Site icon NTV Telugu

Off The Record: ఫస్ట్‌ లిస్ట్‌లో ఉండేదెవరు? ఊడేదెవరు?

Brs

Brs

Off The Record: హ్యాట్రిక్‌ మూడ్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ గెలుపు గుర్రాల వేటలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కూడికలు, తీసివేతలు, గుణింతాల లెక్కలన్నిటినీ పక్కాగా చూసుకుని ఫస్ట్‌ లిస్ట్‌ రెడీ చేసినట్టు తెలిసింది. వరుసగా రెండు విడతలు అధికారంలో ఉన్నందున సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు అభ్యర్థుల బలాలు, బలహీనతలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని తయారు చేసిన జాబితాను ఈనెల 21న విడుదల చేయబోతున్నారట. ఓ వైపు మెజార్టీ సీట్లు సిట్టింగ్‌లకే అంటున్నా.. చాలాచోట్ల సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే తిరగబడుతున్నారు. వాళ్లకు బదులు మాకే సీటివ్వమని రకరకాల మార్గాల్లో లాబీయింగ్‌ చేస్తున్న వారు కొందరైతే… అసలు వాళ్లకు ఈసారి టిక్కెట్‌ ఇస్తే… మేం సపోర్ట్‌ చేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నవాళ్ళు మరికొందరు. మేం ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసి అభ్యర్థిని ఓడిస్తామని వార్నింగ్‌లు ఇస్తున్నవారు సైతం ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఫస్ట్‌ లిస్ట్‌లో ఎవరెవరి పేర్లు ఉంటాయి? ఎవరి సీట్లు ఊడతాయన్న చర్చ జోరుగా జరుగుతూ… పార్టీలో హీట్‌ పెంచుతోంది.

మంచిరోజులు, ముహూర్తాల పట్టింపు గట్టిగా ఉన్న కేసీఆర్‌.. శ్రావణమాసపు తొలినాళ్ళలోనే 80 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారన్న వార్తలు ఆశావహుల పల్స్ రేట్‌ పెంచుతున్నాయి. అందునా.. ఈనెల 21 అంటే పెద్దగా టైం లేదు కాబట్టి లిస్ట్ కోసం బీఆర్‌ఎస్ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఏదో ఒక రూపంలో సిట్టింగ్‌కు పొగబెట్టే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో అయితే ముఖ్య నాయకులు, వాళ్ళ అనుచరులకు నరాలు తెగుతున్నాయట. అసమ్మతి, ఆసంతృప్తి ఉన్న నియోజకవర్గాల గొడవల్ని పట్టించుకోకుండా తొలి జాబితాలోనే పేర్లు ప్రకటిస్తారా? లేక ప్రస్తుతానికి వాటిని పక్కనపెట్టి గొడవల్లేని వాటిని క్లియర్‌ చేశాక వివాదాస్పద నియోజకవర్గాల జోలికి వెళతారా అన్న చర్చ సైతం జరుగుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఇప్పుడు పార్టీలో అసంతృప్తగళాలు వినిపిస్తున్నాయి. పార్టీ పెట్టాక ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని బీఆర్‌ఎస్ వర్గాలే అంటున్నాయి. దీంతో అధినాయకత్వం కఠినంగా వ్యవహరించి అసంతృప్తిని అణిచివేస్తుందా లేక ప్రస్తుతం ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో కొస్త సంయమనం పాటిస్తుందా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.

2018 అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా శ్రావణ మాసంలోనే 105 మందితో తొలి జాబితా ప్రకటించారు కేసీఆర్‌. తర్వాత మిగతా నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించారు. అప్పుడు ఐదుగురు సిట్టింగ్‌లకు టిక్కెట్‌ నిరాకరించగా…మరో ఇద్దర్ని అనారోగ్య కారణాలతో పక్కనబెట్టింది పార్టీ. ఈసారి మొదటి జాబితా ప్రకటనకు ముహూర్తం ఖరారు కావడం, ఫస్ట్‌ లిస్ట్‌ 80 పేర్లే ఉంటాయన్న ప్రచారంతో… ప్లస్‌లు, మైనస్‌ల లెక్కలు వేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు.

Exit mobile version