Site icon NTV Telugu

Off The Record: బీఆర్ఎస్‌కు కొందరు కార్పొరేటర్లు కంట్లో నలుసులా మారారా?

Ghmc

Ghmc

Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గర పడుతున్నకొద్దీ రాజకీయ పార్టీల వ్యూహాలు పదునెక్కుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్నాయి ప్రధాన పార్టీలు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం జీహెచ్‌ఎంసీలో ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవాలని అడుగులు వేస్తున్నాయి. కీలకమైన ఈ లిమిట్స్‌లో మిగతా పార్టీల మాటెలా ఉన్నా… అధికార BRSకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు మధ్య గ్యాప్ రావడమే అందుకు కారణమని పార్టీ వర్గాలే అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల టైంలో సమన్వయమే అసలు సమస్య అవుతుందన్న భయాలు పెరుగుతున్నాయి.

Read Also: Off The Record: బీఆర్‌ఎస్‌ది ఒంటరి పోరాటమేనా? కూటమిలో ఆ పార్టీకి చోటు లేదా?

2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 55 డివిజన్లు గెలుచుకుంది గులాబీ పార్టీ. అప్పటి నుంచే పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు…కొంత మంది కార్పొరేటర్ లకు మధ్య గ్యాప్ వచ్చిందట. ఒక్కోచోట ఒక్కోరకమైన సమస్య ఉంది. కారణాలు ఏవైనా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వర్గాల అంతరంతో పార్టీలో అలజడి ఉందట. కొన్ని చోట్ల విబేధాలు బహిరంగగానే బయట పడితే…కొన్ని చోట్ల మాత్రం లోలోపల అసంతృప్తి పెరిగిపోతోందట. అంబర్ పేట,ఉప్పల్, ఖైరతాబాద్ , జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్ నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలకు …కార్పొరేటర్లకు మధ్య బాగా గ్యాప్ ఉందన్న చర్చ జరుగుతోంది. అంబర్ పేట, ఉప్పల్ ,జూబ్లీ హిల్స్ నియోజక వర్గాల్లో విబేధాలు రోడ్డున పడ్డాయన్న వాదనలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఏకంగా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసమ్మతి కార్యకలాపాలు నిర్వహిస్తున్నరట కార్పొరేటర్లు.

Read Also: Off The Record: బండి సంజయ్‌కి ఏమైంది..? ఆ మాటలు నిజమేనా?

రాష్ట్రంలో అధికారం సాధించాలంటే… రాజధాని మీద పట్టు చాలా ముఖ్యమని గ్రహించిన గులాబీ నాయకత్వం ఈ అసమ్మతి వ్యవహారాలపై దృష్టి పెట్టిందట. అంతొద్దు… కాస్త తగ్గండని ఎగిరెగిరి పడుతున్న కార్పొరేటర్స్‌కు సీరియస్‌ వార్నింగే ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. మరి ఆ వార్నింగ్స్‌ పనిచేసి అసెంబ్లీ ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందా? లేక కార్పొరేటర్లే ఎమ్మెల్యేలకు పక్కలో బల్లెంలా మారతారా అన్నది చూడాలి.

Exit mobile version