NTV Telugu Site icon

Off The Record: టీడీపీకి ఇరకాటంగా మారిన జనసేన – బీజేపీ లవ్..!

Bjp

Bjp

Off The Record: తెలంగాణ పొలిటికల్‌ స్క్రీన్‌ భగభగమంటోంది. ఆ తాలూకూ సెగ ఏపీలో టీడీపీకి భరించలేనంత మంట పుట్టిస్తోందట. అసలు పోటీలో లేకున్నా… ఈ సెగేంటి? ఈ గోలేంటి? ఇదెక్కడి సమస్య అని సణుక్కుంటున్నారట ఆ పార్టీ నాయకులు. ఏపీలో టీడీపీ-జనసేన కలిసి నడుస్తున్నాయి. బీజేపీని కూడా కలుపుకుని వెళ్లాలనే ప్రతిపాదనలు బలంగా వస్తున్నా.. అది తమకు నష్టమే తప్ప వీసమెత్తు లాభం లేదనేది మెజార్టీ టీడీపీ నేతల భావన. దాదాపు పార్టీ అధినాయకత్వం కూడా అదే ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామ క్రమంలోనే.. మధ్యే మార్గంగా తెలంగాణ ఎలక్షన్‌ రేసు నుంచి తప్పుకుని చేతులు దులిపేసుకుంది టీడీపీ. ఆ ఫలితాలు ఎలా ఉన్నా.. విజయం ఎవరిని వరించినా.. పక్క రాష్ట్రం ప్రభావం తమ మీద ఏ మాత్రం పడదని లెక్కలేసుకుంటూ ఊపిరి తీసుకుంది.

అయితే.. అదే సమయంలో మిత్రపక్షం జనసేన తెలంగాణలో చేస్తున్న రాజకీయం ఇప్పుడు ఏపీలో తమ మెడకు చుట్టుకుంటుందేమోనన్న డౌటనుమానాలు పెరుగుతున్నాయట టీడీపీ నేతలకు.
ఏపీలో మిత్రపక్షం జనసేనకు తెలంగాణలో బీజేపీతో పొత్తులో ఉంది. అందులో భాగంగానే ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది ఆ పార్టీ. ఇటు ప్రధాని పాల్గొన్న సభలో ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ వేదిక పంచుకున్నారు కూడా. పవన్ తమతో ఉన్నారని మోడీ సైతం చెప్పారు. ఈ రాజకీయమంతా.. తెలంగాణ వరకు బాగానే ఉంటుంది. కానీ ఏపీకి వచ్చేసరికి పరిస్థితేంటనే చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. ఏపీలో బీజేపీని కలుపుకోకుండా ఎన్నికలకు వెళ్తేనే బెటరని చాలా మంది టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ-జనసేన లవ్ స్టోరీకి ఎలాంటి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోందట. అక్కడ అలా. ఇక్కడ ఇలా అంటూ రాజకీయ ప్రత్యర్థులు జనసేనను టార్గెట్ చేసుకునే క్రమంలో తాము కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని కంగారు పడుతున్నారట సైకిల్‌ పార్టీ నేతలు. ఇప్పటికే వైసీపీ వర్గాలు ఇదే అంశంపై అటు జనసేనను.. ఇటు టీడీపీని విమర్శిస్తూనే ఉన్నాయి.

బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని టీడీపీ, జనసేన రాజకీయం చేస్తున్నాయనే విమర్శలకు తెలంగాణలో జనసేన రాజకీయం ఆస్కారం ఇచ్చినట్టు అవుతోందనేది టీడీపీ వర్గాల భావన. అలాగని.. బీజేపీతో కూటమి కట్టి ఏపీలో ఎన్నికలకు వెళ్తే అది మరింత ఇబ్బందులను సృష్టించే వ్యవహారం అవుతుందన్న భయం పెరుగుతోంది. చంద్రబాబు జైలుకెళ్లడానికి జగన్ ఎంత కారణమో.. బీజేపీ కూడా అంతే కారణమనే భావన టీడీపీ కేడరులో బలంగా నాటుకు పోయింది. ఈ పరిస్థితుల్లో బీజేపీతో వెళ్లేందుకు ఏ ఒక్కరు కూడా ఇష్టపడని పరిస్థితి. పోనీ కేడర్ విషయం పక్కన పెట్టినా.. ప్రజల్లో బీజేపీకి ఏమైనా సానుకూలత ఉందా..? అంటే అదీ లేదు. దీంతో కాషాయ పార్టీతో కలిస్తే.. నష్టం బోల్డంత.. లాభం కూసింత అన్నట్టుగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో కౌంటర్ ఏమివ్వాలా..? అని ఎంత ఆలోచించుకున్నా… బుర్రకు ఏం ఐడియా తట్టడం లేదట. దీంతో కాలమే సమాధానం చెబుతుందంటూ నిర్వేదంతో ఉన్నారట కొందరు టీడీపీ నేతలు. మరి తెలంగాణలో జనసేన-బీజేపీ లవ్‌ స్టోరీ ఏపీలో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.