Site icon NTV Telugu

Off The Record: విశాఖ అయోధ్య మందిరం సెట్ వెనుక బీజేపీ ఎంపీ ఉన్నారా..?

Ayodhya Ram Temple Set

Ayodhya Ram Temple Set

Off The Record: యాపారం.. ఇది అలాంటిలాంటి యాపారం కాదు. అయోధ్య రామయ్యనే అంగడి సరకు చేసేసిన ఫక్తు బిజినెస్‌. విశాఖ బీచ్‌ రోడ్‌లో సముద్రుడి సాక్షిగా… భక్తుల మనోభావాలతో ఆడుకున్న పరమ వికృత వ్యాపారం. ఇక్కడ పైకి చూడ్డానికి అంతా బాగానే కనిపిస్తుంది. అబ్బో… వీళ్ళెవరో మహానుభావులు….. అయోధ్య దాకా వెళ్ళలేని వాళ్ళ కోసం ఆ బాల రాముడినే మన ముందుకు తీసుకువచ్చారని అనిపిస్తుంది. ఇంకాస్త భక్తి రసం పొంగిపొర్లే వాళ్ళయితే… ఆ నిర్వాహకులకు చేతులెత్తి మొక్కాలిరా బాబూ… అంటారు. కానీ…ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. కాస్త లోతుల్లోకి వెళ్ళి చూస్తే… గుడి ఎనకున్న గోతులేంటో కనిపిస్తాయి. దేవుడిని అడ్డం పెట్టుకుని ఏ స్థాయిలో వ్యాపారం చేద్దామనుకున్నారో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ పరిశీలకులంతా… ఇన్నాళ్ళు ఎక్కడ నిద్రపోయారు? ఇప్పుడొచ్చి దగా, మోసం అంటూ గొంతు చించుకుంటున్నారు. వైజాగ్‌ బీచ్‌లో అంత పెద్ద సెట్‌ వేస్తుంటే అప్పుడెందుకు మాట్లాడలేదని డౌట్‌ రావడం సహజం. కానీ… అసలు మేటర్‌ అక్కడే ఉందట. గుడి సెట్టు వేసినన్నాళ్ళు ఇదంతా లీగల్‌, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీకి చెందిన ఓ ఎంపీ మా వెనక ఉన్నారని చెప్పారట నిర్వాహకులు. దాంతో… ఏదో పూర్తిస్థాయి భక్తి కార్యక్రమం అనుకున్నారట.

Read Also: Kamakhya: అదిరే అభి డైరెక్షన్లో సముద్రఖని ‘కామాఖ్య’

కానీ.. ఆ తర్వాతే… అసలు మేటర్‌ తెలిసి …. అమ్మనీ, వీళ్ళు దేవుడిని ఇలా కూడా వాడుతున్నారా అంటూ ముక్కున వేలేసుకున్నట్టు తెలిసింది. బీజేపీ ఎంపీ ముఖ్య అనుచరులుగా చెప్పుకునే వాళ్ళే దీని వెనక ఉన్నారని, ఎంపీ సాబ్‌కి తెలియకుండా వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్‌ చేప్టటే ధైర్యం చేయబోరని చెప్పుకుంటున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో. దీంతో ఆ బీజేపీ ఎంపీ ఎవరు? ఈ దందాలో ఆయన ఇంట్రస్ట్‌ ఏంటంటూ రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాఖ బీచ్ రోడ్డులో రెండు నెలల క్రితం ప్రైవేట్‌ స్థలంలో అయోధ్య రామమందిర నమూనా సెట్‌ వేశారు. అంతకు ముందు కుంభమేళాలో సెట్ వేస్తే వచ్చిన ఆదాయం కళ్ళ చూసిన నిర్వాహకుడు వంగలపూడి దుర్గా ప్రసాద్‌కు ఇక ఆగబుద్ది కాలేదట. కుంభమేళాతోనే ఆపేయడం ఎందుకు? దీన్నో పర్మినెంట్‌ ఆదాయ వనరుగా మార్చుకుంటే పోలా… అనుకుంటూ… సెకండ్‌ ప్రాజెక్ట్‌గా వైజాగ్‌ బీచ్‌ రోడ్‌ను ఎంచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. అనుకున్నదే తడవుగా…సెట్టేసేసి స్వయంగా బాలరాముడి దివ్యరూపమే మన ముందు ప్రత్యక్షం అయిందంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టేశాడు. ఇందుకు బీజేపీ నేతల సహకారం లభించడంతో… కమర్షియల్‌గా ఫుల్‌ బిజీ అయిపోయిందట. రోజుకు కనీసం 5వేల మంది.. గరిష్టంగా 25వేల మంది వరకు ఈ సెట్‌ను చూసి వెళ్ళడం మొదలుపెట్టారు. మామూలుగా అంతవరకైతే… ఏదో సెట్టో బొట్టో… దేవుడిని అయితే చూపిస్తున్నారని అనుకోవచ్చు.

Read Also: Vallabhaneni Vamsi: మరోసారి హైకోర్టును ఆశ్రయించిన వల్లభనేని వంశీ.. సడలింపు ఇవ్వండి..!

కానీ.. ఆ తర్వాతే నిర్వాహకులు తమ అసలు ప్లాన్‌ వర్కౌట్‌ చేయడం మొదలుపెట్టి బాల రాముడిని అంగడి సరకు చేసేశారు. కూర్చుంటే డబ్బు, నిలబడితే డబ్బు అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. ప్రతిదానికి టిక్కెట్‌ పెట్టేసి… రోజూ లక్షల్లో దండుకోవడం మొదలుపెట్టారు. పైగా… ఎలాంటి అనుమతులు లేవు. ఇంత భారీ సెట్‌ వేసి, వేలల్లో జనం వచ్చే ప్రోగ్రామ్‌కు మున్సిపల్‌, పోలీస్‌ అనుమతులు తప్పనిసరి. కానీ… ఇక్కడ అలాంటివేం లేవు. అదేమంటే… మా వెనక బీజేపీ ఎంపీ ఉన్నారన్నది నిర్వాహకుల సమాధానం అట. మరి రేపు జరగరానిది ఏదన్నా జరిగితే… ఆ ఎంపీ గారు బాధ్యత వహిస్తారా అన్నది విశాఖలోని ప్రభుత్వ విభాగాల ప్రశ్న. పర్మిషన్స్‌ విషయంలో ప్రభుత్వ సిబ్బందికి అభ్యంతరాలు ఉన్నా… బీజేపీ ఎంపీకి ముఖ్య అనుచరులుగా ముద్రపడ్డవాళ్ళు నిర్వాహకులకు మద్దతుగా నిలబడటం, సందర్భాన్ని బట్టి వాళ్ళే ముందుండటంతో… అధికారులు కూడా చూసీ చూడనట్టే ఉన్నట్టు సమాచారం. అప్పటికీ… నగర ప్రజలకు, బీచ్‌కు వచ్చేవాళ్ళకు ఇబ్బంది కలగడంతో…. పార్కింగ్‌ సదుపాయం కల్పించకుంటే యాక్షన్‌ తీసుకుంటామని పోలీసులు ఒకటి రెండు సార్లు హెచ్చరించారట కూడా.

Read Also: Delhi: అక్రమ మత మార్పిడి ముఠా గుట్టురట్టు.. అనేక రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌.. హిందూ యువతులే టార్గెట్..!

అయినా సరే… సదరు బీజేపీ ఎంపీ మా వెనకున్నారన్న ధైర్యంతో వాళ్ళు లెక్క చేయలేదని చెప్పుకుంటున్నారు. మామూలుగా అయితే… ఇది పెద్ద సీన్‌ అవకపోయేదిగానీ… నిర్వాహకుల కాసు కక్కుర్తికి హద్దే లేకుండా పోవడంతో… రచ్చ రంబోలా అయి ఏకంగా కాషాయ నేతల కాళ్ళ కిందికి తెచ్చిందని అంటున్నారు. భద్రాచలం అర్చకులతో ఈనెల 29న సీతారామ కళ్యాణం చేయిస్తామన్న ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చింది. ఒక్కో టిక్కెట్‌కు మూడువేల రూపాయల ధర నిర్ణయించినా భద్రాద్రి అర్చకులనడంతో జనం వెనకాడలేదు. విషయం ఆనోట ఈ నోట భద్రాచలం ఈవో దృష్టికి వెళ్ళడంతో… కూపీ లాగితే… దందా మొత్తం బయటపడింది. దేవాదాయశాఖ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు పబ్లిసిటీ చేసి భక్తులను మోసగించిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఈవో. దీంతో బీజేపీ నేతల బాగోతాల మీద కూడా చర్చ మొదలైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ఎంపీ పాత్రపై పార్టీ ఢిల్లీ నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్ళడంతో వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టినట్టు సమాచారం. కల్యాణం పేరుతో లక్షల వసూలుకు ప్రణాళిక, అందుకు బీజేపీ నేతల ప్రత్యక్ష, పరోక్ష సహకారం, ఏకంగా పార్టీ ఎంపీ పేరు తెర మీదికి రావడంపై కాషాయ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ తదుపరి యాక్షన్‌ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Exit mobile version