Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెండు అడుగుల ముందుకు…నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. నాయకుల మధ్య సమన్వయలేమితో పాటు ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. జిల్లాపై పట్టు కోసం నాయకుల మధ్య పోటీ పెరగడంతో పార్టీ బలోపేతం పక్కకు వెళ్ళి పంచాయతీలు తెరమీదికి వస్తున్నాయి. ఇవి ముదిరి డీసీసీ అధ్యక్షుల మార్పు దాకా వెళ్తున్నాయి. ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షుడిని మార్చాలని జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు రాష్ట్ర ఇన్ఛార్జ్ థాక్రే కి ఫిర్యాదు కూడా చేశారట.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పట్టు సాధించే పనిలో ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. జిల్లాలోని ఐదారు నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికే టికెట్లు ఇవ్వాలని ఆయన పార్టీ నాయకత్వంపై వత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే తాజా వివాదానికి కూడా కారణమట. గతంలో కూడా గ్రూపుల పంచాయతీలే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ని దెబ్బతీశాయి. అదే పునరావృత్తం అవుతున్నట్టు కనపడుతోంది. ప్రేమ్ సాగర్ రావు ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ పై అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారట. జిల్లాలో నియోజకవర్గాల ఇన్చార్జిల ఎంపిక విషయంలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే.. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి థాక్రే ..ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్‌కి అసిఫాబాద్ వివాదాన్ని సెటిల్ చేసే బాధ్యత అప్పగించారు. దీంతో బుధవారం ఆయన జిల్లాలో పర్యటించి మండలాల వారీగా సమీక్షలుచేశారు. ఒకటి రెండు రోజుల్లో నివేదిక ఇస్తారని చెబుతుండగా తర్వాత ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్న ఉత్కంఠ జిల్లా కాంగ్రెస్ నేతల్లో పెరుగుతోంది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో లంబాడా.. గోండులలో ఎవరికి టికెట్లు ఇవ్వాలనేది ప్రధాన సమస్య. ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ఓ వర్గం గోండులకు టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. అదిలాబాద్ జిల్లాలో మరో వర్గం లంబాడీలకు ఇవ్వాలని ఒత్తిడి పెంచుతోంది. ఇలా రెండు డిమాండ్ల మధ్య నాయకులలో అంతరం పెరుగుతోందట.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరి సీటుకు వాళ్లు ప్రయత్నం చేసుకోవడం కంటే జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాల్లో పట్టు సాధించే పనిలో ఉన్నారు నాయకులు . అందుకే చిన్న పంచాయితీలు కూడా పెద్దవి అవుతున్నాయి. అది ముదిరి ఇప్పుడు ఏకంగా డీసీసీ అధ్యక్షుడిని మార్చమనేదాకా వచ్చింది. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.