Site icon NTV Telugu

Off The Record: ఆ సీనియర్ ఐఏఎస్‌కు మళ్లీ షాక్ తగలబోతుందా..?

Arvind Kumar

Arvind Kumar

Off The Record: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది రేవంత్‌రెడ్డి సర్కార్‌. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో పియర్స్ కుంగుబాటుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఏర్పాటైంది. అలాగే.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణం.. ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటైంది. నరసింహారెడ్డి కమిషన్‌ పూర్తి లోతుల్లోకి వెళ్లి పూర్తి స్థాయి తవ్వకాలు మొదలుపెట్టిందట. విద్యుత్ ఒప్పంద నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తు­త, మాజీ అధికారులకు వరుసబెట్టి నోటీసులు ఇస్తున్నట్టు తెలిసింది. ఆయా అధికారులు, మాజీ అధికారులు పోషించిన పాత్ర, వాళ్ళ మీద ఉన్న వత్తిళ్ళలాంటి అంశాలపై దృష్టి సారించి వివరాలు సేకరిస్తందట కమిషన్‌.

అలాగే ఈ ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్‌ కొనుగోలులో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి వివరాలను సేకరించేందుకు బహిరంగ ప్రకటన కూడా జారీ చేసింది. ఆ క్రమంలోనే వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు రాతపూర్వకంగా అందించడానికి వీలు కల్పించబోతున్నట్టు తెలిసింది. అవసరమైతే బహిరంగ విచారణకు రావాలని వారిని పిలిపించే అవకాశమూ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీటన్నిటికీ కేంద్ర బిందువుగా… ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ఉన్నట్టు అనుమానిస్తోందట కమిషన్‌. దాదాపు డజన్‌ మంది అధికారులకు నోటీసులు ఇచ్చినా.. అరవింద్‌కుమార్‌ని కింగ్‌పిన్‌గా భావిస్తూ… ఆయన పాత్ర మీదే ఎక్కువ ఫోకస్‌ పెట్టినట్టు గుసగుసలాడుకుంటున్నాయి సెక్రటేరియెట్‌ వర్గాలు. అలాగే.. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ కేంద్రాల నిర్మాణ పనులను దక్కించుకున్న బీహెచ్‌ఈఎల్‌ సంస్థ ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు, ఛత్తీస్‌గఢ్‌ స్టేట్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారులకు సైతం నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణలో విద్యుత్ సమస్యను పరిష్కారం కోసం ఛత్తీస్‌గఢ్‌తో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్ ఒప్పందం చేసుకుంది నాటి కేసీఆర్‌ సర్కార్‌. దీన్ని అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించాయి ప్రతిపక్షాలు. బహిరంగ మార్కెట్ లో తక్కువ ధరకు దొరికే కరెంట్‌ను ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఎక్కువ ధరకు కొనడం ఎందుకని ప్రశ్నిస్తూ.. ఇందులో కేసీఆర్‌కు కమీషన్లు ముట్టాయని ఆరోపించాయి నాటి ప్రతిపక్షాలు. ఈ ఒప్పందాలపై నాటి ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అర్వింద్ కుమార్ సంతకాలు చేశారు. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారుల తీరును తప్పుబట్టారు. ఒప్పందంలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు ఇవిగో ఆధారాలంటూ కొన్ని పత్రాలను బహిర్గతం చేశారాయన. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దాని మీద దృష్టి పెట్టారట. ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఆయనకు పూర్తి అవగాహన ఉందని, అందుకే రిటైర్డ్ జడ్జిని నియమించి విచారణకు ఆదేశించారని అంటున్నాయి రాజకీయవర్గాలు. ఇప్పటికే నోటీసులు అందుకున్న అర్వింద్‌ కుమార్‌.. త్వరలో కమిషన్ ముందు కూడా హాజరు కావాల్సి ఉంటుందనే చర్చ అధికార వర్గాల్లో నడుస్తోంది. ఇప్పుడు ఆయన నోటీసులకు ఏం సమాధానం చెబుతారు? తాను సంతకాలు చేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version