Off The Record: గుడివాడ అమర్నాథ్… ఏపీ మాజీమంత్రి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ కమ్ జగన్ వీర విధేయత ముద్ర ఉన్న నాయకుడు. అప్పుడు మంత్రి పదవికైనా, ఇప్పుడు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికైనా… ఈ ఫార్ములానే వర్కౌట్ అయిందన్నది ఒక అభిప్రాయం. అదంతా డిఫరెంట్ స్టోరీ. కానీ… పార్టీ అధిష్టానం దగ్గర ఎంత పలుకుబడి ఉన్నా… ఏ పదవులు నిర్వహించినా… ఈ మాజీ మంత్రికి ఓ కేరాఫ్ అడ్రస్ లేకుండా పోయిందన్న అసంతృప్తి మాత్రం ఉందట ఆయనకు. గత ఎన్నికల సమయంలో పార్టీ చేసిన జంబ్లింగ్ విధానం ఫెయిల్ అవ్వడమే అందుకు కారణం అంటున్నారు. అమర్నాథ్‌ది పూర్తిగా పొలిటికల్ ఫ్యామిలీనే. ఆయన తాత ఎమ్మెల్యే, తండ్రి గుర్నాథరావు ఎంపీ. ఆ వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మాజీ మంత్రి…2014ఎన్నికల్లో తొలిసారి వైసీపీ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. గురుశిష్యులుగా ప్రచారంలో వున్న అమర్నాథ్.., అవంతి శ్రీనివాస్ తొలిసారి ఇక్కడ బరిలోకి దిగారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధుల మధ్య హోరాహోరీ జరిగింది. నాడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న అవంతి శ్రీనివాస్ విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల నాటికి గుడివాడ సీట్ చేంజ్ అయింది. అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్ధిగా నాన్ లోకల్ సీటులో అదృష్టాన్ని పరీక్షించుకోగా…. అప్పటి ఫ్యాన్ వేవ్‌లో వర్కౌట్ అయి గెలవడంతో పాటు జగన్ కేబినెట్‌లో చోటు సంపాదించగలిగారు. ఇక అధికారంలో వున్నప్పుడు టీడీపీ, జనసేనలపై విరుచుకుపడేవారు. పవన్ కల్యాణ్ మీదికి అమర్నాథ్‌ను సామాజిక అస్త్రంగా ప్రయోగించింది వైసీపీ.
ఎన్నికల టైం వచ్చేసరికి వివిధ కారణాలతో ఆయన్ని అనకాపల్లి నుంచి మార్చేసింది వైసీపీ అధిష్టానం. ఆఖరి నిముషంలో ఆయన కూడా ఊహించని విధంగా గాజువాక టిక్కెట్ ఖరారు చేసి షాకిచ్చింది. ఇక్కడ టీడీపీ గెలుపు ఎంత చర్చనీయాంశమో వైసీపీకి ఎదురైన పరాభవం కూడా అంతే కీలకం అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. బీసీ, కాపు ఓటర్లు ఎక్కువగా వుండే గాజువాకలో మొదటి నుంచి టీడీపికి పట్టు ఎక్కువ. 2019లో పవన్ కల్యాణ్ ఓటమి తర్వాత దృష్టిపెట్టిన జనసేన తమ ఓట్ బ్యాంక్‌ను కూడా బాగా పెంచుకుంది. వీటన్నిటికీ మించి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం, వైసీపీలో అంతర్గత రాజకీయాలు అమర్నాథ్‌కు అడుగడుగునా బ్రేకులు వేశాయట. ఈ పరిస్థితిని ముందే ఊహించినా… అధిష్టానం ఆదేశాలతో గాజువాకలో పోటీ చేసిన గుడివాడ ఫ్లాప్ షోకు పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే… తనకంటూ ఒక పర్మినెంట్ నియోజకవర్గం కావాలని సెర్చ్ చేస్తున్నారట ఆయన. మంత్రిగా అనకాపల్లి రాజకీయాల్లో తన ముద్ర వేయగలిగినా… వచ్చే నాలుగున్నరేళ్ళ పరిణామాలను ఇప్పుడే అంచనా వేసి అక్కడ అడుగుపెట్టడం సరైంది కాదన్న అభిప్రాయం ఉందట గుడివాడకు. అటు ఇటీవల జిల్లా అధ్యక్షుల నియామకంలో సిటీ బాధ్యతలు ఆయనకు అప్పగించింది పార్టీ. ఆ కార్యక్రమాల బిజీలో ఉండగానే… వెదకబోతున్న తీగ కాలికి తగిలినట్టు ఓ పాజిటివ్ వైబ్ వచ్చిందట మాజీ మంత్రికి. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పారు.
అది ఊహించిన పరిణామమే అయినప్పటికీ అవంతి రాజీనామాతో కేడర్ చెదిరిపోకుండా వుండేందుకు అమర్నాథ్‌ను రంగంలోకి దించిందట అధిష్టానం. వెంటనే యాక్టివ్ అయిపోయిన మాజీ మంత్రి.. కేడర్ తో విస్త్రత స్ధాయి సమావేశం నిర్వహించడం ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక విధంగా ఇక భీమిలి బాధ్యతలు తీసుకుని దాన్నే సొంత నియోజకవర్గంగా మల్చుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకు అధిష్టానం వైపు నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చంటున్నారు.ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే….అమర్నాథ్ భీమిలికి పాత కాపే. ఆయన తండ్రి ప్రాతినిధ్యం వహించిన పెందుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు భీమిలి పరిధిలోని మధురవాడ, సింహాచలం వంటి ప్రాంతాలు కలిసి వుండేవి. సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఇక్కడ ఎక్కువే. పైగా… ఆయన అత్తారిది భీమిలి. ఇవన్నీ లెక్కేసుకునే మొన్నటి ఎన్నికల్లో భీమిలి సీటు కోసం ప్రయత్నించినా……అది సాధ్యం కాలేదు. ఇప్పుడిక ఖాళీ అవ్వడం, చక్కదిద్దే బాధ్యతలు తనకే అప్పగించడంతో… దీన్నే అడ్వాంటేజ్ తీసుకుని అమర్నాథ్ భీమిలిలో పాగా వేస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి వైసీపీలో.