NTV Telugu Site icon

Off The Record: చంద్రబాబు అరెస్టుకు వాస్తు దోషమే కారణమా..? అక్కడే తేడా కొట్టిందా..?

Chandrababu

Chandrababu

Off The Record: 2014లో అధికారం చేపట్టిన తొలి నాళ్లల్లో బస్సులోనే బస చేశారు చంద్రబాబు. ఇరిగేషన్ ఆఫీస్‌ కాంపౌండ్‌నే సీఎం కార్యాలయంగా మార్చుకున్నారు. ఆ తర్వాత ఉండవల్లిలోని కరకట్ట నివాసంలోకి మారారాయన. వాస్తు మొత్తం చూసుకునే అందులోకి షిఫ్ట్‌ అయినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. పైగా పక్కనే నది ప్రవహిస్తోంది కాబట్టి అద్భుతమైన వాస్తు అని ప్రచారం జరిగింది. అక్కడే గత ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతా చేపట్టారు బాబు. అయినా ఓడిపోయారు. అది కూడా అలాంటి.. ఇలాంటి ఓటమి కాదు. తెలుగుదేశం పార్టీ తన చరిత్రలోనే లేనంతగా 23 స్థానాలకే పరిమితమైంది. దీంతో అప్పట్లోనే చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ఇంటి వాస్తు గురించి చర్చించుకున్నారు. అయితే.. అప్పట్లో జగన్ సర్కార్‌ వచ్చీ రావడంతోనే… అక్రమ కట్టడం అంటూ ప్రజా వేదిక కూల్చేయడం.. దాని శిధిలాలు కూడా తొలగించకపోవడంతో కొంత ప్రెస్టేజీయస్‌గా తీసుకున్న చంద్రబాబు కరకట్ట ఇంటిలోనే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా మరోసారి ఆ ఇంటి వాస్తు చర్చనీయాంశం అయింది.

తన నాలుగు దశాబ్దాలకు పైబడ్డ రాజకీయ జీవితంలో చంద్రబాబు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటి సారని, తక్షణమే ఆయన ఉండవల్లి నివాసాన్ని ఖాళీ చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టింగ్ తెగ సర్కులేట్ అవుతోంది. బాబు ఆ బంగ్లాలో ఉండడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అమరావతి ప్లాన్ మధ్యలోనే ఆగిపోయిందని, అక్కడే ఉండి ఎన్నికలను ఎదుర్కొని ఓడిపోయారని, 2019 తరువాత, అన్ని రకాల అవమానాలను ఎదుర్కొన్నారని, దానికి కొనసాగింపుగానే ఇప్పుడీ అరెస్ట్‌ జరిగిందని, ఈ బంగ్లాలో ఉంటూ 2024 ఎన్నికలకు వెళ్లకూడదన్నది ఆ పోస్టింగ్‌ సారాంశం. అయితే ఈ తరహాలో సోషల్ మీడియా పోస్టింగులు పెట్టేవారు.. మిత్రులో.. ప్రత్యర్థులో అన్నది కూడా అర్ధం కావడం లేదట. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చూసి ఇంటిని ఖాళీ చేస్తే.. అదో నెగెటివ్‌ చర్చకు దారి తీసే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు కొందరు.

వాస్తు దోషాలను కొట్టి పారేయలేమని.. కానీ, ఇప్పుడు ఏ స్టెప్ తీసుకున్నా దాన్ని భూతద్దంలో చూసే బ్యాచ్ ఎక్కువైపోయారనేది టీడీపీ నేతల వాదన. ఇప్పుడు ఇల్లు మారిస్తే అదో రకమైన ట్రోలింగ్సుకు దారి తీసే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. అయినా ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు హైదరాబాదులో ఉంటున్నారని, ఏపీకి వచ్చినప్పుడు నివాసం ఉంటున్నా.. కాపురం ఉన్నది హైదరాబాదులోనే కదా అన్నది వాళ్ళ వెర్షన్‌. ఉండవల్లి నివాసం ఓ రకంగా చూస్తే గెస్ట్ హౌస్ లాంటిదే తప్ప ఆయన సొంతిల్లు కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వాస్తు అంశాన్ని.. చంద్రబాబు కుటుంబం ఏ కోణంలో చూస్తుందో తెలీదు. వాళ్ళ స్పందనను బట్టే తదుపరి నిర్ణయం ఉంటుందని అంటున్నారు.