NTV Telugu Site icon

Off The Record: మలుగులో సీతక్కకు బీఆర్ఎస్‌ చెక్‌..? అభ్యర్థి ఎంపిక వెనక ప్రత్యేక వ్యూహం ఉందా?

Mulugu

Mulugu

Off The Record: తమకు కొరకరాని కొయ్యగా మారిన ములుగు అసెంబ్లీ నియోజకవర్గంపై ఈసారి స్పెషల్‌గా ఫోకస్‌ పెట్టింది బీఆర్‌ఎస్‌. కాంగ్రెస్‌ పార్టీ తరపున ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్కే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఈసారి కూడా కాంగ్రెస్‌ తరపున ఆమె అభ్యర్థిత్వమే ఖాయమనుకుంటున్న టైంలో పోటీకి అంతే దీటైన ఆదివాసీ నాయకురాలిని బరిలో దింపింది. వ్యూహాత్మకంగానే… ములుగు బీఆర్ఎస్ అభ్యర్థిగా బడే నాగజ్యోతిని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. రాజకీయ అనుభవం పెద్దగా లేని నాయకురాలి ఎంపిక వెనక భారీ కసరత్తే జరిగిందంటున్నారు. ఆదివాసీలకు అవసరం ఉన్న ప్రతి సందర్భంలోనూ.. నేనున్నానని ముందుకు వస్తూ.. నియోజకవర్గంలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు అనసూయ అలియాస్‌ సీతక్క.

కోయ సామాజిక వర్గానికి చెందిన, మాజీ మావోయిస్ట్‌ అయిన సీతక్కకు కోయలతో పాటు మావోయిస్టు భావజాలం ఉన్న ఓ వర్గం అండగా ఉంటోంది. ఇక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజాదరణ పొందారు. గతంలో ఆమెను బీఆర్‌ఎస్‌లోకి తీసుకోవాడానికి ప్రయత్నించి విఫలమైనట్టు ప్రచారం కూడా ఉంది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఆమెకు చెక్‌ పెట్టాలంటే… అదే సామాజిక వర్గానికి చెందిన, అలాంటి మావోయిస్ట్‌ బ్యాక్‌గ్రౌండే ఉన్న నాగజ్యోతి కరెక్ట్‌ అనుకుని ఆమెను బరిలో దింపినట్టు తెలిసింది. కోయ సామాజిక వర్గానికే చెందిన నాగజ్యోతి తల్లిదండ్రులు రాజేశ్వరి, నాగేశ్వరరావు ఇద్దరూ గతంలో మావోయిస్ట్‌ పార్టీ తరపున అజ్ఞాతంలో పని చేశారు. ఆమె బాబాయి దామోదర్ ఇప్పటికీ మావోయిస్టు కీలక నేతగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఓట్లు చీల్చి సీతక్కకు చెక్‌ పెట్టి ములుగులో పాగా వేయాలంటే నాగజ్యోతే కరెక్ట్‌ అని ఆమెను రంగంలోకి దింపిందట బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం. సీతక్కను ఎదుర్కొనేందుకు చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది బీఆర్‌ఎస్‌. నియోజకవర్గం అభివృద్ధితో పాటు జిల్లా ఏర్పాటు, వరదల సమయంలో స్వయంగా సీఎం పర్యటించడం లాంటి చర్యలతో పొలిటికల్‌ గాలిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

ఏటూరునాగారం లాంటి మారు మూల ప్రాంతాన్ని సైతం సందర్శించారు సీఎం. 2018 ఎన్నికల్లో ములుగు ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చినా.., సీఎం కేసీఆర్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం జిల్లా ఏర్పాటు చేశారు. ఇదే ఎజెండాగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా…ఇక్కడ బీఆర్ఎస్‌ జెండా ఎగురవేయాలని అధిష్టానం ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే మొదటగా నాగజ్యోతికి తాడ్వాయి జడ్పీటీసీగా అవకాశం ఇచ్చారు. తర్వాత ములుగు జిల్లా మొట్టమొదటి వైస్ చైర్ పర్సన్‌గా ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది అధికార పార్టీ.ఒక ఆదివాసి నాయకురాలిని ఎదుర్కోవడానికి అదే బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న మరో నాయకురాలిని రంగంలోకి దించిన బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్న ఆసక్తి పెరుగుతోంది.మరో వైపు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి చందూలాల్ కొడుకు బీజేపీలో చేరి బరిలో నిలవడంతో… ఆయన వల్ల ఎవరికి నష్టమన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి.