NTV Telugu Site icon

Off The Record: పురంధేశ్వరిని వైసీపీ లైట్ తీసుకుందా..?

Purandeswari

Purandeswari

Off The Record: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి ఛార్జ్ తీసుకున్న తొలి రోజు నుంచే వైసీపీ ప్రభుత్వం మీద డైరెక్ట్‌ అటాక్ మొదలు పెట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని, ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని, కేంద్రం నుంచి నిధులు వస్తున్నా…ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారంటూ…ప్రశ్నాస్త్రాలు సంధించారు.కానీ… ఆమె ఎంత ఏం మాట్లాడినా, ఎంత గట్టిగా అడిగినా, అధికార వైసీపీ నుంచి మాత్రం నామ మాత్రపు స్పందన కూడా లేదు. ముఖ్య నాయకులు ఎవ్వరూ ఇంతవరకు నోరు విప్పలేదు, పురంధేశ్వరికి కౌంటర్‌ ఇవ్వలేదు. అదే సమయంలో ఇంతకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరోపణలు చేసినప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్స్‌ సైతం
నిప్పులు చెరిగారు. ముందు రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇచ్చి.. తర్వాత మాట్లాడండని కౌంటర్ అటాక్ కు దిగారు. నాలుగేళ్లుగా చేయని ఆరోపణలు ఇప్పుడు చేస్తున్నారంటే…ఎన్నికల ఏడాదిలో రాజకీయ ప్రయోజనాల కోసమే కదా అని ప్రశ్నించారు. మిగతా బీజేపీ నేతల పై ఎక్కడా తగ్గని వైసీపీ నేతలు, మంత్రులు పురంధరేశ్వరి విషయంలో మాత్రం ఎందుకు డిఫరెంట్ స్టాండ్ తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది.

పురంధేశ్వరి కొత్తగా పార్టీ బాధ్యతలు తీసుకున్నారు కనుక తన అస్తిత్వం కోసం ఆరోపణలు చేస్తున్నారు తప్ప… మరోటి కాదన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో ఉందట. అందుకే ఆమె చేస్తున్న విమర్శలు, ఆరోపణలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, లైట్ తీసుకోవటమే బెటరన్న అభిప్రాయం వైసీపీలో ఉన్నట్టు తెలిసింది. పురంధేశ్వరి మాటలపై ఎక్కువగా స్పందిస్తే ఆమెకు అనవసర ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందనే చర్చ అధికార పార్టీ నేతల మధ్య జరుగుతోందట. రాష్ట్రంలో అసలు బీజేపీ ఉనికే అంతంత మాత్రమని, అసలు ఆ పార్టీతో పోటీయే లేనప్పుడు పురంధరేశ్వరి చేసే ఆరోపణ ప్రభావం ఏమీ ఉండదని కూడా వైసీపీ నాయకులు అనుకుంటున్నట్టు తెలిసింది. మరోవైపు మహిళా నాయకురాలు కావటం కూడా ఆమె పై వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టడకుండా ఉండటానికి మరో కారణం అయి ఉండవచ్చంటున్నారు. మహిళా నేతల విషయంలో ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలన్న డైరెక్షన్ పార్టీ పెద్దల నుంచి వచ్చినట్లు టాక్. ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకు గౌరవం ఇవ్వాలని…ఆమె శృతిమించి మరీ… తీవ్ర స్థాయిలో ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే అప్పుడు చూసుకోవచ్చన్నది వైసీపీ నేతల ఆలోచన అట. ఆమె ఆరోపణల మోతాదు దాటితే …బీజేపీ నాయకురాలిగా కంటే చంద్రబాబుతో ఉన్న కుటుంబ బంధం ఎక్కువగా ఫోకస్ అవుతుందనేది వైసీపీ వర్గాలు వేసుకుంటున్న మరో లెక్క. సో…మేడమ్‌ని ప్రస్తుతానికి లైట్‌ తీసుకుని… ఏదన్నా ఉంటే తర్వాత చూసుకోవచ్చన్నది వైసీపీ అభిప్రాయంగా చెబుతున్నారు.

Show comments