Site icon NTV Telugu

Off The Record: టీడీపీలో ఒరిజినాలిటీ మిస్ అవుతుందా?

Tdp

Tdp

Off The Record: ప్రభుత్వాన్ని కొంతవరకు నడుపుతోంది కన్సల్టెంట్లే కదా..? అంతా వాళ్ళ స్క్రిప్ట్‌ ప్రకారమే జరుగుతోంది కదా…? ఇదీ… ఇటీవల ఓ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్య. జరుగుతున్న పరిణామాల్ని తెలుసుకుని అన్నారో… లేక స్వయంగా ఆయనే ఇబ్బంది పడ్డారోగానీ…దాని గురించే ఇప్పుడు పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే కన్సల్టెంట్స్‌… సలహాలు, సూచనలు ఇవ్వడం మొదలు పెట్టారో…. అప్పుడే పార్టీ నాయకులు మంత్రుల సహజ శైలి మరుగునపడిపోయిందని, సందర్భానుసారం స్పాంటేనియస్‌గా స్పందించలేకపోతున్నారన్నది పార్టీ వర్గాల టాక్‌. ఒక చట్రంలో ఉండిపోయి… చెప్పాల్సింది చెప్పలేక పోతున్నామనే ఆవేదన కూడా కొంతమంది టీడీపీ లీడర్స్‌లో వ్యక్తం అవుతోందట. అలాంటి బయటి వాళ్ళ సలహాలు ఒక పరిధి వరకు ఓకేగానీ… పూర్తిగా వాళ్ళ మీదే ఆధారపడితే…. రాబోయే రోజుల్లో కచ్చితంగా ఒరిజినాలిటీ మిస్‌ అవుతుందన్న కామెంట్స్‌ పార్టీ లీడర్స్‌ నుంచే వినిపిస్తున్నాయి.

ఆ తెచ్చిపెట్టుకున్న సూచనలతో చివరికి సీఎం చంద్రబాబు కూడా… తన సహజ శైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని, అది ఎంత వరకు కరెక్టో ఆయనే రివ్యూ చేసుకోవాలన్న మాటలు సైతం నడుస్తున్నాయట కేడర్‌లో. ఇటీవల నెల నెలా పెన్షన్స్‌ ఇచ్చే సమయంలో ఆయన తీరు గురించి మాట్లాడుకుంటున్నారు. ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళి కాఫీ పెట్టడం…టీ పెట్టడం..లాంటివి చేస్తున్నారు. అంతే కాకుండా సడన్‌గా కారు దిగి ఆటో ఎక్కడంలాంటివన్నీ కూడా కన్సల్టెంట్స్‌ సూచనలు..సలహాలతోనే జరుగుతున్నాయట. ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు ఇలాంటి వాటికి దూరంగా ఉండేవారు. ఆయనదంతా డిఫరెంట్‌ స్టైల్‌. జన్మభూమి, ఆకస్మిక తనిఖీల్లాంటి సొంత బ్రాండెడ్ ప్రోగ్రామ్స్‌ ఉండేవి. ఇప్పుడు కూడా నేను 95 సీఎంని అని పైకి చెబుతున్నా…. ఆచరణలో మాత్రం ఆ రకమైన ధోరణి ఉండడం లేదనే చర్చ జరుగుతోందట పార్టీ సర్కిల్స్‌లో. కన్సల్టెంట్స్‌ చెప్పింది..ఓ స్థాయి వరకు వర్కవుట్ అవుతుందని..కానీ రిపీటెడ్‌గా అవే పనులు చేస్తుంటే మాత్రం డ్రమెటిక్‌గా అనిపిస్తాయంటున్నారు పరిశీలకులు. కొంత మంది టీడీపీ మంత్రులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారట.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై తమకు ఒక క్లారిటీ ఉంటుందని, దాని ప్రకారమే మేం మాట్లాడతామని, కానీ… మధ్యలో ఉన్నవాళ్ళ సలహాల కారణంగా… నేరుగా చెప్పాలనుకున్నది చెప్పలేక విషయం డైవర్ట్ అవుతోందన్న ఫీలింగ్‌లో మంత్రులు ఉన్నట్టు తెలుస్తోంది. పోనీ… మమ్మల్ని కట్టడి చేసి… కన్సల్టెంట్స్‌ మాట్లాడమన్నట్టు మాట్లాడినా… జనం నుంచి ఆశించిన రెస్పాన్స్‌ వస్తోందా..? అన్నది ఒకరిద్దరు మినిస్టర్స్‌ క్వశ్చన్‌. అక్కడ అంత సీన్‌ లేదన్నది వాళ్ళ అభిప్రాయం. ఇలా… ఓవరాల్‌గా.. మధ్య మనుషుల సలహాల గురించి గట్టి చర్చే జరుగుతోందట టీడీపీలో. సాధారణంగా ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎవరి స్టైల్‌ వారికి ఉంటుందని, అదే పార్టీకి కూడా బలమని, దాన్ని వదిలేసి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ ప్రకారం మాట్లాడాలంటే… సహజ లక్షణాన్ని మర్చిపోయి వాటి మీదే ఆధారపడే పరిస్థితి పెరుగుతుందని అంటున్నారు పార్టీ లీడర్స్‌. ముఖ్యంగా సీనియర్‌ మినిస్టర్స్‌ ఇదే అభిప్రాయంతో ఉన్నారట. తమ ఒరిజినల్‌ పెర్ఫామెన్స్ చూపించడానికి కొంత మంది మంత్రులు, పార్టీ నేతలు రెడీ గా ఉన్నా….. అంతొద్దమ్మా అంటూ కన్సల్టెంట్స్ చెప్పిందే చేయమనడంతో… ఇబ్బందులు పెరుగుతున్నాయి, మేటర్‌ సరిగా జనంలోకి వెళ్ళడం లేదన్నది తెలుగుదేశం వర్గాల భావన.

Exit mobile version