NTV Telugu Site icon

Off The Record: గుంటూరు రాజకీయాల్లో కొత్త మలుపు…

Gnt

Gnt

Off The Record: గుంటూరులో కొద్ది రోజులుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల స్వరం మారుతోందన్న టాక్ వినిపిస్తోంది. నిన్న మొన్నటిదాకా చెలరేగిన వైసీపీ లీడర్స్ కొందరు ఇప్పుడు కొద్దిగా స్వరం తగ్గించి టిడిపి నేతలకు కన్ను గీటుతున్నారట. దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ.. పాజిటివ్‌ సిగ్నల్స్‌ పంపుతున్నట్టు ప్రచారం ఉంది. నగర అభివృద్ధి కోసం తాము టీడీపీతో కలిసి పనిచేయడానికి సిద్ధమని ఇంకొందరు బాహాటంగానే చెబుతున్నారట. ఈక్రమంలోనే మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆలపిస్తున్న కొత్త రాగాలపై చర్చ మొదలైంది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, స్థానిక ఎమ్మెల్యేలతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, కలిసి పని చేస్తానంటూ.. సన్నాయి నొక్కులు నొక్కుతున్నారాయన. గతంలో వైసిపి ఎమ్మెల్యేలతోనే తాను స్వపక్షంలో, ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నానని, అలాంటిది ఇప్పుడు పార్టీ మారినా తనకేమీ ఇబ్బంది ఉండదని చెప్పుకొస్తున్నారట మేయర్‌. ఆయన ఇలా సడన్‌గా టోన్‌డౌన్‌ చేయడం, కొత్త స్వరం వినిపించడం వెనక కథ చాలానే ఉందన్న చర్చ జరుగుతోంది గుంటూరులో. మేయర్ ఆంతరంగికులతో పాటు, టిడిపి, జనసేనలో ఉన్న కొద్దిమంది కాపు నాయకుల సలహాలే అందుకు కారణమన్న ప్రచారం జరుగుతోంది.

Read Also: ENG vs WI: లార్డ్స్‌ టెస్ట్‌ను గంట కొట్టి ప్రారంభించిన అండెర్సన్ ఫ్యామిలీ.. ఎందుకో తెలుసా..?

2025 మార్చి వరకు మేయర్ పదవికి ఢోకా లేకున్నా, ఆ తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, ఇటు టిడిపికి గాని, అటు జనసేనకు గాని జంప్ అయితేనే మంచిదన్న సలహాలు ఇస్తున్నారట కావటి సన్నిహితులు. పైగా ఇప్పటికే కొద్దిమంది కార్పొరేటర్లు టిడిపికి టచ్ లోకి వెళ్లారని ప్రచారం జరుగుతున్న క్రమంలో.. మనం ఎందుకు తగ్గాలి ముందే కర్చీఫ్ వేస్తే పోలా అనుకుంటూ.. కూటమి పార్టీలతో టచ్‌లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ముందే కార్పొరేటర్లు పార్టీ మారిపోయి ఎక్కడ తన సీటు కింది నీళ్ళు తెస్తారోనని అందోళనగా ఉన్న మనోహర్‌.. కూతంత స్వరం తగ్గించి టీడీపీతో యుగళగీతానికి రెడీ అంటున్నారన్నవి గుంటూరు గుసగుసలు. మనోహర్ నాయుడు, 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు కూడా. అక్కడ ఓడిపోవడంతో.. తిరిగి మళ్లీ తన మేయర్ స్థానానికి తాను వచ్చి కూర్చున్నారు…

Read Also: Deputy CM Pawan Kalyan: జూ పార్క్‌ అభివృద్ధి కోసం.. టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమం

అయితే 2025 వరకు గుంటూరు అభివృద్ధిలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ మేయర్ కు అనుబంధంగానే ఉంటాయి. టిడిపికి ఇష్టం ఉన్నా, లేకున్నా, ప్రోటోకాల్ ప్రకారం మేయర్ ను పక్కన పెట్టుకొని తిరగాలి కాబట్టి… గ్యాప్ ఉంటే ఆ ప్రభావం అభివృద్ధి కార్యక్రమాలపై పడుతుందేమోనన్న ఆలోచనతో ఉన్నారు కొందరు తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు. అటు మేయర్ మాత్రం తన కుర్చీకి ఎలాంటి ఇబ్బంది రాకూడదన్న ఆలోచనతో అధికార పార్టీతో సఖ్యత కోరుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంకో అడుగు ముందుకేసి అసెంబ్లీలో భువనేశ్వరిపై మా నాయకులు అలా మాట్లాడటం తప్పే, వల్లభనేని వంశీని రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి అయినా సరే , అరెస్టు చేయాల్సిందేనని ఆయన ఉద్దేశ్యాన్ని తెలియజేస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదిలా జరుగుతుండగానే… టిడిపిలోని మరో వర్గం మేయర్ ఎత్తులను గమనించి ,దానికి కౌంటర్స్‌ రెడీ చేస్తోందట. ఆయనకు టిడిపి అవసరం అనుకుంటే… వైసీపీ తరపున వచ్చిన పదవికి రాజీనామా చేసి మాట్లాడాలంటూ కొత్త డిమాండ్ పెడుతున్నట్టు తెలిసింది. ఈ విషయంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఒకవైపు నుంచి , ప్రేమ రాగాలు ….మరోవైపు రాజీనామా డిమాండ్లతో గుంటూరు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మరి మేయర్ మనోహర్ నాయుడు టిడిపికి దగ్గర అవుతారా ,లేక జనసేనకు జై కొడతారా ? లేక రాజీనామా డిమాండ్‌తో ఇది కుదిరే యవ్వారం కాదని కామైపోతారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.