NTV Telugu Site icon

Off The Record: కేంద్రం, తెలంగాణ మధ్య బడ్జెట్ ప్రకంపనలు రేగుతున్నాయా..? |

Tg

Tg

Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక… కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై స్పష్టతనిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమేనని, ఆ తర్వాత రెండిటి మధ్య ప్రభుత్వ సంబంధాలే కొనసాగుతాయని క్లారిటీగా చెప్పేశారాయన. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందన్న అంశంకంటే… స్నేహపూర్వకంగా ఉంటూ… రాష్ట్రానికి ఎంత మేలు చేయగలుగుతాము, ఎన్ని నిధుల్ని తీసుకురాగలుగుతామన్నదే ముఖ్యం అని చెప్పారు సీఎం. అందులో భాగంగానే 18సార్లు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని కలిసి వినతి పత్రాలను ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలు, ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లాంటి అంశాలను కేంద్రం వద్ద ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ క్రమంలో స్నేహపూర్వకంగానే పనులు పూర్తి చేయాలని భావించింది రేవంత్ సర్కార్.

Read Also: CPM: సీఎం చంద్రబాబును కలిసి సీపీఎం నేతలు.. వీటి సంగతి చూడండి..!

కానీ… ప్రస్తుతం వాతావరణం అందుకు అనుకూలంగా లేదన్న టాక్‌ నడుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకి మొండిచేయి చూపడంతో ఆ వైఖరిని నిరసిస్తూ.. తీర్మానం చేసింది తెలంగాణ అసెంబ్లీ. దీంతో ఇన్నాళ్లు ఉన్న సామరస్యం ఇక మీదట కూడా ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి రాజకీయ వర్గాల్లో. బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడానికి నిరసనగా.. నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది గతంలో అనుసరించిన వ్యూహానికి పూర్తిగా భిన్నమైనది. దీంతో నిధులు, కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో సీఎం వైఖరి మారిపోయినట్టేనా? రెండు ప్రభుత్వాల మధ్య గ్యాప్‌ వచ్చిందా అన్న చర్చ జరుగుతోంది. సానుకూలంగా చేయాల్సినంత వరకు ప్రయత్నం చేశాం. కుదరనప్పుడు ఇక తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించినట్టేనా అనే చర్చ తెర మీదకు వచ్చింది.

Read Also: CPM: సీఎం చంద్రబాబును కలిసి సీపీఎం నేతలు.. వీటి సంగతి చూడండి..!

అదే సమయంలో మరో మాటా వినిపిస్తోంది. అసెంబ్లీ తీర్మానం తెలంగాణకు జరిగిన అన్యాయంపై నిరసన తెలపడమేనని, దాన్ని అలా కొనసాగిస్తూనే…మళ్ళీ నిధుల కోసం ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగితే తప్పేముందన్న వాదన సైతం ముందుకు వస్తోంది. ఓవైపు హక్కుల కోసం కొట్లాడటం, మరోవైపు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగించడమన్న ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తే తప్పేముందని అడిగే వాళ్ళు సైతం ఉన్నారు. ముందు ముందు రేవంత్‌ సర్కార్‌ వీటిలోఏ వ్యూహాన్ని ఫాలో అవుతుందో చూడాలి మరి.