Off The Record: కొంపెళ్ళ మాధవీలత.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనం ఆమె. ప్రత్యేకించి బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్. హిందుత్వను భుజానికెత్తుకోవడంతో పాటు అదే సమయంలో… పస్మందా ముస్లింలకు సేవ చేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చారామె. అంతేకాదు.. పార్టీ పరంగా.. లోకల్‌తో సంబంధం లేకుండా ఢిల్లీ లింక్స్‌తో బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ టికెట్ తెచ్చుకున్న మహిళ నేత. ఆ ఊపుతోనే హైదరాబాదు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రత్యేకించి ఓల్డ్‌సిటీ విషయంలో ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నారు. అయితే అసలు స్టోరీ వేరే ఉంది. మాధవీలతకు టిక్కెట్ విషయంలో స్థానిక నాయకుల ప్రమేయం పెద్దగా లేకపోవడంతో ప్రచార పర్వంలో స్థానిక నేతల సహకారం కొరవడుతోందన్నది పార్టీ వర్గాల మాట. ఆమె మాత్రం ఎవరు వచ్చినా.. రాకున్నా.. డోంట్ కేర్ అన్నట్టుగా ముందుకు వెళ్తున్నారట. అదెలా సాధ్యం అంటే… లోకల్ గీకల్ జాన్తానై… ఎవరు వచ్చినా రాకున్నా డోంట్‌వర్రీ అంటూ పార్టీ ఢిల్లీ ఆఫీస్ అభయం ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
పార్టీ కేంద్ర పెద్దలు ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తున్నారట మాధవీలతకు. పార్టీ పరంగా ఈ సారి పోటీ చేస్తున్న అత్యంత ప్రాముఖ్యత ఉన్న అభ్యర్థుల్లో ఆమె కూడా ఒకరని తెలిసింది. అది ఎంతలా అంటే.. మాధవీలత ప్రచారంపై ఏకంగా ప్రధాని కార్యాలయం దృష్టి పెట్టినట్టు బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకు తాజాగా ప్రధాని స్పందించిన తీరునే ఉదహరిస్తున్నారు. చాలా మంది బీజేపీ అభ్యర్థుల్లాగే మాధవీలత కూడా ఇటీవల ఓ టీవీ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని చూడండి అంటూ స్వయంగా మోడీ ట్వీట్ చేశారంటేనే ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చంటున్నారు పార్టీ నేతలు. ప్రాధాన్యత ఇవ్వడం వరకు ఓకే… కానీ… అలా ఎందుకు? పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న నాయకులకు కూడా దక్కని గౌరవ మర్యాదలు నిన్నగాక మొన్న వచ్చిన మాధవీలతకు ఎలా దక్కుతున్నాయని తెగ ఆరా తీస్తున్నారు కాషాయ నేతలు. ఆ మ్యాజిక్ ఏంటన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయట పార్టీ వర్గాల్లో. విషయం తెలిసిన వారు, సూపర్ సీనియర్స్ మాత్రం అందుకు బలమైన కారణమే ఉందని చెబుతున్నట్టు తెలిసింది.
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం మజ్లిస్ పార్టీ అడ్డా. ఇక్కడ ఎంఐఎంను కాదని గెలవడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఆ విషయం పార్టీ కేంద్ర పెద్దలకు తెలుసు కాబట్టే.. అంత జాగ్రత్త తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. టార్గెట్ 400తో ఈసారి ప్రతి సీటును ప్రత్యేకంగా చూడటం, హైదరాబాద్ ఎంపీ సీట్లో కమలం జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉండటం వల్లే అభ్యర్థిగా మాధవీలతకు అంత ప్రాధాన్యం దక్కుతున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. పైగా ఒక ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేత అండదండలు కూడా ఆమెకు పుష్కలంగా ఉన్నాయన్నది కాషాయదళంలో ఇంటర్నల్ టాక్. అందుకే మాధవీలత ప్రచారంలో ఎవరు పాల్గొంటున్నారు? ఎవరు పాల్గొనడం లేదంటూ ఢిల్లీ పెద్దలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట.. విషయం తెలియక అంటీ ముట్టనట్టుగా ఉంటున్న ముఖ్య నాయకులకు నేరుగా ఢిల్లీనుంచే ఫోన్‌కాల్స్ వస్తున్నట్టు తెలిసింది. అప్పగించిన పని ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారట. మాధవీలత కూడా లోకల్‌గా ఏదన్నా సమస్య ఉంటే.. నేరుగా ఢిల్లీ నేతల చెవిలోనే వేస్తున్నట్టు తెలిసింది. గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ హైదరాబాదు పార్లమెంట్ పరిధిలోకే వస్తుంది. కానీ… అక్కడి ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యర్థితో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారని, ఆ విషయంలో కేంద్ర నాయకత్వం అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె అసదుద్దీన్‌పై పోటీ చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యేకి పార్టీ పెద్దలు చెబుతున్నట్టు తెలిసింది. మొత్తంగా హైదరాబాద్ ఎంపీ సీట్లో కాషాయ జెండా ఎగరేసి సంచలనం సృష్టించాలని ఉవ్విళ్ళూరుతున్నారట బీజేపీ పెద్దలు. మరి ఆ ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.
