Off The Record: ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఖరారైపోయింది. వాస్తవానికి ఇది కొత్త విషయమేం కాదు. చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. రెండు పార్టీల నుంచి పాజిటివ్ సంకేతాలు వస్తూనే ఉన్నాయి. మాకేం భయం లేదని ప్రత్యర్ధి వైసీపీ చెబుతున్నా.. టీడీపీ-జనసేన కలిస్తే… ఫైట్ టైట్ అవుతుందన్నది మాత్రం అధికార పార్టీ నేతల ఇన్నర్ ఫీలింగ్. అందుకే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో కూడా వైసీపీ దగ్గర ప్రణాళిక ఉన్నట్టు తెలిసింది. ఇక ఇప్పుడు బీజేపీదే బిగ్ క్వశ్చన్. జనసేన …. టీడీపీ లైన్‌లో ఉందన్న విషయం ఏపీ బీజేపీ నేతలకు కూడా తెలియనిదేం కాదు. కాకుంటే… ఇటీవల జరిగిన పరిణామాలతో తమకు దూరం కాలేదన్న గట్టి ఫీలింగ్‌లో ఉన్నారు కమలనాథులు. ఈ మధ్య కాలంలోనే బీజేపీ-జనసేన నేతలు కలిసి రోడ్డెక్కి ఉద్యమాలు చేశారు. దీంతో టీడీపీని కూడా కలుపుకుని వెళ్లాలనే రీతిలో… పవన్ బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని,.. ఇదే సమయంలో తమను వదిలేసి టీడీపీతో మాత్రమే వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చాలా మంది ఏపీ బీజేపీ నేతలు భావించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. జనసేన- టీడీపీ పొత్తు ప్రకటించేశాక భవిష్యత్ కార్యాచరణ ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. వాస్తవానికి చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో.. ఆ పరిణామాల నుంచి బీజేపీ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
అరెస్ట్, అనంతర పరిణామాలను బట్టి చూస్తే.. ఆయన రెండు నెలల పాటు బయటకు రావడం కష్టమని బీజేపీ వర్గాల్లో చర్చ జరిగిందట. పార్టీ అధ్యక్షుడు అన్ని రోజులు జైల్లో ఉంటే… టీడీపీ లీడర్స్, కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, ఆ పరిస్థితిని అనుకూలంగా మలుచుకుని కొందరు పేరున్న టీడీపీ నేతల్ని తమవైపునకు లాక్కునేలా కమలం నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. దీనికి ఎన్టీఆర్ కుమార్తెగా పురంధేశ్వరి ఫ్లేవర్ కూడా కలిసి వస్తుందని లెక్కలు వేసుకున్నారట ఏపీ బీజేపీ నేతలు. ఈ లెక్కలన్నీ వేసుకునే… చంద్రబాబు అరెస్ట్ విషయంలో కాషాయ పార్టీ సైలెంట్‌గా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎలాగూ.. జనసేన తమతోనే ఉంది కాబట్టి.. టీడీపీ గట్టి లీడర్స్‌ని కూడా లాక్కుంటే బలోపేతం అవుతామని, అప్పుడు వైసీపీకి తమ కూటమే గట్టి ప్రత్యర్థి అవుతుందన్నది బీజేపీ కేలిక్యులేషన్‌గా చెబుతున్నారు. ఈ విధంగా ఏపీలో డిపాజిట్స్ కూడా దక్కని, నోటాకంటే తక్కువ ఓట్లు వచ్చిన తమ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా బీజేపీ జాతీయ నాయకత్వం కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలిసింది. కానీ…వాళ్ళ అంచనాలకు భిన్నంగా పవన్‌కళ్యాణ్ వ్యవహరించిన తీరుతో షాకయ్యారట బీజేపీ లీడర్స్. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలవడం, పొత్తు ప్రకటన చేయడం, బీజేపీ కూడా కలిసి రావాలని కోరుకోవడం ద్వారా… బాల్ ను బీజేపీ కోర్టులోకే నెట్టేశారు పవన్.
దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలోకి వెళ్లిపోయారట కాషాయ నేతలు. ఇటు జనసేన కానీ… అటు టీడీపీ సపోర్ట్‌కానీ లేకుండా బీజేపీ ఏపీలో నిలదొక్కుకునే పరిస్థితే లేదు. దీంతో ఇప్పుడు పొత్తులోకి వెళ్ళాలా? వద్దా? అన్న మీమాంస మొదలైనట్టు తెలిసింది. గత ఎన్నికల్లో నోటాకంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ పరిస్థితి ఈసారి కూడా అంతకంటే గొప్పగా ఏం లేదన్నది రాజకీయ పరిశీలకుల మాట. కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి.. ఎన్నికల సమయానికి తమకు ఎలక్షనీరింగ్ కోసం ఉపయోగపడుతుందేమోననే ఆలోచన టీడీపీకి ఉండబట్టే ఆ పార్టీతో పొత్తుపై చర్చ జరుగుతోంది. అదే లేకుంటే… ఏపీ వరకు కాంగ్రెస్ కంటే ఘోరమైన స్థితిలో ఉంటుందంటున్నారు.
మేటర్ మొత్తం తిరగబడేసరికి అనుకున్నదొక్కటి… అయినది ఒక్కటి అనుకుంటూ ఎటూ పాలుపోని స్థితిలో ఉందట ఏపీ బీజేపీ. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఢిల్లీ బీజేపీ పెద్దల ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి సొంతంగా పోటీ చేయడం.. రెండు టీడీపీ-జనసేన కూటమితో కలిసి వెళ్లడం.. లేదా వైసీపీతో కలవడం. వీటిల్లో మూడో ఆప్షన్ ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అవసరమైతే అధికార పార్టీకి లోపాయికారీగా సహకారం అందించడం కుదురుతుందేమో కానీ.. నేరుగా ఆ పార్టీతో పొత్తు ఉండదని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. ఇక మొదటి రెండిటిలోనే ఏదో ఒకటి ఎంచుకోక తప్పదంటున్నారు. ఈ పరిస్థితుల్లో…. వ్యవహారం చేయి దాటక ముందే… సరైన నిర్ణయం తీసుకోవాలని ఏపీ కమలనాధులు ఢిల్లీ పెద్దలు కోరుతున్నట్టు సమాచారం. అట్నుంచి ఏం ఆలోచిస్తున్నారో ఇక్కడ ఎవ్వరికీ అంతు చిక్కడం లేదట. తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్టును తప్పుపడుతున్నారు.. అదే సమయంలో ఏపీ లీడర్స్ మాత్రం సైలెంటుగా ఉంటున్నారు. ఒకే ఇష్యూలో ఒకే పార్టీకి చెందిన రెండు రాష్ట్రాల నాయకులు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పుడు హైకమాండ్ నిర్ణయం ఏంటన్నది ఆసక్తిగా మారింది.