NTV Telugu Site icon

Off The Record: అక్కడ వైసీపీ, టీడీపీలకు వణుకు పుట్టిస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి..!

Chirala

Chirala

Off The Record: బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అదే పార్టీ తరఫున చీరాల అభ్యర్దిగా పోటీ చేశారు. రెండు నెలల క్రితం వరకూ వైసీపీ పర్చూరు ఇన్ఛార్జ్‌గా ఉన్న ఆమంచి ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి తన మకాంను చీరాలకు మార్చేశారు.. గతంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిన సందర్బంలో ఓ రేంజ్ లో ఆ పార్టీ అధినేతని ఆడేసుకుని బయటకు వచ్చిన ఆమంచి.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ ను ఒక్కమాట అనలేదు. తన రాజకీయ ప్రయాణం చీరాల నియోజకవర్గంతోనే ముడిపడి ఉన్నందున, ఆ పార్టీ తరపున చీరాల టిక్కెట్‌ వచ్చే అవకాశం లేనందున వీడిపోతున్నానంటూ ముక్తాయించారు. వైసీపీ అధిష్టానం చివరి నిమిషంలో అయినా తనకు చీరాల నుంచి ఛాన్స్‌ ఇస్తుందని ఆశించిన ఆమంచి చివరికి టీడీపీ నుంచి వెళ్ళిన కరణం వెంకటేష్‌కు ఇవ్వడంతో అసంతృప్తికి గురయ్యారు. చివరికి కాంగ్రెస్‌ గూటికి చేరి బరిలో దిగడంతో చీరాలలో ముక్కోణపు పోటీ అనివార్యమైంది.

ఇక్కడ టీడీపీ తరపున ఎం.ఎం.కొండయ్య పోటీ చేశారు. 2014లో కాంగ్రెస్‌ను వీడిన ఆమంచి కృష్ణమోహన్‌ నవోదయం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఈసారి కూడా అదే ఎత్తుగడ వేసినా హస్తం సింబల్ అయితే అందరికీ సులువుగా అర్దం అవుతుంది. సింపుల్‌గా చెప్పుకోవచ్చనుకుని భావించే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారన్న టాక్‌ ఉంది. ఆమంచి చీరాల నుంచి పర్చూరుకు మారినప్పుడు అప్పటిదాకా ఆయన వెంట నడిచిన కేడర్‌… కరణం వెంకటేష్ వైపునకు టర్న్ అయిందట. అలాగే కరణం ఫ్యామిలీ పార్టీ మారేటప్పుడు తమవెంట తెచ్చుకున్న అనుచరుల్లో కొందరు తిరిగి టీడీపీ వైపు వెళ్ళిపోయారు. ఇలా వైసీపీ నుంచి కరణం, టీడీపీ తరపున కొండయ్య వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్న టైంలో అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి స్థానికంగా పట్టున్న ఆమంచి కృష్ణమోహన్‌ ఎంట్రీతో సీన్ మారిపోయిందన్నది లోకల్‌ టాక్‌. ఇప్పుడాయన ఎవర్ని దెబ్బకొట్టబోతున్నారు? లేక ఇద్దర్నీ కొట్టేస్తారా అన్న చర్చ జరుగుతోంది.

ఆయన సొంత సామాజిక వర్గం కాపు నేతలతో పాటు మత్స్యకార, ఎస్సీ, దేవాంగ, పద్మశాలి ఓట్‌ బ్యాంక్‌ చీలిపోయి ఉండవచ్చన్న అంచనాలున్నాయి. ఆమంచికి టర్న్ అయి ఉంటాయని భావిస్తున్న ఓట్లు ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి అనుకూల సామాజిక వర్గాలు కావటంతో ఆ పార్టీకి ఎంతోకొంత దెబ్బ పడవచ్చన్న విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి మాలకొండయ్యది యాదవ సామాజికవర్గం కావడంతో… ఆ కులం ఓట్లు వైసీపీ నుంచి కూడా టీడీపీకి టర్న్‌ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే ఓటు తమకు వేసి… ఎంపీ ఓటు మీ ఇష్టం అంటూ ఆమంచి అనుచరులు ఓటర్లకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మాజీ ఎమ్మెల్యే ఎంత రాజకీయం చేసినా టైం చాలా తక్కువ ఉండటం మైనస్‌ కావచ్చన్న మాట ఆయన సన్నిహితుల నుంచే వినిపిస్తోంది. గెలుపు కోసం ముగ్గురు అభ్యర్థులు ఎవరికి వారే వ్యూహాలకు పదును పెట్టి పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు. తమతో కలిసి వచ్చే సామాజిక వర్గాలపై ప్రధానంగా దృష్టి సారించారు. దీంతో ఆమంచి వల్ల వైసీపీ, టీడీపీల్లో ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుందన్న చర్చ జరుగుతోంది.