Off The Record: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్…పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. పార్టీకి పునర్ వైభవం తీసుకు రావాలని గులాబీ బాస్ కేసీఆర్ ప్రయత్నిస్తుంటే…ఒక్కొక్కరుగా పార్టీ వీడటం ఆ పార్టీని అంతర్గతంగా కుంగదీస్తోంది. ఇదే సమయంలో వస్తున్న ఒపీనియన్ పోల్స్ కూడా ఆశాజనకంగా లేవు. అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ ప్రదర్శన ఉండబోదని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితి నుంచి వెంటనే బయట పడాలని బిఆర్ఎస్ భావిస్తోంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేసీఆర్ రంగంలోకి దిగారు. అసలు పార్టీకి నష్టం ఎక్కడ జరిగింది ? పార్టీ బలహీన పడటానికి కారణాలేంటని వాస్తు పండితుల సలహాలు సూచనలు తీసుకున్నారు. వారి సూచనలతో సలహాల మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు.
ప్రస్తుతం కార్యాలయానికి ఉన్న వాస్తు దోషం కారణంగానే.. బీఆర్ఎస్ పార్టీ ఎవీ కలిసి రావడం లేదని పండితులు..కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. వారి సలహాలు సూచనల మేరకు కార్యాలయానికి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ భవన్ తూర్పు అభిముఖంగా ఉంటే…వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అలా రాకపోకలు సాగించడం మంచిది కాదని పండితులు సూచించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఇకపై ఈశాన్యం వైపు నుంచి రాకపోకలు సాగించాలని నిర్ణయించారట గులాబీ బాస్ కేసీఆర్. ఈ మేరకు వాహనాలు వచ్చి వెళ్లేలా కొత్తగా ర్యాంపును సిద్ధం చేస్తున్నారు. అలాగే వీధి పోటును దృష్టిలో ఉంచుకుని లక్ష్మినరసింహ స్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని సైతం గేటుకు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రాంగణంలో కూడా అవసరమైన మేరకు స్వల్ప మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈశాన్యం వైపు నుంచి రాకపోకలు సాగించడం వెనుక.. ట్రాఫిక్ సమస్య కూడా ఒక కారణం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వాయువ్యం దిశలో ఉన్న గేటు వద్ద కాసేపు కూడా వాహనాలు నిలిపే పరిస్థితి లేదు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12 వైపు వెళ్లే రహదారి వెంట వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దీంతో తెలంగాణ భవన్‌లోకి వెళ్లేందుకు ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వాస్తు నిపుణుల సూచనల మేరకు తాజా మార్పులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఒక వైపు అధికారం కోల్పోయిన బాధ, మరోవైపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలి అనే పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ మొదట…కార్యాలయంలో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజా మార్పులు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్, ఆ పార్టీ ఎంత మేరకు కలిసి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
