Off The Record: బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దూకుడు వెనుక అసలు రహస్యం ఏంటి? మునుపెన్నడూ లేనివిధంగా ఈ మధ్యకాలంలో ఆయన ప్రత్యర్ధులపై రెచ్చిపోవడం వెనుక వ్యూహం ఏంటి? బీజేపీ సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా మాట్లాడటం వెనక మర్మం ఏంటి? ఆ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఏమంటున్నారు?
బీజేపీ శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన నాటి నుంచి మాంచి దూకుడు మీదున్నారు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. అదను దొరికితే చాలు… పదునైన రాజకీయ విమర్శలతో ప్రత్యర్థుల మీద విరుచకుపడుతున్నారాయన. ప్రధానంగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెడుతున్నాయన్న టాక్ సైతం నడుస్తోంది. ఎక్కడా వెనక్కి తగ్గకుండా… ఏలేటి డోస్ పెంచుతుండటంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో అందులోని లోపాలను ఎత్తిచూపుతూ చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు బీజేపీ హైకమాండ్ ఆమోద ముద్ర ఉందా? లేదా అన్నది ఇప్పుడు ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చగా తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిందూ ఆసుపత్రికి భూమి కేటాయింపు రద్దు, మళ్లీ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న వ్యవహారంపై ఘాటైన విమర్శలు చేశారు మహేశ్వర్‌రెడ్డి. ఇటీవల ప్రభుత్వం రెండు కంపెనీలకు లోపాయికారిగా భారీ కాంట్రాక్ట్‌లు అప్పగించిందని, ఆ సందర్భంగా వందల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు బీజేఎల్పీ నేత.
ఈ ఆరోపణల పరంపర తెలంగాణ బీజేపీలో పెద్ద రచ్చకే దారితీసిందట. దీనికి తోడు అంతకు ముందు త్రిపుల్ ఆర్ ట్యాక్స్ రాష్ట్రంలో అమలులో ఉందని, బిల్లులకు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలు చేశారాయన. సివిల్ సప్లయ్స్‌లో కోట్ల రూపాయల స్కాం జరిగిందని కూడా ఆరోపించారు. మహేశ్వర్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఒక దశలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పీఎం నరేంద్రమోడీ కూడా అందుకుని, రాష్ట్రంలో త్రిపుల్ ఆర్ ట్యాక్స్ అమలు అవుతోందని కామెంట్ చేశారు. అయితే… మహేశ్వర్‌రెడ్డి ఇలాంటి ఆరోపణలతో దూకుడుగా వ్యవహరించడం తెలంగాణ బీజేపీ అగ్రనేతలు కొందరికి మింగుడు పడడంలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే అసలు ఏలేటికి పార్టీ పెద్దల గ్రీన్ సిగ్నల్ ఉందా? లేదా అన్న చర్చ జరుగుతోందట పార్టీ వర్గాల్లో. ద్వితీయ శ్రేణి నేతల్లో ఈ డౌట్ ఉందని, పెద్దోళ్లలో కూడా ఉన్నప్పటికీ బయటపడటం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి. ఈ దూకుడును భరించలేని తెలంగాణ బీజేపీ పెద్దలు ఆయనకు పగ్గాలు వేస్తారా? లేక అంతకంటే పెద్దోళ్ళ అండతో ఆయన ముందుకు పోతారా అన్నది ఆసక్తికరంగా మారింది పార్టీ వర్గాల్లో.