NTV Telugu Site icon

Off The Record: తమ్మినేని సీటుకి వైసీపీ రెబల్స్ ఎసరు పెట్టారా..?

Sklm

Sklm

Off The Record: శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆమదాలవలస సమ్‌థింగ్‌ స్పెషల్‌. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఆయన మేనల్లుడు, టీడీపీ నేత కూన రవికుమారే రాజకీయ ప్రత్యర్థి కావడం, పొలిటికల్‌ పోరు మామా అల్లుళ్ళ మధ్యే జరగడం ఇక్కడ ఆసక్తికర పరిణామం. దశాబ్ద కాలంగా ప్రధాన పోటీ ఈ ఇద్దరి మధ్యే ఉంటోంది. ఐతే.. 2019 ఎన్నికల తరువాత ఆమదాలవలస వైసిపి మూడు గ్రూపులైంది. తమ్మినేని కుటుంబ సభ్యుల వైఖరిని నిరసిస్తూ పొందూరు మండలం మాజీ ఎంపిపి సువ్వారి గాంధీ, చింతాడ రవికుమార్ ఆయనకు రివర్స్‌ అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఈసారి కూడా టిక్కెట్‌ నాదేనని చెబుతున్నారు తమ్మినేని. మెదట్లో కొడుకు చిరంజీవినాగ్ కు టిక్కెట్ ఇవ్వాలని అడిగినా… వైసీపీ అధిష్టానం సుముఖంగా లేకపోవడంతో చివరికి తానే బరిలో ఉండాలని డిసైడయ్యారట ఆయన. కానీ.. రెబెల్‌ నేతలు మాత్రం రివర్స్‌ గేర్స్‌ వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది నియోజకవర్గంలో. తమ్మినేనికి కాకుండా యువతకు అవకాశం ఇవ్వాలంటూ వాయిస్‌ రెయిజ్‌ చేస్తున్నారు. అధిష్టానం నచ్చజెప్పడంతో చింతాడ రవికుమార్ కొంత సైలెంట్ అయినా… సువ్వారి గాంధీ మాత్రం తగ్గడం లేదట. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ తాడేపల్లి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట ఆయన. పార్టీలో తన పరిచయాలన్నింటినీ వాడుతూ టిక్కెట్ కోసం అస్ర్త శస్ర్తాలు సిద్దం చేసుకుంటున్నట్టు తెలిసింది. ఈసారి టిక్కెట్‌ తమదంటే తమదేనంటూ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నాయి తమ్మినేని , సువ్వారి వర్గాలు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికి మూడు సీట్లు మాత్రమే అధికారికంగా ప్రకటించింది వైసిపి. అందులో ఆమదాలవలస లేదు. దీంతో రెండు వర్గాలు ఆశల పల్లకిలో ఊరేగుతున్నాయి. రాజకీయాలలో చివరి క్షణంలో ఏదైనా సాధ్యమే కాబట్టి … టిక్కెట్ విషయమై సీనియర్ నేత అయిన తమ్మినేని కూడా గుబులుగానే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదన్నా ఈక్వేషన్స్ తేడా కొడతాయా అన్న మీమాంసలో ఉందట స్పీకర్ వర్గం. టిక్కెట్‌ మనదేనని సీతారామ్‌ ధీమాగా చెబుతున్నా…నియెజకవర్గంలో కొనసాగుతున్న అనిశ్చితితో అనుచరుల్లో మాత్రం సందేహాలు అలాగే ఉన్నాయంటున్నారు. పార్టీలో గ్రూపులు ఓ రేంజ్‌లో పెరిగిపోయి చివరికి గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయి. తాడో పేడో తేల్చుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటోందట సువ్వారి గాంధీ వర్గం. ఒకవేళ టిక్కెట్ దక్కకుంటే.. ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని అంటున్నారు గాంధీ అనుచరులు. ఎన్నికల ముందు అసమ్మతి తారా స్దాయికి చేరటంతో ఆమదాలవలస రాజకీయం రసకందాయంలో పడింది.
టిక్కెట్ ఎవరికి ఇచ్చినా… మరో వర్గం కలసి పనిచేసే పరిస్థితి లేకపోవడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు.

ఇప్పటికే పార్టీ పెద్దలు రెబల్ నేతలను పిలిచి మాటాడారని తెలిసింది. ఏం చెప్పినా సరే… ముందు టిక్కెట్‌, తర్వాతే ఏదైనా అంటోందట సువ్వారి వర్గం. దీంతో చివరికి ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. సీనియర్ లీడర్ గా ఉన్న తమ్మినేని సీతారాంకు టిక్కెట్ ఇస్తారా , లేక రెబల్ నేత సువ్వారి గాంధీకి చాన్స్ ఇస్తారా అన్న ఆసక్తి పెరుగుతోంది. ఎవరికి ఇచ్చినా… పరస్పరం సహకరించుకునేలా ఒప్పించాక ఇస్తేనే ఉపయోగమని, లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న హెచ్చరికలు వస్తున్నాయి ద్వితీయ శ్రేణి నుంచి.