NTV Telugu Site icon

Off The Record: మాజీ ఎంపీ వివేక్ మరోసారి పార్టీ మారుతారా..?

Vivek

Vivek

Off The Record: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా… మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి నిర్ణయాలపై తర్జనభర్జనలు కామన్‌ అయ్యాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీగా గెలిచారాయన. 2013లో బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. తిరిగి 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు స్వగృహ అంటూ కాంగ్రెస్‌లోకే వెళ్ళారు. అప్పుడు పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడాయన పార్టీ మారిన సంగతి కూడా ప్రజల్లోకి వెళ్ళక పోవడం ఓటమికి ప్రధాన కారణం అన్న విశ్లేషణలు వచ్చాయి. నాటి ఓటమి తర్వాత అదీ ఇదీ కాదని కాషాయ కండువా కప్పుకున్నారు వివేక్‌. ఇన్ని రోజులు బీజేపీలోనే ఉన్నారాయన. మాజీ ఎంపీని చెన్నూర్ అసెంబ్లీ సీటు నుంచి బరిలో నిలపాలని డిసైడ్ చేసింది కమలం పార్టీ.

కానీ… ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తే.. అధికార పార్టీ అభ్యర్థిని ఢీ కొట్టడం కష్టమన్న ఉద్దేశ్యంతో తాను లోక్‌సభకు పోటీ చేస్తానని చెప్పారట ఆయన. ఆ విషయంలో ఎలాంటి స్పష్టమైన హామీ లభించకపోవడంతో… మళ్ళీ కాంగ్రెస్‌ గూటికే చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. నేడో, రేపో ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమంటున్నారు సన్నిహితులు. వివేక్…. తన తండ్రి వెంకట స్వామి వారసత్వాన్ని అందిపుచ్చుకోగలిగినా….రాజకీయాల్లో నిలకడ లేని తనంతో తన పొలిటికల్‌ కెరీర్‌ని తానే సమాధి చేసుకుంటున్నారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. తరచూ పార్టీలు మారడం వల్ల ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఎలా మారతారో అర్ధంగాక కేడర్‌లో సైతం గందరగోళం పెరుగుతోందట. కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌కు, అక్కడి నుంచి తిరిగి కాంగ్రెస్‌కు, అట్నుంచి బీజేపీకి, మళ్ళీ మరో సారి కాంగ్రెస్‌ అంటుంటడంతో… ఈ నిలకడలేని తత్వాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక జట్టు పీక్కుంటున్నారట అనుచరులు. ఎక్కడా ఇమడలేక తిరిగి కాంగ్రెస్‌లో చేరబోతున్నా… ఇక్కడైనా స్థిరంగా ఉంటారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట. పార్టీ మారాక ఆయన చెన్నూర్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పుకుంటున్నారు.

అక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్కసుమన్‌ను ఢీ కొట్టాలంటే బలమైన ప్రత్యర్థి కావాలని భావించిన కాంగ్రెస్ పార్టీ… ఆర్థిక బలం, కుటుంబ రాజకీయ వారసత్వం ఉన్న వివేక్‌ను రంగంలోకి దింపబోతున్నట్టు తెలిసింది. వెంకటస్వామి కుటుంబంపై గౌరవవం ఉన్నవారంతా… చెన్నూరులో వివేక్‌కు మద్దతిస్తారని లెక్కలేస్తోందట కాంగ్రెస్‌. చెన్నూర్ సీటును సీపీఐకి ఇస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. అయినా… చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని వివేక్‌ను దింపాలని డిసైడైనట్టు తెలిసింది. వివేక్ కోసం సీటు త్యాగం చేయాలని సీపీఐకి కూడా ప్రతిపాదించినట్టు తెలిసింది. అట్నుంచి ఇంకా స్పష్టత రాకున్నా… చెన్నూర్‌ టిక్కెట్‌ హామీతోనే ఆయన పార్టీ మారబోతున్నట్టు తెలిసింది. వివేక్‌ ముఖ్య అనుచరులు సైతం ఈ మేరకు నియోజకవర్గంలో హడావిడి మొదలుపెట్టారు. అయితే ఆయన నోటి నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా వేచి చూద్దామనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై ఫుల్‌ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Show comments