Off The Record: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ స్థానికులకు అందుబాటులో ఉండటం లేదట. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ అన్నట్టుగా… అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి రాజోలు వచ్చి వెళ్తూ హాయ్ చెబుతున్నారట. తాను ఎమ్మెల్యేగా గెలిచి రెండు నెలలు కావస్తున్నా… ఇంతవరకు రాజోలులో అద్దె ఇల్లు కూడా తీసుకోకుండా గడిపేస్తున్నారాయన. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం… ఎన్నికలకు ముందే పిఠాపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటమే కాకుండా సొంత స్థలం కూడా కొన్నారు. కానీ… అదే జనసేనకు చెందిన రాజోలు ఎమ్మెల్యే మాత్రం… ఎమ్మెల్యేగిరీ అంటే ఏదో ఆషామాషీ వ్యవహారంలా అనుకుంటున్నారని, రాజోలును పిక్నిక్ స్పాట్‌గా చూస్తున్నారు తప్ప ప్రజాసేవ గురించి ఆలోచించడం లేదన్న నెగెటివ్ టాక్ మొదలైంది నియోజకవర్గంలో. ఎమ్మెల్యే సాబ్ కనీసం ఓ ఇంటిని అద్దెకు తీసుకోకపోగా… చుట్టపు చూపుగా వచ్చినప్పుడల్లా… స్థానికంగా ఉన్న ఒక లాడ్జిలోనే మకాం వేస్తున్నారు. అన్ని వ్యవహారాలను అక్కడి నుంచే చక్కబెడుతున్నారు. చివరికి జనసేన సమావేశాలను సైతం.. లాడ్డిలోనే పెడుతున్నారు. దీంతో అక్కడికి వెళ్ళి సమస్యలు చెప్పుకోవడానికి మహిళలు సిగ్గుపడుతున్నారట.
Read Also: Telangana: తెలంగాణలో 2జీ బయో ఇథనాల్ ప్లాంట్.. 500 మందికి ఉద్యోగాలు
కారణం ఏదైనా… మనమేంటి… లాడ్జికి వెళ్ళడమేంటి అంటూ.. సొంతపార్టీకి చెందిన వీరమహిళలు సైతం సిగ్గుతో చితికిపోతున్నట్టు తెలిసింది. పార్టీ కార్యక్రమం పేరుతో లాడ్జికి రాలేమంటూ అసలు ప్రోగ్రామ్‌కే డుమ్మా కొడుతున్నట్టు తెలిసింది. దానికి బదులు ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటే… ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు కదా అన్న వ్యాఖ్యలు జనసేన వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ప్రజాప్రతినిధి అయ్యాక కూడా ఆయనగారికి ఆ అధికారి పోకడలు పోకుండా.. లాడ్జిలో ఫ్యాన్ కింద కూర్చుని ఆదేశాలు ఇస్తుంటారు తప్ప క్షేత్రస్థాయిలో పర్యటనలు జరపడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. రాజోలు ప్రజలకు రెండు నెలలకే ఈ లాడ్జి రాజకీయాలు విసుగు పుట్టిస్తున్నాయన్న టాక్ బయలుదేరింది. జనసేన జనవాణి రాష్ట్ర కోఆర్డినేటర్ గా పనిచేసిన వరప్రసాద్ ఎమ్మెల్యే అయ్యాక ఇలా ప్రవర్తిస్తున్నారేంటన్న చర్చ పార్టీలో జరుగుతోందట. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మిగిలిన జనసేన ఎమ్మెల్యేలంతా చురుగ్గా పనిచేస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే రాజోలు ఎమ్మెల్యే వెనకబడ్డారన్నది లోకల్ టాక్. వరప్రసాద్ స్వస్థలం రాజోలు నియోజకవర్గం అయినప్పటికీ… ఐఎఎస్ అధికారిగా వివిధ ప్రాంతాల్లో పనిచేశారాయన. ఆ అనుభవం తమ అభివృద్ధికి ఉపయోగపడుతుందని అనుకుంటే… ఈయనగారు లాడ్జి రాజకీయం మొదలుపెట్టి సొంత పార్టీ మహిళా నేతల్ని సైతం దూరం చేస్తున్నారన్న ఆవేదన వ్యక్తం అవుతోందట కేడర్‌లో.
Read Also: Fraud Case: వీడు మాములోడు కాదు.. 22 ఏళ్లుగా బ్యాంకు అధికారులకు పంగనామాలు
మలికిపురం ప్రాంతంలో 23 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మేజర్ డ్రెయిన్… తీర గ్రామాల కొబ్బరి రైతులకు శాపమైంది. ఆక్రమణల కారణంగా
సముద్రపు ఆటుపోట్లకు వచ్చే ఉప్పు నీరు నేరుగా మేజర్ డ్రెయిన్లో చేరుతోంది. అట్నుంచి తోటల్లోకి చేరి కొబ్బరి చెట్లు తలలు ఊడిపోయి నేలకొరిగిపోతున్నాయి. కొబ్బరి రైతుల కడుపు కొడుతున్న ఈ ఉప్పు నీటి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు వరప్రసాద్. ఈ రెండు నెలల్లో అసలా ఊసే లేదంటున్నారు స్థానిక రైతులు. అటు ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వ హయాంలో 40 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటివరకు అభివృద్ధి పనుల ప్రారంభం కూడా జరగలేదు. ఆక్వా రైతులు కూడా సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. అప్పనపల్లి ఆక్విడెక్టు నీట మునిగి సమీప గ్రామాలకు ముప్పు వాటిల్లింది. వరద బాధితులను పట్టించుకునే నాథుడే లేరు. ఇలా… నియోజకవర్గం నిండా రకరకాల సమస్యలు ఉన్నా… అవేమీ పట్టించుకోకుండా….ఎమ్మెల్యే వరప్రసాద్ హైదరాబాద్ కే పరిమితం అవుతూ చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా లాడ్జి విడిచి బయటికి రండి సార్… మా మొర ఆలకించండి, సమస్యలు పరిష్కరించండి అంటున్నారు రాజోలు ప్రజలు.