NTV Telugu Site icon

Revanth Reddy: ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగానికి ప‌చ్చజెండా..

Revanth 2

Revanth 2

రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం(చౌటుప్పల్‌-అమ‌న్‌గ‌ల్‌-షాద్‌న‌గ‌ర్‌-సంగారెడ్డి- 182 కి.మీ) జాతీయ ర‌హ‌దారి ప్రక‌ట‌న‌కు సంబంధించిన అడ్డంకులు తొల‌గిపోయాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ ర‌హ‌దారిగా ప్రక‌టించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీతో స‌మావేశ‌మైన త‌ర్వాత ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ‌ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్రక‌టించేందుకు ప్రతిపాద‌న‌లు కోరాల‌ని ఎన్‌హెచ్ఏఐ అధికారుల‌ను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ అంశంతో పాటు తెలంగాణ‌లో జాతీయ ర‌హ‌దారుల విస్తర‌ణ‌కు అనుమ‌తి, ప‌లు ముఖ్యమైన రాష్ట్ర ర‌హ‌దారుల‌ను జాతీయ ర‌హ‌దారులుగా అప్‌గ్రేడ్ చేయాల‌ని జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారులుగా విస్తరించాల్సిన రాష్ట్ర ర‌హ‌దారుల జాబితాను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి అంద‌జేశారు. ఆయా ర‌హ‌దారులను జాతీయ ర‌హ‌దారులుగా ప్రక‌టించాల్సిన ఆవ‌శ్యక‌త‌ను వివ‌రించారు. కేంద్రమంత్రి నితిన్ గ‌డ్కరీని సీఎం రేవంత్ రెడ్డి ఆయ‌న అధికారిక నివాసంలో బుధ‌వారం మ‌ధ్యాహ్నం క‌లిశారు. సుమారు గంట‌న్నర‌పాటు కొన‌సాగిన భేటీలో రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల విస్తర‌ణ‌, జాతీయ ర‌హ‌దారుల ప‌నుల‌కు సంబంధించిన వివిధ స‌మ‌స్యల‌ను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తొలుత రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) నార్తర‌న్ పార్ట్ చౌటుప్పల్‌-భువ‌న‌గిరి-తుఫ్రాన్‌-సంగారెడ్డి-కంది ప‌రిధిలో యూటిలిటీస్ (క‌రెంటు స్తంభాలు, భ‌వ‌నాల త‌దిత‌రాలు) తొల‌గింపున‌కు సంబంధించి వ్యయం విష‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మ‌ధ్య నెల‌కొన్న ప్రతిష్టంబ‌న‌పై చ‌ర్చసాగింది. యూటిలిటిస్ త‌ర‌లింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భ‌రించాల‌ని ప‌ది నెల‌ల క్రితం భార‌త జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమ‌తి తెల‌ప‌క‌పోవ‌డంతో ఈ విష‌యంలో ప్రతిష్టంబ‌న నెల‌కొంది.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత‌లు స్వీక‌రించిన త‌ర్వాత యూటిలిటీస్ త‌ర‌లింపు వ్యయాన్ని భ‌రించేందుకు స‌మ్మతిస్తూ ఎన్‌హెచ్ఏఐకు లేఖ పంపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గ‌డ్కరీ వ‌ద్ద ప్రస్తావించ‌గా ఆయ‌న ఈ అంశంపై ఎన్‌హెచ్ఏఐ అధికారుల‌ను ఆరా తీశారు. యూటిలిటీస్ త‌ర‌లింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భ‌రించాల‌ని మెలిక పెట్టినదెవ‌రంటూ అధికారుల‌పై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక‌వేళ రాష్ట్ర ప్రభుత్వం యుటిలిటీస్ త‌ర‌లింపు వ్యయాన్ని భ‌రిస్తే భ‌విష్యత్‌లో టోల్ ఆదాయంలో స‌గం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంద‌న్నారు. యుటిలిటీస్ త‌ర‌లింపు వ్యయాన్ని తామే భ‌రిస్తామ‌ని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్‌కు సంబంధించి భూ సేక‌ర‌ణ‌, విధానప‌ర‌మైన ప్రక్రియ‌ల‌ను వేగ‌వంతం చేయాల‌ని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి తెలిపారు. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని ఆరు వ‌రుస‌ల ర‌హ‌దారిగా, హైద‌రాబాద్ నుంచి క‌ల్వకుర్తి వ‌ర‌కు ఉన్న ర‌హ‌దారిని నాలుగు వ‌రుస‌లుగా విస్తరించాల‌ని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తుల‌కు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ (క‌న్‌స్ట్రక్షన్ ఆఫ్ రూర‌ల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌) నిధుల మంజూరుకు అవ‌స‌ర‌మైన ప్రతిపాద‌న‌లు పంపాల‌ని కేంద్రమంత్రి సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.