Off The Record: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై ఇప్పుడు వైసీపీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోందట. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత కొన్నాళ్ళు ఒంగోలు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారాయన. తర్వాత షటిల్ సర్వీస్ నడుస్తోందంటున్నారు. ఓడిన, గెలిచిన నేతలతో జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి సైతం డుమ్మా కొట్టారు. అంతవరకు సరేననుకున్నా…తాజాగా ఢిల్లీ ధర్నాకు సైతం బాలినేని హాజరవకపోవడంతో… అసలాయన మనసులో ఏముంది? తదుపరి అడుగులు ఎటువైపు పడుతున్నాయన్న చర్చ మొదలైందట పార్టీవర్గాల్లో. ఓ వైపు వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే…మరోవైపు ఒంగోలులోని తన కేడర్‌కు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎలక్షన్స్‌కు ముందు ఇవే తన చివరి ఎన్నికలని చెప్పిన బాలినేని ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు సన్నిహితులు. ప్రత్యర్థుల వ్యవహారశైలితోనే తన నిర్ణయంలో మార్పు వచ్చిందని ఆయన అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముక్కుసూటి మాట్లాడే అలవాటున్న బాలినేని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలకు సైతం టార్గెట్ అయ్యారు. తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తానని, గతంలో జగన్ కరెక్టుగా చేయకపోతే పలు సందర్బాల్లో ప్రశ్నించి ఇబ్బందులు పడాల్సి వచ్చిందని కూడా కొన్ని సందర్భాల్లో అన్నారాయన. తాజాగా వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమిచాలన్న అధినాయకత్వం ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు బాలినేని. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్దిగా ఆయన్ని బరిలో నిలిపి చేతులు కాల్చుకున్నాక కూడా తిరిగి ఆయన్నే జిల్లా అధ్యక్షుడిగా నియమించాలనుకోవటం పద్ధతి కాదంటూ పార్టీ అధిష్టానానికి తెగేసి చెప్పారట. ఇతర జిల్లాల నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ పార్టీ పగ్గాలు అప్పగించాలనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని కూడా క్లారిటీ ఇచ్చేశారు మాజీ మంత్రి. ఆ విషయమై హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి సజ్జల లాంటి వారు వెళ్ళి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా… తన నిర్ణయాన్ని గట్టిగానే చెప్పేసినట్టు తెలిసింది. చెవిరెడ్డి విషయంలో అధిష్టానం నిర్ణయం మారకుంటే నా నిర్ణయం మారిపోతుందని కూడా హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది.
దీంతో తాత్కాలికంగా జిల్లా అధ్యక్షుడి నియామకంపై వెనక్కు తగ్గాల్సి వచ్చిందట వైసీపీ అధిష్టానం. అలాగే తనను ఇబ్బందులు పెట్టిన సొంత పార్టీ వ్యక్తుల బండారాన్ని త్వరలో బయట పెడతానని చెప్పి మరో బాంబు పేల్చారట ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో… ఢిల్లీ ధర్నాకు అన్ని ప్రాంతాల వైసీపీ ముఖ్యనేతలు హాజరైనా…. కానీ బాలినేని కనిపించకపోవడం హాట్ టాపిక్ అయింది పార్టీ వర్గాల్లో. తాము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమానికి కీలక నేత రాకపోవడం ఏంటంటూ వైసీపీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన అంతరంగం ఏంటో అర్ధంగాక కేడర్‌లో సైతం గందరగోళం పెరుగుతోందని అంటున్నారు. ఆయన కావాలని సైలెంట్ గా ఉన్నారా.. లేక అసలు పార్టీ నుంచే సైడ్ అవ్వాలనుకుంటున్నారా అన్న చర్చ మొదలైంది వైసీపీ వర్గాల్లో. దారుణంగా ఓడిపోయాక కూడా పార్టీ జగన్‌లో మార్పు రాలేదని, గ్రౌండ్ లెవల్ లో ఏం జరిగిందో సరైన ఫీడ్ బ్యాక్ తీసుకోకుండా… ఇప్పటికీ తాను చెప్పిందే వినాలన్న ధోరణిలోనే ఉన్నారంటూ బాలినేని తనకు అత్యంత సన్నిహితుల దగ్గర అంటున్నట్టు చెప్పుకుంటున్నారు.
కనీసం సీనియర్స్ మాటవినే అలవాటు లేదని, మమ్మల్ని మేం ఫణంగా పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నా పార్టీలో కనీస గౌరవం లేదన్న భావనలో ఆయన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వాతావరణంలో పార్టీ మార్పుపై బాలినేని ఇప్పటికిప్పుడు ఓ నిర్ణయం తీసుకోకున్నా… మార్పు ఖాయమన్న ప్రచారం మాత్రం మళ్ళీ మొదలైంది ఒంగోలు పొలిటికల్ సర్కిల్స్‌లో. జనసేనలోకి వెళ్లే అవకాశం ఉందన్నది కొందరి గట్టి అభిప్రాయం. ఆయన మాత్రం యధావిధిగా ఆ విషయంలో మౌనంగానే ఉన్నారు. బాలినేని విషయంలో జగన్ వైఖరి ఏంటి? బుజ్జగింపుల పర్వం మొదలవుతుందా? లేక పోతేపోనీ అని వదిలేస్తారా అని ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.