Off The Record: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే.. స్పీడ్ పెంచుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ …. హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్ళూరుతోంది. ఇటీవల జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలకు నేతలను సమయాత్తం చేశారు సీఎం కేసీఆర్. మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేది మనమే అని కేసీఆర్ లెక్కలతో సహా వివరంగా చెప్పడంతో… పార్టీలో అసెంబ్లీ టికెట్ల కోసం పోటీ పెరిగిందట. ఆశావహులు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు.ఈ పరిణామాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయట. కొత్తగా హడావిడి చేస్తున్న వారిని ఎలా కట్టడి చేయాలో, ఏం చేయాలో అర్ధంగాక తలలు పట్టుకుంటున్నారట కొందరు సిట్టింగ్స్.
చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు రెబెల్స్ బెడద తప్పడం లేదు. సిట్టింగ్‌లకు పోటీగా పలువురు ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఇతర నేతలు ఉన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేలైన చోటికంటే… సీనియర్ సిట్టింగ్‌లు ఉన్న చోటే ఆశావహుల హడావుడి ఎక్కువగా ఉండటంపై పార్టీ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ , వరంగల్ ,ఖమ్మం జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈ పరిస్థితి ఉందట.ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో కొన్ని చోట్ల అయితే టిక్కెట్ ఆశిస్తున్న వారు చేసే హడావిడితో విసుగెత్తిపోయిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఛీ… ఈసారి పోటీ చేసేది లేదు పాడు లేదు అంటున్నారట. ఎన్నికలకు కొద్ది నెలల ముందు పరిస్థితి ఇంత భయంకరంగా మారిపోవడంపై అధిష్టానం వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి రియాక్షన్ లేదు. దీంతో ఇబ్బంది పడుతున్న సిట్టింగ్‌లంతా ఇప్పుడు తెలంగాణ భవన్ వైపు ఆశగా చూస్తున్నారట.
హ్యాట్రిక్ కొట్టి తీరాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్‌ఎస్ అధినాయకత్వం… ఈ అసంతృప్తులు, హడావిడి వ్యవహారాలను ఆదిలోనే అడ్డుకోకుంటే… మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న మాటలు పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇక గట్టిగా ఆరు నెలలే ఉన్నందున ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలన్నది పార్టీ వర్గాల్లో ఉన్న అభిప్రాయం.
