యత్ కు బాటలు వేసుకుంటారా…? అనే విశ్లేషణలు కొనసాగుతున్నాయి. మండలాల వారీగా నిర్వహించిన సమావేశాల్లోనూ , ఆత్మీయ సమ్మేళనాల్లోనూ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని మాత్రమే అనుచరులకు చెప్పుకుంటూ వచ్చారు జూపల్లి. అందుకే ఇప్పుడు ఆ సమయం వచ్చిందని అంటున్నారు ఆయన అనుచరులు. జూపల్లికి బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ఆహ్వానాలు ఉన్నాయనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. ఆయన మాత్రం దేన్నీ ఖండించలేదు. సరైన సమయం అని మాత్రమే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ రెండు పార్టీల విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. మరోవైపు కొందరు ముఖ్య అనుచరులు మాత్రం తమకు రెబల్‌గా గుర్తింపు ఇచ్చిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుతోనే మరోసారి పోటీ చేయాలని సూచిస్తున్నారట. సొంతగూడు కాంగ్రెస్‌వైపు వెళ్ళాలని మరికొందరు చెబుతున్నారట. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీని ఢీ కొట్టాలంటే బీజేపీ పంచన చేరడం బెటరని ఇంకొందరు అనుచరులు అంటున్నారట. అన్నీ వింటున్న జూపల్లి మాత్రం ఇంకా ఏ క్లారిటీ ఇవ్వలేదట.

మొత్తం మీద జూపల్లి పై గులాబీ పార్టీ వేటు వేయడంతో కొల్లాపూర్ తో పాటు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో అటెన్షన్ వాతావరణం నెలకొంది . మరి జూపల్లి ప్రస్తానం ఎటువైపు ఉంటుందో , ఆ పరిణామాలు పాలమూరు జిల్లా రాజకీయాలను ఎంత మేర ప్రభావితం చేస్తాయో చూడాలి .

Exit mobile version