Site icon NTV Telugu

Off The Record: బాలినేని అనుచరులపై వైసీపీ వేటు.. కథ మళ్లీ మొదటికేనా..?

Balineni

Balineni

Off The Record: సెట్‌ అయిందనుకుంటున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ వ్యవహారం మళ్ళీ మొదటికి వస్తోందా? అంటే.. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే.. అలానే అనిపిస్తోందంటున్నాయి రాజకీయ వర్గాలు. పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్న ఇద్దరు నాయకులపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పేరుతో సస్పెన్షన్‌ వేటేయడంతో చర్చ మళ్లీ మొదలైంది. జిల్లా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై అలక, కినుక వహించిన బాలినేని చాలా రోజుల పాటు అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. కానీ, రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఏర్పాటు చేసిన సమావేశంలో బాలినేని తిరుగులేని నాయకుడని పొగడటం, ఇక నుంచి జిల్లా పార్టీ వ్యవహారాలు ఆయన కనుసన్ననల్లోనే జరుగుతాయని చెప్పడంతో ఇక ఆల్‌ సెట్‌ అనుకున్నారు అంతా. సీఎం జగన్ మనసులో ఉన్న మాటలనే తాను చెబుతున్నానని విజయసాయి అనడంతో మాజీ మంత్రి సైతం శాంతించినట్టు చెబుతున్నారు.

కానీ… ఇంతలోనే బాలినేని సన్నిహితుడు, సంతనూతలపాడు వైసీపీ పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. పర్చూరు నియోజకవర్గ ముఖ్యనేతగా ఉన్న శ్రీనివాసరెడ్డి భార్య శ్రీలక్ష్మి ఇంకొల్లు జడ్పీటీసీ ఉన్నారు. నియోజకవర్గంలో పర్చూరు వైసీపీ ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్‌కు, శ్రీనివాసరెడ్డి వర్గానికి పొసగడం లేదట. ఆమంచి వ్యవహారాలపై భవనం దంపతులు ఇద్దరూ బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు.. దీంతో శ్రీనివాసరెడ్డిపై ఆమంచి కృష్ణమోహన్ కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దానికి అనుగుణంగానే.. అధిష్టానం ఆయన్ని సస్పెండ్‌ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు ఇటీవలే మార్కాపురం వైసీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని కూడా వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డిపై బహిరంగంగానే అవినీతి ఆరోపణలు చేశారు సూర్యప్రకాష్ రెడ్డి. ఎమ్మెల్యే సోదరులు భూ ఆక్రమణలు చేశారని, అందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ అన్ని విధాలుగా సహకరిస్తున్నారని ఆరోపించారు.

ఇదే విషయమై ఒంగోలులో జరిగిన సమీక్షా సమావేశంలో గొడవ అవడం, అందరి మీద విజయసాయి సీరియస్‌ అవడం లాంటి ఘటనలు జరిగాయి. ఆ తర్వాత పెద్దిరెడ్డిని సస్పెండ్ చేస్తూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు నేతలను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పేరుతో సస్పెండ్‌ చేసేదాకా బాలినేనికి కనీస సమాచారం లేదట. మాట మాత్రం చెప్పకుండా తన అనుచరులపై వేటు వేయడం ఏంటంటూ బాలినేని రగిలిపోతున్నట్టు తెలిసింది. పార్టీలో అసలేం జరుగుతోందో అర్ధం కావడం లేదంటూ మాజీ మంత్రి సీరియస్‌గానే ఉన్నట్టు సమాచారం. అంతా బాలినేనే చూసుకుంటారని ఓవైపు చెబుతూనే… నా నోటీస్‌లో లేకుండా నాయకుల్ని సస్పెండ్‌ చేయడాన్ని అర్థం చేసుకోవాలని అడుగుతున్నారట ఆయన. ఏ మాత్రం చర్చించకుండా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట బాలినేని. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని, మేటర్‌ ఏదైనా సరే… నేరుగా జగన్‌ దగ్గరే తేల్చుకోవాలని డిసైడైనట్టు తెలిసింది. ఈ మేరకు ఫోన్‌ సంప్రదింపులు కూడా జరిగినట్టు చెప్పుకుంటున్నారు. హాట్‌ హాట్‌గా ఉన్న ఉమ్మడి ప్రకాశం వైసీపీ పాలిటిక్స్‌ ఏ టర్న్‌ తీసుకుంటాయో త్వరలోనే తేలిపోతుందంటున్నారు.

Exit mobile version