NTV Telugu Site icon

Off The Record: ఆళ్ల.. పార్టీలో ఉన్నట్టా? లేనట్టా?

Rk

Rk

Off The Record: ఆళ్ళ రామకృష్ణారెడ్డి …. 2014, 2019లో వరుసగా రెండుసార్లు మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు… మనకు పవర్‌ వస్తే… పొడిచేస్తా, ఇరదీసేస్తానని తెగ ప్రగల్భాలు పలికిన నాయకుడు… 2019 నుంచి 24 వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నా… పెద్దగా ఇరగదీసిందేం లేదన్నది లోకల్‌ టాక్‌. ప్రతిపక్షంకన్నా… సొంత పార్టీ నేతల్నే ఎక్కువగా ఇబ్బంగి పెట్టారన్న అపప్రధ మూటగట్టుకున్నారట ఆర్కే. ఆ క్రమంలోనే…ఆళ్ళ రామకృష్ణారెడ్డికి, వైసీపీ అధిష్టానానికి మధ్య గ్యాప్ వచ్చింది ….అది పెరిగి పెద్దదై ఆయన పార్టీని వదిలేదాకా వెళ్ళింది వ్యవహారం. 2024 ఎన్నికలు సమీపిస్తున్న టైంలో షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ గూటికి చేరారు ఆళ్ళ. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో గానీ…అనూహ్యంగా తిరిగి వైసీపీ వైపే వచ్చేశారు మాజీ ఎమ్మెల్యే. షర్మిలకు అత్యంత ఆప్తుడిగా చెప్పుకునే రామకృష్ణారెడ్డి వైసీపీలోకి ఎందుకు వెళ్ళిపోయారన్నది మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌. అయితే తిరిగి పార్టీలోకి వచ్చినా… అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్ళ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారన్న అభిప్రాయం అధిష్టానంలో ఉందట. అందుకు తగ్గట్టే… ఫలితాల తర్వాత ఎక్కడా ఆయన జాడ లేదు. మంగళగిరి వైసీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదట.

దీంతో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పార్టీలో ఉన్నా లేనట్టేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. ఆయన అలా సైలెంట్‌ అవడానికి కారణం తాను అత్యంత అభిమానించే నాయకురాలు షర్మిల దగ్గర మార్కులు కొట్టేయడానికా , లేక తనకు సీటు ఇవ్వకుండా , రకరకాల లెక్కలు చెప్పి వేరే అభ్యర్ధికి ఇచ్చిన వైసీపీ అధిష్టానం మీద రివెంజ్‌ తీర్చుకోవడమా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట మంగళగిరిలో. అసలు నియోజకవర్గం పరిధిలో ఏం జరుగుతున్నా ఆయన పట్టించుకోవడం లేదట. కేసులు, కుటుంబ వ్యవహారాలతో పాటు తాను నమ్ముకున్న వ్యవసాయాన్ని చక్కబెట్టుకోవడానికే టైం సరిపోవడం లేదని, ఇక కార్యకర్తల్ని పట్టించుకునే టైం లేదని అంటున్నట్టు తెలిసింది. కుదిరితే వివాదాలకు దూరంగా ఉండండి, లేదంటే ప్రత్యర్థి పార్టీల దగ్గరికి వెళ్లి లొంగిపోండంటూ… తనను కలిసిన కేడర్‌కు ఉచిత సలహాలు సైతం ఇస్తున్నారట ఆళ్ళ. పైగా 2014 నుంచి 24 వరకు నియోజకవర్గంలోని ప్రజల కోసం, తాను అనేక పనులు చేసి ఆర్థికంగా బాగా చితికిపోయానని, అందుకు కారణం గత ప్రభుత్వాలేనంటూ తమ పార్టీని కూడా టార్గెట్‌ చేస్తున్నారట ఆయన.

ఒక ఎమ్మెల్యేగా తనకు కనీసం ఫండ్స్ ఇచ్చి ఆదుకున్న దాఖలాలు లేవని, అలాంటి పార్టీకి నేనెందుకు ఉచిత సేవ చేయాలని సన్నిహితులతో అంటున్నారట మంగళగిరి మాజీ ఎమ్మెల్యే. టిడిపితో ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల కొంతమంది వైసీపీ కార్యకర్తలు వెళ్లినా , కుదిరితే వాళ్ళకు సరెండర్‌ అవ్వండి, లేదంటే మీరు కూడా ఊరు వదిలి వెళ్లిపోండి, అంతేకానీ అనవసరంగా గొడవలకు పోయి కేసుల్లో ఇరుక్కుంటే నేనేం చేయలేనని చేతులెత్తేసినట్టు చెప్పుకుంటున్నారు. అసలు తనకు టికెట్ ఇవ్వకుండా, సామాజిక అంశాలను తెరమీదకు తీసుకొచ్చి కొత్త అభ్యర్థులకు కట్టబెట్టారని సమస్యలు ఏమన్నా ఉంటే వెళ్ళి వాళ్ళకే చెప్పుకోండని నిష్టురంగా అంటున్నట్టు తెలిసింది. అసలు ఎమ్మెల్యే గానే పనికిరాని నేను, నియోజకవర్గంలో నాయకత్వానికి మాత్రం ఎలా సరిపోతానంటూ కాడి కిందపడేశారట ఆళ్ళ. ఓవైపు ఆళ్ళ, మరోవైపు మురుగుడు హనుమంతరావు వ్యవహారాలను చూసి ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తోందట లోకల్‌ వైసీపీ కేడర్‌. ఎన్నికలకు ముందు మేమంటే ,మేమని ,ముందుకు దూసుకు వచ్చిన వైసిపి నాయకులు ఇప్పుడు సైలెంట్‌గా సైడ్ పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కార్యకర్తలు. పార్టీ అధిష్టానం దీనికి ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో మరి.