NTV Telugu Site icon

Off The Record: బూడిద నుంచి బంగారం పిండుకోవడానికి మొదలైన రాజకీయ రచ్చ?

Jc Adi

Jc Adi

Off The Record: డబ్బులు ఎవరికీ ఊరికే రావు…. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్‌ అయిన ట్యాగ్‌ లైన్‌ ఇది. సాధారణ పరిస్థితుల్లో అయితే… అది వాస్తవం కూడా. కానీ…. అక్కడ మాత్రం డబ్బులు ఊరికే వచ్చేస్తున్నాయట. జస్ట్‌… పనికిరాని బూడిద కుప్పల్ని క్లియర్‌ చేసి వేరే చోటికి తీసుకెళ్ళి అమ్ముకుంటే… లక్షలకు లక్షలు కళ్లజూడవచ్చట. ఇక వివరాల్లోకి వెళితే… సంబంధం లేకున్నా…ఈ వివాదం మొత్తానికి కేంద్ర బిందువు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్… ఆర్టీపీపీ. జమ్మలమడుగు నియోజకవర్గంలో బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్‌ నుంచి ప్రతిరోజు దాదాపు 500 టన్నుల బూడిద బయటికి వస్తుంది. సిమెంట్‌ తయారీ ముడి పదార్ధాల్లో ఇది కూడా ఒకటైనందున ఇందులో 40 శాతం బూడిదను టెండర్ల ద్వారా వివిధ సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తారు. ఇక మిగిలిన 60 శాతం బరువైన బూడిదను పైపులు ద్వారా పక్కనే ఉన్న చెరువులోకి పంప్‌ చేస్తారు. చెరువులోకి నీటి ద్వారా వచ్చి చేరే ఈ బూడిదకు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. అందుకే నీరు ఇంకి గట్టిపడ్డ బూడిదను గతంలో స్థానికులు చిన్న చిన్న పరిశ్రమలకు సరఫరా చేసి సంపాదించుకునేవారు.

Read Also: Delhi: ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మన్మోహన్.. సుప్రీం జడ్జిగా సిఫార్సు!

క్రమంగా.. సిమెంట్ ఉత్పత్తిలో ఈ పాండ్ యాష్‌కు డిమాండ్ పెరగడంతో బూడిద గోల మొదలైంది. ఉచితంగా లభించే చెరువులోని బూడిదను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నేతలు సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు. ఆర్టీపీపీ నుంచి విడుదల అయ్యే బూడిదలో రెండు రకాలు ఉంటుంది. డైరెక్ట్‌గా ట్యాంకర్లలోకి లోడ్ చేసేది గ్రేడ్ వన్ కాగా, రెండవది చెరువులో వృధాగా పోయేది. ఈ వృధాగా పోయే బూడిద కోసమే ఇప్పుడు పొలిటికల్‌ వార్‌ జరుగుతోంది. విడిగా చూడ్డానికి ఇది ఒట్టి…వేస్ట్‌ బూడిదే అయినా… స్థానిక నాయకులకు మాత్రం కామధేనువు. చెరువులో నుంచి ఉచితంగా తవ్విపోసుతునే వీలున్న ఈ యాష్‌కు సిమెంట్ ఫ్యాక్టరీలు టన్నుకు 550 రూపాయలు చెల్లిస్తాయి. ఇలా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుండి నిత్యం 15 సిమెంట్ కంపెనీలకు బూడిద సరఫరా జరుగుతుంది. గ్రేడ్ వన్ బూడిదను డైరెక్ట్‌గా ఆర్టీపీపీ నుంచి కొనే సిమెంట్‌ కంపెనీలు, ఈ గ్రేడ్‌ టూను ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి కొనుక్కుని రెండిటినీ వన్‌ ఈస్టూ టూ నిష్టత్తిలో కలుపుకుంటాయట. అందుకే గ్రేడ్‌ టూ పాండ్‌ యాష్‌కు కూడా పిచ్చ డిమాండ్‌ ఉంది. కొనడానికి పైసా పెట్టుబడి అవసరం లేదు. ఫ్రీగా తవ్విపోసుకుని రవాణా ఖర్చులు పెట్టుకుంటే చాలు. రోజుకు లక్షల్లో ఆదాయం కళ్ళజూడవచ్చన్న ఆలోచనే నాయకుల మధ్య యుద్ధానికి కారణం అయి ఉండవచ్చంటున్నారు. తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తమ నియోజకవర్గం పరిధిలోని సిమెంట్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని యర్రగుంట్ల మండలం కలమళ్ళ నుంచి ఈ పాండ్‌ యాష్‌ను సరఫరా చేస్తుంటారు.

Read Also: Tirupati Laddu Controversy: శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి..! దూకుడు పెంచిన సిట్

ఇప్పుడు ఈ వ్యవహారంలో లోకల్‌ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వేలు పెట్టడంతో సమస్య మొదలైందన్నది లోకల్‌ టాక్‌. ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్ట్‌లో 50 శాతం తమకు కావాలని ఆదినారాయణరెడ్డి వర్గీయులు పట్టుబడుతున్నారట. అదే సమయంలో ఇక్కడ ఆర్టీపీపీ కోసం భూములు కోల్పోయిన స్థానిక రైతులకు ప్లాంట్ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వకుండా జేసీ బూడిద తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట. దాంతో… రైతులకు డబ్బులు చెల్లిస్తేనే జేసీ వాహనాలను అనుమతించాలని, లేదంటే అడ్డుకోవాలని ఆది సూచించినట్టు తెలిసింది. ఆ క్రమంలో ప్రభాకర్ రెడ్డి వాహనాలు అడ్డుకోవడం, ఆయన కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో రచ్చ రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్‌ అయింది. జేసీ స్వయంగా ప్లాంట్‌ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయడం, ఆదినారాయణరెడ్డి అనుచరులు కూడా అదే రేంజ్‌లో సిద్ధం కావడంతో… ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ప్రభాకర్ రెడ్డి కడప జిల్లా లోకి ఎంటరవకుండా… కడప- తాడిపత్రి ప్రధాన రహదారిపై అడుగడుగునా పోలీసులు మొహరించారు. ఇద్దరు నేతల అనుచరులు సై అంటే సై అంటూ సిద్ధంగా ఉండడంతో హై అలర్ట్‌ ప్రకటించారు పోలీసులు. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం… ఆది అన్న కుమారుడు, జమ్మలమడుగు టిడిపి ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి కమీషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. కూటమి నేతల మధ్య ముదిరిన ఈ వివాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సీరియస్ గా స్పందించారట. ఇద్దరి మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వెంటనే అమరావతికి రమ్మని ఆదేశించినట్టు సమాచారం. అదే సమక్షంలో జరిగే పంచాయితీ ఎలా ఉన్నా…మొత్తంగా ఉచిత బూడిద నుంచి డబ్బులు పిండుకునే వ్యవహారం మాత్రం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

Show comments