NTV Telugu Site icon

Off the Record: బీజేపీకి మాజీ మంత్రి రాజీనామా.. మరి అడుగులు ఎటువైపు..?

Babumohan

Babumohan

Off the Record: అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున తొలిసారి గెలిచారు బాబూమోహన్‌. 1998 ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారాయన. తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచే రెండోసారి గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. ఇక 2014లో గులాబీ కండువా కప్పుకుని మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు బాబూమోహన్‌. 2018లో బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో కాషాయంలోకి జంప్‌ కొట్టారాయన. కమలం పార్టీ తరపున పోటీ నాడు ఘోరంగా ఓడిపోయారు మాజీ మంత్రి. ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అందోల్‌ నుంచి మరోసారి ఓటమి తప్పలేదు బాబూమోహన్‌కు. ఆ ఓటమితో కొన్నాళ్ళు సైలెంట్‌గా సైడైపోయిన మాజీ మంత్రి.. ఈసారి బీజేపీ ఎంపీ టిక్కెట్‌ ఆశిస్తున్నారట. ఆ మాట వినగానే పార్టీ పెద్దలు నిర్మొహమాటంగా నో చెప్పేయడంతో హర్ట్‌ అయిన బాబుమోహన్‌.. కాషాయ కండువా తీసి పక్కన పడేశారు.

బీజేపీతో బంధం తెగిపోయిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చేశారు బాబుమోహన్‌. దీంతో ఇప్పుడు ఆయనఏ గూటి పక్షి అనవుతారోనన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. వాస్తవంగా బాబూమోహన్ బీజేపీపై ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆందోల్ బీజేపీ టికెట్ కోసం బాబుమోహన్ కి ఆయన కొడుకు ఉదయ్ కి కోల్డ్ వార్ నడిచింది. అలాగే తనకు థర్డ్ లిస్ట్‌లో టిక్కెట్‌ ఇవ్వడాన్ని కూడా అవమానంగా ఫీలయ్యారట. ఒకవైపు బీజేపీ అధిష్టానం ఆయనకు ఆలస్యంగా టికెట్ ఇవ్వడం, అదే సమయంలో అనూహ్యంగా ఆయన కుమారుడు బీజేపీకి గుడ్ బై చెప్పి.. బీఆర్‌ఎస్‌లో చేరడంతో నాడు ఏం చేయాలో పలుపోలేదట బాబూమోహన్‌కు. తనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులు పన్నిన పన్నాగంలో తన కుమారుడు చిక్కుకున్నాడంటూ అప్పట్లో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారాయన. అలాగే బీజేపీలో వర్గ విభేదాలు ఉన్నాయని.. పార్టీ రాష్ట్ర నాయకత్వం తన విషయంలో అంత సానుకూలంగా లేదని కూడా అన్నారు.

ఈ పరిణామ క్రమంలోనే బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తాజాగా వెల్లడించారు మాజీ మంత్రి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బాబూ మోహన్ బీజేపీకి బై బై చెప్పడం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీకి ఎంత వరకు నష్టమన్న లెక్కలు తెరమీదికి వస్తున్నాయి. అటు ఆయన తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ కూడా పెరుగుతోంది. ఈసారి వరంగల్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట ఆయన. అది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కాబట్టి టిక్కెట్‌ కోసం కాంగ్రెస్, BRSలను సంప్రదిస్తారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌కు మరోసారి అవకాశం లేదన్న ప్రచారంతో ఆ దిశగా గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. మరో వైపు ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన దామోదర రాజనర్సింహ, బాబు మోహన్ రాజకీయంగా విరోధులు అయినా మంచి సంబంధాలు ఉన్నాయట. దీంతో కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో బాబూమోహన్‌ తదుపరి అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి.