Off The Record: బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనగా మారాయి….కొత్త వివాదానికి కేంద్ర బిందువు అయ్యాయి…. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వుడ్‌గా చేయడం చారిత్రక తప్పిదం అని ఆయన అన్న మాటలు సొంత పార్టీ వైసీపీలోనే సెగలు పొగలు పుట్టిస్తున్నాయట. నియోజకవర్గంలో మూడు లక్షలకు పైగా ఓట్లు ఉన్న ఎస్సీలను అవమానించేలా కోన రఘుపతి మాట్లాడారంటూ ఆ సామాజిక వర్గ నేతలు, కార్యకర్తలు రగిలిపోతున్నారట. వ్యవహారం కోనకు వార్నింగ్‌లు ఇచ్చేదాకా వెళ్ళిందట. ఎమ్మెల్యే దిష్టిబొమ్మలు సైతం తగలబెట్టారు నియోజకవర్గంలో. పరిస్థితి తీవ్రతను గుర్తించిన రఘుపతి .. వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు వివరణ ఇచ్చుకున్నా. శాంతించలేదట కార్యకర్తలు. అంబేద్కర్ విగ్రహం కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పేదాకా వదలబోమనిఎస్సీ సామాజికవర్గానికి చెందిన వైసీపీ కేడరే అంటోందట.
బాపట్ల నియోజకవర్గంలో కోన రఘుపతికి ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి సహాయ నిరాకరణ మొదలైంది. ఎన్నికలు ఇంకా ఏడాదిలోకి వచ్చిన టైంలో… నియోజకవర్గంలో వరుసగా చెలరేగుతున్న రాజకీయ వివాదాలతో కోన ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. తాజాగా తనంతట తానే నోటికి పనిచెప్పి కొత్త వివాదంలో ఇరుక్కుపోయారు. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గాన్ని రెడ్లకు కేటాయించాలన్న ఆలోచనతో బాపట్ల సీటును ఎస్సీ రిజర్వుడు స్థానంగా చేశారని, ఇది చరిత్రాత్మక తప్పిదమని వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యారు కోన. ఎమ్మెల్యే తప్పుల కోసం కాచుక్కూర్చున్న రాజకీయ ప్రత్యర్థులకు తోడు దళిత సంఘాలు తీవ్రంగా రియాక్ట్ అవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట కోన. నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓట్లు ఉన్న తమను కాదని, వెయ్యి ఓట్లు కూడా లేని సామాజికవర్గానికి చెందిన కోన రఘుపతి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట దళిత సంఘాల నాయకులు. అంబేద్కర్ విగ్రహం దగ్గర క్షమాపణలు చెప్పకుంటే… తామేంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారట. దీంతో రఘుపతి పరిస్థితి ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లుగా మారిందని లోకల్ టాక్.
అసలే నియోజకవర్గంలో ఉన్న వర్గ విభేదాలు ,గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న కోన రఘుపతి ఇప్పుడు తన నోటి దురుద వ్యాఖ్యలతో మరోసారి చిక్కుల్లో పడ్డారని అంటున్నారట నియోజకవర్గంలోని సొంత పార్టీ నాయకులు. ఎమ్మెల్యేగా నోరు అదుపులో పెట్టుకుని…. అందర్నీ కలుపుకుని పోయేలా మాట్లాడాల్సిన మనిషి ఇలా అడ్డదిడ్డంగా ఎంత వస్తే.. అంత మాట అంటే.. ఊరుకుంటారా ఏంటి అంటూ… నియోజకవర్గంలో సెటైర్లు పేలుతున్నాయట. మరి నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం నేతలు కోరుతున్నట్లుగా కోన రఘుపతి క్షమాపణ చెప్పి వివాదానికి పుల్ స్టాప్ పెడతారా? లేక తన ధోరణిలో తాను సెల్ఫీ వీడియోతో వివరణ ఇచ్చాను కాబట్టి, క్షమాపణ చెప్పేది లేదంటూ వ్యవహారాన్ని మరింత సాగదీస్తారా అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్. మరి ఈ వివాదం నుంచి ఎమ్మెల్యే ఎలా బయటపడతారో చూడాలి.