NTV Telugu Site icon

Off The Record: వరంగల్ వెస్ట్‌లో ఫ్యామిలీ పాలిటిక్స్..! బాబాయ్ Vs అబ్బాయ్..!

Dasyam

Dasyam

Off The Record: వరంగల్‌ వెస్ట్‌లో పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ మారిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కి ఏడాది కాలంగా తన సోదరుడు, దివంగత ప్రణయ్‌ భాస్కర్‌ కొడుకు అభినవ్‌ భాస్కర్‌ పంటి కింద రాయిలా తయారయ్యారట. అభినవ్‌ యూఎస్‌ రిటర్న్‌. వచ్చీరాగానే తనకు రాజకీయ వారసత్వం కావాలంటూ పట్టుపట్టాడు. అప్పటికే వినయ్‌ భాస్కర్‌ సొంత తమ్ముడు విజయ్‌ భాస్కర్‌ కార్పొరేటర్గా ఉన్నారు. అదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన అభినవ్‌ కూడా వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌ టిక్కెట్‌ కోసం పట్టుబట్టారు. దీంతో గత్యంతరం లేక తమ్ముణ్ణి కాదని అన్నకొడుక్కి టిక్కెట్‌ ఇప్పించారట వినయ్‌ భాస్కర్‌. కార్పొరేటర్‌గా గెలిచిన అభినవ్‌ ఈసారి ఏకంగా తనకు ఎమ్మెల్యే టిక్కెట్‌ కావాలని పట్టుపట్టారట. తన తండ్రి రాజకీయ వారసత్వం తనకే చెందాలని, అందుకే వరంగల్‌ పశ్చిమ టికెట్ తనకు కావాలంటూ కుటుంబం మీద తీవ్రమైన వత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది. అయితే సిట్టింగ్‌లకే టిక్కెట్స్‌ అని బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ గొడవ అప్పటికి సద్దుమణిగినా… వినయ్ భాస్కర్‌ మాత్రం మింగలేక కక్కలేక అన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికలను ఫేస్‌ చేయాల్సి వచ్చిందట. తన అన్న కొడుకు ధిక్కార స్వరాన్ని సహించలేకపోయినా… కుటుంబ పరిస్థితుల కారణంగా వినయ్‌ బాస్కర్‌ ఇంతకాలం నెట్టుకొచ్చినట్టు తెలిసింది. ఎక్కడ ఏకు మేకులా మారతాడోనని టెన్షన్‌ పడుతున్న క్రమంలో తాజాగా తాను బీఆర్‌ని వీడుతున్నట్టు ప్రకటించారు అభినవ్‌ భాస్కర్‌.

దీంతో కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు పార్టీ మార్పు ప్రకటనను అస్సలు పట్టించుకోకుండా పోతేపోనీ అన్నట్టుగా ఉన్నారట మాజీ ఎమ్మెల్యే. స్థానికంగా అన్న కొడుకుని బుజ్జగించకుండా విషయాన్ని నేరుగా కేటీఆర్‌ చెవిన వేయడంతో.. ఆయన కూడా అభినవ్‌ చర్యలను అడ్డుకోవద్దని, ఏం జరిగితే అది జరుగుతుందని అన్నట్లుగా సమాచారం. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య రాజీనామా చేయగా తాజాగా అభినవ భాస్కర్ కమల తీర్థానికి రెడీ అయ్యారు. పార్టీ మారడానికి నిర్ణయించుకున్న అభినవ్‌ బాబాయిపై ధిక్కార స్వరం వినిపంచడానికి ఆత్మీయ సమ్మేళనాన్ని వేదికగా చేసుకున్నారు. ఇటీవల హన్మకొండలోని ఒక ఫంక్షన్ హాలులో ప్రణయన్న ఆత్మీయుల సమావేశం పేరిట ఒక కార్యక్రమం నిర్వహించిన అభినవ్‌ భాస్కర్‌.. ఆత్మగౌరవం లేనిచోట వుండలేనని, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు నన్ను పరకాల నుండి పోటీ చేయమని కోరినా, కుటుంబంలో ఐక్యత కోసం పట్టించుకోలేదని, ఇక మీదట ఆత్మగౌరవం లేని చోట వుండే ప్రసక్తే లేదని అన్నారు అభినవ్‌. దీంతో ‘దాస్యం’ కుటుంబంలోని విభేదాలను తెర మీదకు తెస్తూ.. పార్టీని వీడేందుకు కార్పొరేటర్‌ వేస్తున్న ఎత్తులు బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ అయ్యాయి. త్వరలో అభినవ్ భాస్కర్ బీజేపీ గూటికి చేరడం ఖాయమైంది. అయినా ఆయన చర్యలను వినయ్‌ బాస్కర్‌ పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడంలేదు. ఇప్పటికే ఓడిపోయిన తనకు అభినవ్‌ బయటకు వెళ్లడం వల్ల కొత్తగా పోయేదేం లేదంటూ ఈజీగా తీసుకుంటున్నట్టు తెలిసింది. అయితే బాబాయ్‌ బీఆర్‌ఎస్‌లో, అబ్బాయ్‌ బీజేపీలో ఉంటే రాబోయే రోజుల్లో వరంగల్‌ వెస్ట్‌ పాలిటిక్స్‌ రసవత్తరంగా మారుతాయని అంచనా వేస్తున్నారు పరిశీలకులు.