NTV Telugu Site icon

Off The Record: సిట్టింగ్‌ ఎమ్మెల్యేని టార్గెట్‌ చేసిన సొంత పార్టీ నేతలు..!

Ravi Shankar

Ravi Shankar

Off The Record: చొప్పదండి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది… పేరుకు ఎస్సీ రిజర్వుడ్ కానీ రాజకీయాలు మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయి… ఇక్కడ బలమైన రెండు సామాజిక వర్గాలదే హవా… గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బొడిగె శోభ వైఖరికి వ్యతిరేకంగా మండల స్థాయి నేతలు ఒక్కటయ్యారు. దీంతో ఆమెకు సీటు రాకుండా పోయింది. అదే గ్రూప్‌ నేతలు… స్థానికుడంటూ సుంకె రవిశంకర్‌ను ప్రోత్సహించి టికెట్ వచ్చేలా చేశారు… గెలిచేంత వరకు బాగానే ఉంది… తర్వాత ఏడాదిన్నరలోనే సీన్‌ మారిపోయింది… ఎమ్మెల్యే రహస్య రాజకీయాలు చేస్తున్నారని ఆయనకు మద్దతు ఇచ్చిన నేతలు అనుమానించడం మొదలుపెట్టారట. ఎమ్మెల్యే వర్గం తమలో గొడవలు పెడుతోందని, అప్పటికే ఉన్న సీనియర్లను కాదని వేరొకర్ని ప్రోత్సహిస్తోందని, మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారిని కాదని.. ఇతరులకు పార్టీ పదవులు.. నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారట. దాంతో గత మున్సిపల్‌ కో ఆప్షన్‌ ఎన్నికల్లోనే ఎమ్మెల్యే ప్రకటించిన అభ్యర్థులకు పోటీగా మరో ప్యానెల్‌ను నిలబెట్టి సత్తాచాటారు పార్టీ నేతలు. తర్వాతి నుంచి ఎమ్మెల్యేపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన స్థానిక ప్రతినిధులు సహాయ నిరాకరణ ప్రారంభించినట్టు తెలిసింది. పనిలో పనిగా ఎమ్మెల్యే వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదులు చేశారట… తన నియోజకవర్గంలో బలంగా ఉన్న నాయకులకు నామినేటెడ్ పోస్టులు కూడా రాకుండా చేశారని రవిశంకర్‌పై సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశారట సదరు నేతలు…

ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్…. నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలోనూ అసమ్మతి సెగ స్పష్టంగా కనిపించిదట. అందుకే మండలాల్లో జరగాల్సిన ఆత్మీయ సమ్మేళనాలు రద్దయ్యాయి. తీరు మార్చుకోవాలని, అందరిని కలుపుకుని పోవాలంటూ ఎమ్మెల్యేకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట రాష్ట్ర పార్టీ నేతలు…. కొడిమ్యాల, బోయినపల్లి, రామడుగు, గంగాధర మండలాల్లోని బలమైన వెలమ నేతలకు, ఎమ్మెల్యేకు పొసగడం లేదట… చొప్పదండిలోనూ రెడ్డి సామాజికవర్గం నాయకులు రవిశంకర్‌కు సహకరించేది లేదని పార్టీ పెద్దలకు తేల్చి చెప్పారట. పరిస్థితి చేయిదాటి పోతోందని గ్రహించిన ఎమ్మెల్యే…వీరందరిని ప్రసన్నం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదంటున్నారు. పైగా ఎమ్మెల్యేపై అసమ్మతి రాగం వినిపిస్తున్న నేతలు ఓ అడుగు ముందుకేసి ఆయన కమీషన్ల దందా చేస్తున్నారని బహిరంగంగానే అంటున్నట్టు తెలిసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవిశంకర్‌ పై విడుదల చేసిన చార్జీషీట్ కంటే హాట్ హాట్ విమర్శలు చేస్తున్నారట అసమ్మతి నేతలు… కుల సంఘాల భవనాల కేటాయింపులో ముడుపులు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలే ట్రోలింగ్‌ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారాలు ఇలా ఉంటే… టికెట్ ఆశిస్తున్న ఆశావహులు చేస్తున్న కార్యక్రమాలు ఎమ్మెల్యేకు గోరు చుట్టు మీద రోకటిపోటులా మారాయట… ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆశీస్సులున్నాయని ప్రచారం చేసుకుంటున్న కంసాల శ్రీనివాస్ టికెట్ కోసం సీరియస్‌ గానే ప్రయత్నిస్తున్నారట… మరోవైపు ఓ ఎంపీ ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకుంటున్న బోయినపల్లి జడ్పీటీసి ఉమా కొండయ్య, మరో నాయకుడు, జేఏసీ నేత గజ్జెల కాంతం చొప్పదండి టికెట్ నాదే అంటున్నారట… లోకల్ లీడర్ల మద్దతుతో బండ యాదగిరి తన కార్యక్రమాల స్పీడ్ పెంచారట… ద్వితీయ శ్రేణి నేతలు సహకరించకపోవడంతో క్యాడర్‌తో కలిసే అవకాశాలు ఎమ్మెల్యేకు రావడం లేదట. ఆత్మీయ సమ్మేళనాలకు తేదీలు ప్రకటించి వాయిదా వేయడంతో క్యాడర్‌లో కూడా గందర గోళం నెలకొందట.

ఇదంతా చూస్తున్నవారు చొప్పదండి పరిణామాలు 2018 ఎన్నికల ముందు జరిగిన తరహాలోనే ఉన్నాయంటున్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ అధిష్టానం పెద్దలకు అత్యంత విధేయతగా ఉన్నానని చెబుతున్నా..టికెట్ రావడానికి అది మాత్రమే సరిపోదని, స్థానిక పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. గత ఎన్నికల కంటే ముందు జరిగినట్టుగా ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలు పైచేయి సాధిస్తారా? ఉన్న అతి కొద్ది సమయంలో అందరినీ ఎమ్మెల్యే సమన్వయం చేసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది…. పార్టీలో అసమ్మతి, బలమైన ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటారు అనేది ప్రస్తుతం చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ముందున్న సవాల్…

Show comments