NTV Telugu Site icon

Off The Record: బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎందుకు ఎన్నుకోలేదు? అసలు రాజకీయ రచ్చ ఏంటి?

Bjp

Bjp

Off The Record: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. బీజేపీ కూడా రెడీ అవుతున్నా… ఇంతవరకు శాసనసభాపక్ష నేతను ఎన్నుకోలేక పోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. తెలంగాణ బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఇద్దరు మినహా మిగతా ఆరుగురు కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన వారే. ఈ క్రమంలో… నెలలు గడుస్తున్నా.. ఉన్న 8మందిలో ఒకర్ని ఎల్పీ నేతగా ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారన్న ప్రశ్నకు పార్టీ వర్గాల్లోనే సమాధానం దొరకడం లేదు. ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు చోట్ల అధికారంలోకి వచ్చింది బీజేపీ. అక్కడంతా ఎల్పీ నేత ఎన్నిక పూర్తయింది. కొత్త ముఖ్య మంత్రుల పరిపాలన మొదలైంది.

కానీ, కేవలం 8 మందిలో నుంచి ఒకర్ని ఎన్నుకోవడానికి నెలల సమయం కావాల్నా? ఆ విషయంలో అసలేంజరుగుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి బీజేపీ వర్గాల్లో. అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అవుతారని, అయన సమక్షంలోనే పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారని అనుకున్నా.. అసలా భేటీనే జరగలేదు. ఆ తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఒక్కొక్కరి నుండి అభిప్రాయం సేకరించారు. విషయాన్ని జాతీయ అధ్యక్షుడు నడ్డా దృష్టికి తీసుకెళ్ళి ఫైనలైజ్‌ చేస్తామన్నారు. ఆ మాట చెప్పి నెల రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు అతీగతీ లేదు. దీంతో అసలేం జరుగుతోందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది పార్టీ వర్గాల్లో.. గత అసెంబ్లీలో శాసనసభ పక్ష నేతగా రాజాసింగ్ కొనసాగారు. మతపరమైన వివాదాలతో పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసినా ఎల్పీ లీడర్‌గా కొత్తవారిని పెట్టలేదు. ఎన్నికలప్పుడు సస్పెన్షన్‌ని ఎత్తేయడం, టిక్కెట్‌ ఇవ్వడం, ఆయన గెలవడం జరిగిపోయినా.. ఇప్పుడు మరోసారి రాజాసింగ్‌కు ఛాన్స్ దక్కుతుందన్న గ్యారంటీ లేదు.

ఇక, తనకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇస్తే ఉంటా లేకుంటే లేదని చెప్పారట రాజాసింగ్‌. పార్టీలో ఉన్న అంతర్గత అంశాల కారణంగా తనకు ఆ పదవి రాదనే ఆయన అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తనకు ఎల్పీ లీడర్‌ పదవి ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నట్టు తెలిసింది. కొద్దిమంది ఎమ్మెల్యేలు ఆయనకు ఇవ్వమని చెప్పినట్టు సమాచారం. ఇక అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా తనకే కావాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని పార్టీ ప్రకటించింది కాబట్టి.. బీసీ అయిన తనకు ఫ్లోర్ లీడర్ ఇవ్వాలని అడుగుతున్నారట ఆయన. ఇక కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ మీద గెలిచిన వెంకట రమణా రెడ్డిని శాసన సభా పక్ష నేతను చేయాలన్న డిమాండ్ పార్టీ నుంచి వినిపిస్తోంది. పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఆయనవైపే మొగ్గుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఇలా రకరకాలుగా ఇంటర్నల్ పాలిటిక్స్ కారణంగానే పార్టీ శాసన సభా పక్షనేత ప్రకటన ఆలస్యం అవుతున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన రావచ్చంటున్నారు. అలా రాకుంటే గనుక ఇక లోక్‌సభ ఎన్నికలదాకా అంతే సంగతులని అంటున్నారు. మరి ఈ సెషన్‌లోనైనా బీజేఎల్పీ లీడర్‌ ఎన్నికవుతారా? లేక లోక్‌సభ ఎన్నికల తర్వాతికి వాయిదా పడుతుందా అన్నది చూడాలి. గతంలో GHMC ఫ్లోర్ లీడర్ ఎన్నిక విషయంలో కూడా బీజేపీ ఇలాగే తాత్సారం చేసింది.