NTV Telugu Site icon

Off The Record : బీజేపీకి సన్నిహితంగా కరీంనగర్ మేయర్..?

Otr Brs

Otr Brs

కంచుకోటలో కార్‌ పార్టీకి కేరాఫ్‌ మాయమైపోతోందా? చివరికి మేయర్‌ సీటు కూడా కారుజారిపోయే ముప్పు ముంచుకు వస్తోందా? మేయర్‌ కదలికలు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయా? ఇంతకీ ఏ మేయర్‌ సీటు గులాబీ దళానికి దూరమయ్యే ముప్పు ముంచుకు వస్తోంది? ఏ పార్టీ వైపు చూస్తున్నారా మేయర్‌? అంత జరుగుతున్నా…. బీఆర్‌ఎస్‌ నేతలు చేష్టలుడిగి చూస్తున్నారు ఎందుకు? కార్‌ పార్టీకి కంచుకోట కరీంనగర్‌. అనేక సంక్షోభ సమయాల్లో గులాబీ దళానికి అండగా ఉన్న జిల్లా ఇది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలో ఐదు సీట్లు దక్కాయి. కానీ… మారిన రాజకీయ సమీకరణాలతో… ఉత్తర తెలంగాణలో తొలి ఆకర్ష్‌ను ఇక్కడ నుంచే ప్రారంభించింది కాంగ్రెస్. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భాను ప్రసాద్ కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఇప్పుడిక కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వంతు వచ్చినట్టుందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక్కడ జరుగుతున్న తాజా పరిణామాలు గులాబీ దళానికి షాక్‌ ఇవ్వవచ్చన్న మాట వినిపిస్తోంది. కొంత కాలంగా కమలం పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారట నగర మేయర్ సునీల్ రావు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మేయర్ వ్యవహరిస్తున్న తీరు పొలిటికల్‌ హాట్ టాపిక్ అయింది. సంజయ్ మంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు మేయర్. అంతటితో ఆగకుండా సంజయ్ కేంద్ర మంత్రి అయి తొలిసారి కరీంనగర్‌ వచ్చాక వెళ్లి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లోనే దీనిపై పార్టీలో కొంత చర్చ జరగ్గా కరీంనగర్ బిడ్డ కేంద్ర మంత్రి అయితే విష్ చేయడం తప్పా అంటూ సమర్ధించుకున్నారట మేయర్‌. ఆ తర్వాత సంజయ్ జన్మదినం సందర్భంగా కూడా ఓ పోస్ట్ పెట్టారాయన. గతంలో విష్‌ చేసినప్పుడు కేసీఆర్, కేటీఆర్‌లు పెట్టిన సునీల్‌రావు ఈసారి మాత్రం వాళ్ళ ఫోటోలు లేకుండా జాగ్రత్త పడటమే ఇప్పుడు పొలిటికల్‌ డౌట్స్‌ పెంచుతోంది. తాజాగా ఆదివారం బీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో కలిసి ఓ హోటల్‌లో బండికి సన్మానం చేశారు మేయర్… దీంతో సునీల్ రావు కమలం కండువా కప్పుకుంటారనే వార్తలు ఊపందుకున్నాయి. పేరుకు స్మార్ట్ సిటీ నిధుల కోసం సన్మానం అని చెబుతున్నప్పటికీ ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ కార్పొరేటర్స్‌ అందరూ హాజరవకపోవడం అనుమానాలకు లాన్నిస్తోందంటున్నారు పరిశీలకులు.

బండి సంజయ్‌తో మేయర్ నిర్వహించిన కార్యక్రమానికి, పార్టీకి సంబంధం లేదని అంటున్నారట బీఆర్ఎస్ నేతలు. అందుకే ఈ సమావేశానికి డిప్యూటీ మేయర్ హాజరవలేదని అంటున్నారు. సునీల్ పార్టీ మారుతున్నారనే ప్రచారంతో మాజీ మంత్రి గంగులకు సన్నిహితులుగా ఉన్న కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్, నగర పార్టీ అధ్యక్షుడు ఆయనతో డిస్టెన్స్ మేయింటెన్ చేస్తున్నారట. ఇక్కడ ఇంకో క్వశ్చన్‌ కూడా వస్తోందని అంటున్నారు. మేయర్‌ చెబుతున్నట్టు నిజంగా అభివృద్ధి కోసమే అయితే….మేయర్‌ రాష్ట్ర మంత్రి పొన్నంను ఎందుకు కలవలేదన్నది బిగ్‌ డౌట్‌. ఏదో జంపింగ్‌ థాట్‌తోనే సునీల్‌రావు కేంద్ర మంత్రికి దగ్గరవుతున్నారన్న అనుమానాలు అంతకంతకూ పెరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో. కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్‌ అరంగ్రేట్రం చేసిన సునీల్‌రావు… రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత అటువైపు వెళ్లాలని తొలుత అనుకున్నారట. అదే టైంలో మేయర్‌తో సంబంధం లేకుండానే పది మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు… మరింత మంది వెళ్లే అవకాశాలున్నాయని, మేయర్‌పై అవిశ్వాసం పెడతారనే చర్చ అప్పట్లో జోరుగా సాగింది… అందుకే తాను అటు వెళ్లాలని అనుకున్నా… మంత్రి పొన్నంతో పొసగక అక్కడ డోర్స్‌ క్లోజ్ అయినట్టు సమాచారం. మరోవైపు ఇప్పటికే కార్పొరేషన్‌లో బీజేపీకి గట్టి బలమే ఉంది. ఆపార్టీ కార్పొరేటర్స్‌కు తన వెంట ఉన్నవారు తోడయితే సేఫ్‌ జోన్‌లో ఉంటానని భావించి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నది ఓ అంచనా. కమలం పార్టీతో చర్చలు సాగుతున్నప్పటికీ కరీంనగర్‌లో బండి సంజయ్ నిర్ణయమే ఫైనల్ కాబట్టే ఆయన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారనే చర్చ నడుస్తోంది. అలాగే మేయర్ చూపు బీజేపీ వైపు ఉండటం వెనక పెద్ద ప్లానే ఉందంటున్నారు. నియోజకవర్గాల డీలిమిటేషన్‌లో కరీంనగర్ చుట్టు పక్కల కచ్చితంగా మరో నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఆ కొత్త సెగ్మెంట్‌ నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు ఇప్పటి నుంచే సునీల్‌రావు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారన్న మరో వాదనా ఉంది. ఆయన ప్లాన్స్‌ ఎలా ఉన్నా… ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారట లోకల్‌ బీజేపీ నేతలు. నగరంలో బీజేపీ స్ట్రాంగ్‌ గా ఉన్నందున కేడర్‌ కొత్త నాయకుడిని ఎలా రిసీవ్‌ చేసుకుంటారన్న అనుమానాలు సైతం ఉన్నాయట. అటు ఇలాంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ నేతలు సైలెంట్‌గా ఉండటం ఆసక్తికరంగా మారిందట… కార్పొరేటర్లు, నేతలు… ఆఖరికి మేయర్ కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నప్పటికీ నష్టనివారణ చర్యలు చేపట్టక పోవడంతో క్యాడర్ నారాజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా కరీంనగర్‌ మేయర్‌ గోడ దూకుడు దాదాపు ఖాయమైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.