BCCI secretary Jay Shah confirmed No E-Tickets for ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ మ్యాచ్‌లను మైదానంలో చూడాలంటే అభిమానులు ఒరిజినల్ టిక్కెట్స్ (ఫిజికల్ టికెట్స్)ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందట. మెగా టోర్నీకి ఈ-టికెట్ సౌకర్యం లేదని సమాచారం. మ్యాచ్ చూడాలంటే ఒరిజినల్ టిక్కెట్స్ తప్పనిసరి అని బీసీసీఐ సెక్రటరీ జై షా గురువారం జరిగిన సమావేశం అనంతరం ధృవీకరించారు. ఈ విషయాన్ని అధికారికంగా బీసీసీఐ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
భారతదేశంలో ఎక్కడి స్టేడియంలో అయినా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ చూడాలంటే.. ఫిజికల్ టిక్కెట్ తప్పనిసరి. ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకున్నప్పటికీ.. స్టేడియంలో మ్యాచ్ చూడాలంటే పిజికల్ టిక్కెట్‌ను తీసుకోవాలి. పిజికల్ టిక్కెట్ తీసుకునే క్రమంలో అభిమానులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చోవడం, తొక్కిసలాటకు గురవుతున్నారు. ఈ ఏడాది హైదరాబాద్‌లో మ్యాచ్ జరిగిన రెండుసార్లు తొక్కిసలాట జరిగింది. మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. దాంతో ఈ-టిక్కెటింగ్ తెరపైకి వచ్చింది.
వన్డే ప్రపంచకప్ 2023లో ఈ-టిక్కెటింగ్ సౌకర్యం ఉంటుందని అందరూ భావించారు. అయితే తాజాగా జరిగిన బీసీసీఐ సమావేశం అనంతరం మెగా టోర్నీలో ఈ-టిక్కెటింగ్ సౌకర్యం లేదని జై షా చెప్పారు. ‘ఫిజికల్ టిక్కెట్లు పొందడానికి 7-8 కేంద్రాలు ప్లాన్ చేశాం. అహ్మదాబాద్, లక్నో వంటి పెద్ద స్టేడియంలలో ఈ-టిక్కెట్ల నిర్వహణ చాలా కష్టం. ముందుగా ద్వైపాక్షిక సిరీస్‌లలో ఇ-టిక్కెటింగ్‌ని అమలు చేసి.. ఆపై పెద్ద టోర్నమెంట్‌లలో అమలు చేస్తాం. టిక్కెట్ల ధరతో సహా అన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తాం’ అని జై షా పేర్కొన్నారు.
ఆగస్టు 10 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే దీనిపై ఐసీసీ, బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. టికెట్ల ధరలు, మైదానాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇప్పటికే బీసీసీఐ రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో చర్చించింది. మరోవైపు మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేయాలనే విజ్ఞప్తులు ఐసీసీకి చేరాయి. వీటన్నింటికి త్వరలోనే పరిష్కారం దొరకనుంది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఐసీసీ ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: IND vs WI Dream11 Prediction: భారత్-వెస్టిండీస్ డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
