NTV Telugu Site icon

Off The Record: ఇంతియాజ్ పరిస్థితి క్వశ్చన్ మార్కేనా..?

Otr Imtiyaz

Otr Imtiyaz

Off The Record: ఆ మాజీ ఐఎఎస్‌ పొలిటికల్‌ ప్లస్సా? మైనస్సా? సింపుల్‌గా, షార్ట్‌కట్‌లో వీలైతే ఎమ్మెల్యే… కుదిరితే మంత్రి కూడా అయిపోయి దర్పం ఒలకబోయాలనుకున్న ఆయన ముంత ఆదిలోనే ఒలికిపోయింది. అటు ఉద్యోగమూ పాయె… ఇటు పదవీ రాకపోయె. ఇప్పుడా అధికారి ఫుల్‌టైం పొలిటీషియన్‌ అవుతారా? ఆ నియోజకవర్గంలో వైసీపీని నిలబెట్టే సత్తా ఉందా? జీతపు రాళ్ళకు అలవాటు పడ్డ బాబు… జేబులో నుంచి డబ్బు తీసి కేడర్‌ కోసం ఖర్చు పెట్టగలరా? ఇంతకీ ఎవరాయన? ఏంటా కథ?

గ్రూప్ 1 ఆఫీసర్‌ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఐఏఎస్ స్థాయికి వెళ్ళారు ఇంతియాజ్ అహ్మద్. ఉన్నతాధికారిగా… ఎమ్మెల్యేలు, మంత్రులకు సన్నిహితంగా ఉంటూ….వాళ్ళ దర్జా, దర్పం చూసి ముచ్చట పడ్డారేమో…తాను కూడా రాజకీయ నాయకుడిగా మారిపోయారు. ఎప్పుడూ అధికారిగా వాళ్ళకి, వీళ్ళకి నమస్కారాలు పెట్టడమేనా?…. మనం కూడా ప్రజా ప్రతినిధిగా మారి ఒక్కసారి అధ్యక్షా… అంటే ఆ కిక్కే వేరని అనుకున్నారట. సార్‌ ఆలోచనలు అలా అలా కొనసాగుతుండగానే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల టైం రానే వచ్చేసింది. అప్పటి అధికార పార్టీ వైసీపీ మీద మోజు పుట్టింది ఇంతియాజ్‌కు. కర్నూల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నందున అక్కడ పోటీ చేస్తే భేషుగ్గా ఉంటుందని కూడా లెక్కలేసుకున్నారట. అదే సమయంలో… వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు… వైసీపీ కూడా కర్నూల్‌లో ముస్లిం మైనార్టీ అభ్యర్థి కోసం చూస్తోంది. ఇంకేముంది… ఇంకా సర్వీస్ ఉండగానే… ఇంతియాజ్‌ రాజీనామా చేయడం, ప్రభుత్వం నుంచి పరుగులుపెడుతూ అప్రూవల్స్‌ రావడం, ఆయన వైసీపీ కండువా కప్పుకోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం చకచకా జరిగిపోయాయి. వాస్తవంగా ఇంతియాజ్‌కంటే ముందు కర్నూలు వైసీపీ అభ్యర్థిగా డాక్టర్‌ ఇలియాజ్ పేరును అనుకున్నారట. కానీ… ఐఎఎస్‌గా ఇంతియాజ్‌ ఎంట్రీతో ఆయన సైడైపోవాల్సి వచ్చింది. ఎంత పోరాడి టిక్కెట్‌ తెచ్చుకున్నా… టీడీపీ వేవ్‌, ప్రత్యర్థిగా బలమైన అభ్యర్థి టీజీ భరత్ కావడంతో సామాజిక సమీకరణలు కూడా పనిచేయలేదు. సరే…. జరిగిందేదో జరిగిపోయింది. ఓడిపోతే పోయారు, ఉద్యోగానికి ఎలాగూ రాజీనామా చేసేశారు కాబట్టి… ఇంతియాజ్‌ ఇక ఫుల్‌టైం పొలిటీషియన్‌గా మారతారని అనుకున్నారట కర్నూల్‌ వైసీపీ కార్యకర్తలు. కానీ… ఆయన అడుగులు మాత్రం ఆ దిశగా పడుతున్నట్టు అనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.

ఓటమి తర్వాత ఇంతియాజ్ కర్నూలులో కనిపించడమే కష్టమైందట. దీంతో ఇప్పుడు నియోజకర్గంలో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్ , ఎస్వీ మోహన్ రెడ్డిని కాదని ఇంతియాజ్ కు టికెట్ ఇస్తే… తీరా ఇప్పుడు ఆయన కనిపించకుండా పోయారు. అటు పాత నేతలు సైతం మాకెందుకులే అన్నట్టుగా ఉంటున్నారు. తాను ఇక్కడే ఉంటానని, కార్యకర్తలకు అండగా ఉంటానని ఓడిపోయిన వెంటనే మీటింగ్ పెట్టి మరీ బిల్డప్‌ ఇచ్చిన ఇంతియాజ్ ఇప్పుడెక్కడ అంటూ ఆరా తీస్తోంది కేడర్‌. చివరికి వైఎస్ జయంతి కార్యక్రమంలో కూడా పాల్గొనలేదాయన. ఇలాగైతే కర్నూలులో వైసీపీ మనుగడ కష్టమేనన్న చర్చ జరుగుతోంది పార్టీలో. ప్రభుత్వ అధికారిగా తప్ప పార్టీ కార్యకర్తలతో ఎప్పుడూ మమేకం కాని ఇంతియాజ్ ఇపుడసలు పార్టీని నడిపించగలరా అనేది మరో క్వశ్చన్‌. అదే సమయంలో మరో వాదన సైతం ఉంది. ఆయన ఎమ్మెల్యే అయిఉండి, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ పరిస్థితి వేరు. కానీ… ప్రతిపక్షంలో ఉంటూ…పార్టీని నడపడం అంత తేలికైన వ్యవహారం కాదు. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చే కార్యక్రమాలకు కార్యకర్తలను సమీకరించడం, నిర్వహించడం ఆర్థిక భారంతో కూడుకున్న వ్యవహారం. ఆ విషయం తెలిసే… ఇప్పుడే అనవసరంగా ఆయాసపడి చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని ఇంతియాజ్ అనుకుంటున్నారా అన్న చర్చ సైతం జరుగుతోందట వైసీపీ వర్గాల్లో. ఈ పరిస్థితుల్లో కర్నూలు వైసీపీ ని నడిపేదేవరన్న ప్రశ్నకు ప్రస్తుతానికైతే సమాధానం లేదు. టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అందుబాటులో వుండడంలేదట. మరో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించే యోచనలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం. దీంతో ఇంతియాజ్‌ పొలిటికల్‌ కెరీర్‌ ప్రశ్నార్ధకమైందంటున్నారు. మరి ఆయన తిరిగి యాక్టివ్‌ అయిపోయి తన స్థానాన్ని పదిలం చేసుకుంటారా? లేక పొలిటికల్‌ రిటైర్డ్‌ హర్ట్‌ అవుతారా అన్నది చూడాలి.