NTV Telugu Site icon

Off The Record: తిరుపతి జనసేనలో వర్గ విభేదాలు.. నామినేటెడ్‌ చిచ్చు మొదలైందా..?

Tpt Janasena

Tpt Janasena

Off The Record: ఎన్నికలకు ముందు తిరుపతి రాజకీయాలు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో రకరకాల మలుపులు తిరిగినా.. ఫైనల్‌గా అభ్యర్థి ఫిక్స్‌ అయ్యాక కూటమి పార్టీలన్నీకలిసి పనిచేశాయి. ఊహించని విధంగా భారీ మెజార్టీతో గెలిచారు జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. కానీ… తీరా గెలిచాక ప్రత్యేకించి జనసేన నేతల మధ్యే ఆ స్ఫూర్తి లోపించిందన్న టాక్‌ మొదలైంది నియోజకవర్గంలో. ఎవరికి వారుగా వ్యవహరిస్తుండటంతో పార్టీ కేడర్‌లోనే గందరగోళం పెరుగుతోందని అంటున్నారు. నామినేటెడ్ పదవుల వ్యవహారమే అందుకు కారణం అన్న మాట గట్టిగా వినపడుతోంది. ఆ పోస్ట్‌ల కోసం ఎవరికి వారు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు నాయకులు. అయినాసరే… ఆ విషయాన్ని గమనించకుండా, సంప్రదింపులు లేకుండా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనదైన ధోరణిలో వెళ్తున్నారన్న అసంతృప్తి జనసేన వర్గాల్లోనే పెరుగుతున్నట్టు చర్చ జరుగుతోంది. అలాగే వివిధ కార్యక్రమాలకు ఎవ్వర్నీ ఆహ్వానించడం లేదట. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధి దగ్గరకు సాధారణంగా బదిలీల కోసం వస్తుంటారు నియోజకవర్గ పరిధిలోని ఉద్యోగులు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగికి ఎమ్మెల్యే ట్రాన్స్‌ఫర్‌ ఛాన్స్‌ ఇవ్వలేదన్న అసంతృప్తి ఆ వర్గంలో కూడా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అన్నింటికీ మించి ఏళ్ళ తరబడి పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి ఎన్నికల్లో గెలిచాక తన పంచన చేరుతున్న వైసీపీ నాయకులకే ప్రాధాన్యం ఇవ్వడం, వారికి పదవుల కోసం సిఫార్సులు చేయడాన్ని జనసేన స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్న టాక్‌ నడుస్తోంది లోకల్‌గా.

Read Also: IAS Vivek Yadav: ఏపీ సీఈవోగా సీనియర్ ఐఏఎస్‌ వివేక్ యాదవ్..

రుయాలో ఓ పోస్టు కోసం ఏకంగా వైసీపీ నాయకుడికే సిఫారసు చేశారన్న విషయం తెలుసుకుని ఓ రేంజ్‌లో మండిపడుతున్నారట తిరుపతి టీడీపీ, జనసేన లీడర్స్‌. ఐదేళ్ళుగా అనేక ఉద్యమాలు చేస్తూ … కేసులు పెట్టించుకుని నానా ఇబ్బందులు పడిన తమను కాదని ఎమ్మెల్యే… నామినేటెడ్‌ పోస్ట్‌ల విషయంలో కొత్త దారులు వెదుక్కోవడం ఏంటని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అలాగే ఎమ్మెల్యే ఆధిపత్య పోరుకు తెరలేపుతున్నారన్నది మరో విమర్శ. పార్టీ పెట్టినప్పటి నుంచి తిరుపతి జనసేన అంటే… హరిప్రసాద్, కిరణ్ రాయల్‌, రాజా రెడ్డి లాంటి నేతలే కనిపించే వారు. ఇప్పుడు బయటి నుంచి వచ్చిన ఆరణి స్థానికంగా తమ ప్రాబల్యం తగ్గించాలని చూస్తున్నట్టు అనుమానిస్తున్నారట సదరు లీడర్స్‌. దీంతో మాకు ఎమ్మెల్యేతో పనిలేదు, పార్టీనే ముఖ్యం అంటూ తమదైన శైలిలో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. తుడా చైర్మన్ , లేదా టీటీడీ పాలక మండలి సభ్యుడి పదవి ఆశిస్తున్న తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ అయితే ఒక అడుగు ముందుకేసి, తిరుమల కొండపై మఠాల వ్యవహారం, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా అక్రమాలపై దర్యాప్తు జరిపించాలంటూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

Read Also: Mudasarlova Park Issue: డిప్యూటీ సీఎం పవన్‌ దగ్గరకు ముడసర్లోవ పార్క్ పంచాయితీ..

కానీ.. అందులో ఎక్కడా ఎమ్మెల్యే ఆరణి ప్రస్తావన లేదు. అలాగే పసుపులేటి హరిప్రసాద్ వర్గం నేరుగా ఆందోళనలు నిర్వహించకున్నా… పార్టీ పెద్దల దగ్గరున్న పరపతితో పోస్ట్‌ల కోసం పైరవీలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎమ్మెల్యే ఆరణి ఓపెన్‌గా ఫైర్ అవ్వడం మరింత కాక రేపుతోంది. అలాగే తాజా కృత‌జ్ఞతా స‌భ‌లో ఎమ్మెల్యే, కిరణ్‌ రాయల్‌ మధ్య మాట మాట పెరగడాన్ని బట్టి చూస్తే… పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. దీనిపై పార్టీ పెద్దలు కూడా ఆరా తీసినట్లు సమాచారం. ఇలా పదవులు,గుర్తింపు కోసం పాత జనసేన నేతలు ఆరాట పడుతుంటే… ఎమ్మెల్యే మాత్రం కూల్..కూల్‌.. నాకంతా తెలుసు, అందరికీ న్యాయం చేస్తానని అంటున్నారట. అలా అంటూనే… వైసీపీ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నది కూటమి నేతల ఆరోపణ. ప్రాధమిక దశలోనే దీనికి చెక్‌ పెట్టకుంటే… ముందు ముందు ముదిరి మరీ ఇబ్బందికరంగా తయారవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది తిరుపతి జనసేన వర్గాల్లో.