Site icon NTV Telugu

Train Incident: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్!

Train

Train

Train Incident: ఓడిశాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్యా ఎక్స్‌ప్రెస్ (12251) రైలు 11 బోగీలు పట్టా తప్పాయి. ఈ ఘటన గత రాత్రి 11.54 గంటల సమయంలో కటక్ సమీపంలోని నేరగుండి స్టేషన్ (ఖుర్దా డివిజన్) వద్ద చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే, అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్‌ఓ అశోక్ కుమార్ మిశ్రా వెల్లడించారు. పట్టాలు తప్పిన 11 బోగీలు ఏసీ కోచ్‌లు అని అధికారాలు తెలిపారు. ఘటనకు విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులను ప్రారంభించారు.

Read Also: SRH-HCA: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆరోపణలపై స్పందించిన హెచ్‌సీఏ!

ఈ ప్రమాదం కారణంగా కొన్ని రైళ్ల రూట్‌ను మార్చారు. మళ్లీ ట్రాక్ పునరుద్ధరించే వరకు కొన్ని రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తాయని రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే శాఖ ప్రయాణికుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. దిగ్విజయ్ ప్రాంతానికి చెందిన టెలిఫోన్ నంబర్ 8991124238 ను అందుబాటులో ఉంచారు. ఈ మధ్య కాలంలో ఓడిశాలో రైలు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. 2023లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. శాలిమార్-చెన్నై కొరొమండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఓ మాల్గాడి రైలు ఒకదానికొకటి ఢీకొనడంతో 296 మంది మరణించగా, 1,200 మందికిపైగా గాయపడ్డారు. ఇంతక ముందు 2022లో, కోరాయి రైల్వే స్టేషన్ వద్ద ఓ మాల్గాడి పట్టాలు తప్పి స్టేషన్ భవనాన్ని బలంగా ఢీకొంది. ఆ ఘటనలో రెండు మంది మరణించగా, 12 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఇప్పటివరకు జరిగిన తాజా ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేదని అధికారులు ధృవీకరించారు. అయితే, ప్రమాదానికి గల కారణాన్ని పరిశీలించేందుకు రైల్వే ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. రైల్వే మార్గం పునరుద్ధరించేందుకు ప్రమాద సహాయ బృందాలు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Exit mobile version